భారత్ పై దుష్ప్రచారం... పాక్ ను గట్టిగా తగులుకున్న ఫ్రెంచ్ నేవీ!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 23 Nov 2025 7:20 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), పాకిస్థాన్ లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. దానికి కొనసాగింపుగా పాక్ సైన్యం చేసిన పనికి గట్టిగా సమాధానం చెప్పి, ఇస్లామాబాద్ ను టచ్ చేసి వణికించింది. తర్వాత సీజ్ ఫైర్ కోసం రిక్వస్ట్ పెట్టుకుంది.
దీంతో... భారత్ అంగీకరించింది.. మూడో వ్యక్తి / దేశం ప్రమేయం లేకుండా ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. వాస్తవం ఇలా ఉంటే... సీజ్ ఫైర్ తర్వాత పాక్ అధికారులు, మంత్రుల నుంచి మాత్రం విభిన్నమైన స్టేట్ మెంట్లు రావడం మొదలయ్యాయి. భారత్ తో జరిగిన ఘర్షణల్లో తమదే ఆధిపత్యమని.. భారత్ యుద్ధ విమానాలకు తాము కూల్చేశామని చెప్పుకుంది.
అయితే.. పాకిస్థాన్ చేసిన ఈ ఆత్మవంచన స్టేట్ మెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఈ తరహా విమర్శలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ నేవీ అధికారి కూడా తమ గొప్పతనాన్ని ధృవీకరించారంటూ పాక్ మీడియా కథనాలు వండి వడ్డించింది! దీంతో... ఆ తప్పుడు కథనాలపై తాజాగా ఫ్రెంచ్ నేవీ స్పందించి, గట్టిగా తగులుకుంది.
అవును... భారత్ - పాక్ మధ్య ఈ ఏడాది మే నెలలో జరిగిన సంఘర్షణ, రాఫెల్ జెట్ల నష్టం సమయంలో భారత్ పై పాకిస్థాన్ వైమానిక ఆధిపత్యాన్ని కనబరించిందని.. ఈ విషయాన్ని ఫ్రెంచ్ కమాండర్ సైతం ధృవీకరించారంటూ పాకిస్థాన్ మీడియా కథనాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా పాక్ మీడియా వాదనలను ఫ్రెంచ్ నేవీ ఆదివారం తీవ్రంగా ఖండించింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఫ్రెంచ్ కమాండర్ కెప్టెన్ జాక్విస్ లానే వైమానిక దాడిలో పాకిస్థాన్ ఆధిపత్యాన్ని ధృవీకరించారని పాకిస్థాన్ జియో టీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ వైమానికి దళం మెరుగ్గా సిద్ధంగా ఉందని పేర్కొంది. దీనిపై తాజాగా స్పందించిన ఫ్రెంచ్ నావికాదళం.. దాన్ని "నకిలీ వార్తలు" అని పేర్కొంది.
పాక్ మీడియా కథనాన్ని తోసిపుచ్చుతూ... ఈ ప్రకటనలు కెప్టెన్ లానేకి ఆపాదించబడ్డాయని.. అతను ఏ విధమైన ప్రచురణకు తన సమ్మితిని ఎప్పుడూ తెలుపలేదని.. ఆ వ్యాసంలో విస్తృతమైన తప్పుడు సమాచారం ఉందని పేర్కొంది. దీంతో.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పై బురదజల్లే ప్రయత్నంలో మరోసారి పాక్ ఎదవ అయిపోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్పందించిన బీజేపీ నేత అమిత్ మాల్వియా!:
ఈ పరిణామంపై బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా స్పందించారు. ఇందులో భాగంగా... పాకిస్థాన్ తప్పుడు సమాచార యంత్రాంగం పనితీరు మరోసారి బహిర్గతమైందని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ నష్టాల గురించి కల్పిత కథనాలు పాకిస్థాన్ ప్రచారంలో ఒక భాగంగా మారాయని అన్నారు. అధికారిక సంస్థలు వారి ప్రచారాన్ని తిప్పికొట్టడం ప్రారంభించినప్పుడు.. పాక్ తప్పుడు సమాచార టీమ్ ఎంత నిరాశకు గురైందో తెలుస్తోంది అని అన్నారు.
రాఫెల్ పై పాక్ అక్కసు... దెబ్బ అలాంటిది మరి!:
భారతదేశ వైమానిక పోరాట సామర్థ్యానికి రాఫెల్ కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ కు చెందిన డస్టాల్ ఏవియేషన్ తయారు చేసిన ఈ విమానాలకు భారత్ కొనుగోలు చేసినప్పటి నుంచీ పాక్ తరచూ తప్పుడు ప్రచారాన్ని చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఇటీవల పాక్ - భారత్ ఘర్షణల్లో రాఫెల్ విమానాలను చైనా తయారు చేసిన వ్యవస్థలను ఉపయోగించి తాము కూల్చేశామని పాక్ చెప్పుకుంటూ ఆత్మవంచన చేసుకొంటుంది.
