Begin typing your search above and press return to search.

బూతులే జెన్ జీ భాషనా? ఇంత సంస్కారహీనతా?

డిజిటల్ విప్లవం పుణ్యమా అని సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చింది. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను, నిరసనలను వ్యక్తం చేయడానికి ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారింది.

By:  A.N.Kumar   |   2 Aug 2026 1:48 PM IST
బూతులే జెన్ జీ భాషనా? ఇంత సంస్కారహీనతా?
X

డిజిటల్ విప్లవం పుణ్యమా అని సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చింది. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను, నిరసనలను వ్యక్తం చేయడానికి ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారింది. అయితే ఇటీవల కాలంలో రాజ్యాంగం కల్పించిన 'భావప్రకటన స్వేచ్ఛ' అనే ప్రాథమిక హక్కును కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇటీవల ఓ 15 ఏళ్ల బాలిక దేశ ప్రధానిని ఉద్దేశించి సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకర పదజాలంతో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను, ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. కానీ ఆ విమర్శలకు కొన్ని సరిహద్దులు, బాధ్యతలు ఉంటాయి. విధానపరమైన విమర్శ వేరు... వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడటం వేరు.

క్షమాగుణం ఓకే... కానీ సమర్థన తగునా?

ఈ ఘటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ బాలిక వయసును, పరిణతి లోపాన్ని దృష్టిలో పెట్టుకుని క్షమించడం ఆయన పెద్దరికానికి నిదర్శనం. అయితే ఈ ఘటనను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్య భాషను "జెన్‌జీ భాష" అని, "కొత్త తరం స్టైల్" అని సమర్థించే ప్రయత్నాలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. లైకులు, షేర్లు, వ్యూస్ కోసం హద్దులు దాటడం పరిపాటిగా మారింది. విమర్శల్లో వాస్తవాలు, విధానాల ఆధారంగా ప్రశ్నించడం పోయి, వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత పెరిగింది. బూతులు మాట్లాడటం ఏ తరం సంస్కృతిలోనూ భాగం కాదని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

మార్గదర్శకత్వం వహించాల్సిన బాధ్యత ఎవరిది?

డిజిటల్ యుగంలో పిల్లలకు కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే సరిపోదు. దాన్ని ఎలా బాధ్యతాయుతంగా ఉపయోగించాలో నేర్పించడం అత్యంత ఆవశ్యకం. "డిజిటల్ బాధ్యత, సంభాషణ మర్యాదలు, సామాజిక విలువలు నేర్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలి.

సభ్యత, సంస్కారం, పరస్పర గౌరవం వంటి ప్రాథమిక విలువలే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పునాదులు. స్వేచ్ఛ అనేది అభిప్రాయాలను ధైర్యంగా, సభ్యతతో చెప్పడానికి ఉపయోగపడాలి గానీ, ఇతరులను అవమానించేందుకు కాదు. తక్షణ ప్రచార ఆరాటం కంటే బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వాన్ని పెంపొందించుకోవడమే భావితరాలకు, సమాజానికి శ్రేయస్కరం.