ఎవరు అతీతం... పథకాల పదనిసల్లో.. ప్రజాగ్రహ ముప్పు.. !
నిజానికి వైసీపీ హయాంలో ఇలానే అనుబంధ పథకాలను జత చేసి.. ఖజానాను ఖాళీ చేశారన్న వాదన బలంగా వినిపించింది.
By: Garuda Media | 8 Oct 2025 4:00 PM ISTసంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పుకాదు. పేదలకు మెరుగైన జీవనాన్ని అందించాలన్న సంకల్పం ఉంచుకోవడమూ తప్పుకాదు. కానీ.. అదే పనిగా పథకాల పేరుతో పంపకాలు చేయడం ప్రారంభిస్తే.. అది ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ హయాంలో ఇలాంటి ప్రజాగ్రహమే పెల్లుబికింది. ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో విరివిగా పథకాలను అమలు చేయ డంతో మధ్యతరగతి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.
''మేం కడుతున్న పన్నులను పప్పుబెల్లాల్లా పంచుతారా?.'' అంటూ.. ఆనాడు మధ్యతరగతి ప్రజలు, ఉ ద్యోగులు అడిగిన ప్రశ్నలు.. ఇంకా మరుపునకు రావడం లేదు. ఈ వ్యాఖ్యలు, ప్రశ్నలు కేవలం వైసీపీ కేనా?.. అంటే కాదు. ప్రస్తుత కూటమికి కూడా వర్తిస్తాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో.. ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసింది. అన్నదాత సుఖీభవ ఇవ్వడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ.. ఇదేసమయంలో ఒకదాని కోసం మరొకటి అంటూ.. తెచ్చిన పథకాలపై చర్చసాగుతోంది.
నిజానికి వైసీపీ హయాంలో ఇలానే అనుబంధ పథకాలను జత చేసి.. ఖజానాను ఖాళీ చేశారన్న వాదన బలంగా వినిపించింది. అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని ఇదే సీఎం చంద్రబాబు గతంలో రోడ్డెక్కారు. ఊరూవాడా జగన్ సర్కారుపై విప్లవం సృష్టించారు. ప్రజాస్వామ్యంలో జగన్ కు ఎన్ని హెచ్చరికలు వర్తిస్తాయో.. అన్నీ.. చంద్రబాబుకు, కూటమి సర్కారుకు కూడా వర్తిస్తాయి. ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు ఉంటాయి. కాబట్టి.. అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా కూటమి వ్యవహరించాలి.
లేదా.. సదరు నిధులను ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నామో.. మథ్యతరగతి వర్గానికి వివరించాలి. ప్రస్తు తం ఏ టీకొట్టు, బడ్డీ కొట్టు వద్ద నలుగురు గుమిగూడినా.. ''ఆళ్ల సొంత జేబుల్లోంచి ఇస్తున్నారా?'' అనే మాటే వినిపిస్తోంది. ఒకప్పుడు.. దీనిని మనమే ప్రోత్సహించామన్న వాదన కూటమి నాయకులకు గుర్తుండే ఉంటుంది. సో.. గత తప్పులే చేస్తే.. గతం మాదిరిగానే వ్యవహరిస్తే.. పథకాల పదనిసల పేరుతో నాడు బటన్లు నొక్కినా, నేడు చెక్కులు ఇచ్చినా.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఒక లిమిట్ అనేది చాలా ముఖ్యం. లేకపోతే... విపరిణామాలకు ఎవరూ అతీతులు కాదన్నది అనేక సందర్భాల్లో రుజువైంది.
