Begin typing your search above and press return to search.

కోమాలో మాయ‌లోకం: క‌ళ్లు తెర‌వ‌గానే త‌న‌ ముగ్గురు పిల్ల‌ల గురించి అడిగిన టీనేజీ అమ్మాయి!

వైద్య విజ్ఞానానికి కూడా అంతుచిక్కని వింత సంఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి.

By:  Sivaji Kontham   |   15 May 2026 7:00 AM IST
కోమాలో మాయ‌లోకం: క‌ళ్లు తెర‌వ‌గానే త‌న‌ ముగ్గురు పిల్ల‌ల గురించి అడిగిన టీనేజీ అమ్మాయి!
X

వైద్య విజ్ఞానానికి కూడా అంతుచిక్కని వింత సంఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. ఫ్రాన్స్‌లోని లియాన్‌కు చెందిన 19 ఏళ్ల క్లెలియా వెర్డియర్ అనే యువతి విషయంలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జూన్ 2025లో అధిక మొత్తంలో మందులు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఈ టీనేజ‌ర్‌ ప్రాణాలు కాపాడటం కోసం వైద్యులు మూడు వారాల పాటు కోమాలో ఉంచారు. అయితే మూడు వారాల తర్వాత స్పృహలోకి వచ్చిన బాలిక‌ నోటి నుంచి వచ్చిన మొదటి మాటలు విని వైద్యులతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా విస్మయానికి గురయ్యారు.

క్లెలియా కోమా నుంచి కళ్లు తెరవగానే తన ఆరోగ్యం గురించి కానీ.. ప్రమాదం గురించి కానీ అడగలేదు. ``నా ముగ్గురు పిల్లలు ఎక్కడ? వారిని చూడాలి`` అంటూ ఆందోళన చెందడం ప్రారంభించింది. నిజానికి ఈ టీనేజీ అమ్మాయికి పెళ్లి కాలేదు.. కనీసం గర్భం కూడా దాల్చలేదు. కానీ తన మెదడులో మాత్రం తాను ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చానని ఏడేళ్ల పాటు వారిని అల్లారుముద్దుగా పెంచానని అత్యంత స్పష్టమైన జ్ఞాపకాలు ముద్రపడిపోయాయి. తనకు పుట్టిన ముగ్గురు పిల్లలకు మిలా, మైల్స్, మైలీ అని పేర్లు కూడా పెట్టుకున్నానని అందులో మైలీ పుట్టిన కొద్దిసేపటికే మరణించిందని చెబుతూ ఆమె కన్నీరుమున్నీరైంది.

ఆ యువ‌తి వివరిస్తున్న తీరు చూస్తుంటే.. వినేవాళ్ల‌కు అది కేవలం కలలా కాకుండా ఒక వాస్తవ జీవితంలా అనిపించింది. పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు పడిన ప్రసవ వేదన.. పుట్టిన తర్వాత వారిని మొదటిసారి గుండెలకు హత్తుకున్నప్పుడు కలిగిన అనుభూతి... వారికి అన్నం తినిపించడం.. కథలు చెప్పి నిద్రపుచ్చడం.. ఇలా ప్రతి క్షణాన్ని ఆమె కళ్ళకు కట్టినట్లు వివరించింది. తన తల్లిదండ్రులు చూడగానే ``మీరు తాతయ్య, అమ్మమ్మలు అయ్యారు`` అని ఆ టీనేజీ గాళ్ చెప్పడం చూసి వారు షాక్‌కు గురయ్యారు. వైద్యులు ఆమెకు అసలు గర్భమే రాలేదని.. ఆ పిల్లలు కేవలం క‌ల‌ల్లో ఊహ మాత్రమేనని నిరూపించడానికి చాలా సమయం పట్టింది.

న్యూరాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. కోమాలో ఉన్నప్పుడు మెదడు నిశ్చలంగా ఉండదు. తీవ్రమైన గాయాలు లేదా మందుల ప్రభావం వల్ల మెదడు కొన్నిసార్లు అత్యంత స్పష్టమైన కలలను లేదా భ్రమలను సృష్టిస్తుంది. క్లెలియా విషయంలో కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి కోమాలో ఉన్న ఆ మూడు వారాల సమయాన్ని త‌న‌ మెదడు ఏడేళ్ల సుదీర్ఘ జీవిత కాలంగా మార్చేసింది. ఆ సమయంలో ఆ యువ‌తి అనుభవించిన భావోద్వేగాలు, ప్రేమ, బాధ అన్నీ నిజమైనవి కావడంతో మేల్కొన్న తర్వాత కూడా ఆ మాయాలోకం నుంచి బయటకు రాలేకపోయింది.

ప్రస్తుతం క్లెలియా కోమా నుంచి కోలుకుని ఏడాది గడిచినా ఇప్పటికీ తన `పిల్లల` కోసం పరితపిస్తూనే ఉంది. అవి కేవలం కలలు కావొచ్చు కానీ.. నేను ఒక తల్లిగా ఆ జీవితాన్ని అనుభవించాను. ఆ పిల్లలు నాకు దూరమైనందుకు ఇప్పటికీ బాధగా ఉంది! అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మనిషి మెదడు ఎంతటి క్లిష్టమైనదో అది సృష్టించే భ్రమలు ఎంత శక్తివంతమైనవో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. ఆ ఏడేళ్ల ఊహాజ‌నిత‌ జీవితం క్లెలియా జ్ఞాపకాల్లో ఒక చెరగని సంతకంలా మిగిలిపోయింది.