Begin typing your search above and press return to search.

మహిళా ఫ్రీ బస్ సక్సెస్ కాలేదా ?

ఇక చూస్తే తెలంగాణా కర్ణాటకలో ఈ పధకం ఏ కండిషన్లూ లేకుండా అమలు చేశారు. పైగా అధికారంలోకి వస్తూనే చేశారు.

By:  Satya P   |   18 Aug 2025 5:00 PM IST
మహిళా ఫ్రీ బస్ సక్సెస్ కాలేదా ?
X

మహిళలకు ఉచిత బస్సు పధకం. ఈ ఆకర్షణీయమైన పధకాన్ని మొదట ప్రారంభించింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 మేలో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీని వారు ఇవ్వడం జరిగింది. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా అమలు చేశారు. తెలంగాణాలో కూడా అదే ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకం అని చెప్పారు. ప్రచారం ధాటీగా చేశారు. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. వెంటనే అమలు చేశారు.

ఏపీలోనూ అదే హామీ :

కట్ చేస్తే ఏపీలో కూడా అదే పధకాన్ని అమలు చేస్తామని టీడీపీ కూటమి 2024 ఎన్నికల వేల భారీ హామీ ఇచ్చింది ఇక అధికారంలోకి వచ్చాక దాదాపుగా పద్నాలుగు నెలలకు పైగా సమయం తీసుకుని ఎట్టకేలకు ఈ ఆగస్టు 15న ఈ పధకానికి శ్రీకారం చుట్టింది. కర్ణాటక తెలంగాణాల్లో ఈ పధకాన్ని మొత్తం అన్ని సర్వీసులకు అమలు చేస్తూంటే ఏపీలో అయిదు సర్వీసులకే పరిమితం చేశారు. మరి అన్ని సర్వీసులకూ ఇచ్చి రాష్ట్రమంతా ఫ్రీ బస్సు అని వారికి ఎంతో మేలు చేసిన ఈ పధకం నిజంగా అక్కడ సక్సెస్ అయిందా అన్నదే ఇపుడు చర్చ.

పొలిటికల్ మైలేజ్ రాలేదా :

ఇక చూస్తే తెలంగాణా కర్ణాటకలో ఈ పధకం ఏ కండిషన్లూ లేకుండా అమలు చేశారు. పైగా అధికారంలోకి వస్తూనే చేశారు. మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు రాజకీయంగా ఈ పధకం వల్ల మేలు జరిగిందా అంటే లేదు అనే జవాబు వస్తోంది. అదెలా అంటే 2023లో కర్ణాటక తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ 2024 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ రెండు రాష్ట్రాలలోనూ పెద్దగా సీట్లు గెలవలేదు తెలంగాణాలో ఎనిమిది ఎంపీ సీట్లు మాత్రమే గెలిస్తే కర్ణాటకలో మూడు ఎంపీలే గెలిచింది. అంటే మహిళా లోకానికి ఎంతో చేశామని చెప్పుకున్నా రాష్ట్రమంతా ఫ్రీగా బస్సులలో తిప్పినా కూడా ఈ పధకం ఓట్లు రాల్చలేదు అన్నది అర్ధం అవుతోంది కదా అంటున్నారు విశ్లేషకులు.

ఆ కాడికి నష్టమే కదా :

ఇక మహిళలకు ఉచిత బస్సుల వల్ల ప్రయోజనం సంగతి పక్కన పెడితే ఆటో కార్మికులు ఆగ్రహం చెంది కాంగ్రెస్ కి దూరం అయ్యారని కూడా ఫలితాలు చెబుతున్నాయి. అంతే కాదు ఈ పధకం అమలుతో మగవారు కూడా తమకు బస్సులలో సీట్లు లేవని తాము ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహించారు. సమాజంలో ఒక వర్గాన్ని ఎత్తి మరో వర్గాన్ని పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఈ పధకం వల్ల ఆ రెండు ప్రభుత్వాలూ చూశాయి అంతే కాదు ఖజానాకి పెద్ద చిల్లు పడింది. చేయాల్సిన ఇతర కార్యక్రమాలు ఆగుతున్నాయి. దీంతో ఆ వర్గాలలో అసహనం పెరుగుతోంది అన్నది మరో విశ్లేషణ.

జాబ్స్ ఇవ్వాలి కానీ :

ఊరకే బస్సులలో మహిళలకు తిప్పితే ఏమి లాభం జాబ్స్ ఇవ్వాలి కానీ అని తెలంగాణా బీజేపీకి చెందిన మహిళా నాయకురాలు మాధవీలత ఇప్పటికే తెలంగాణా కాంగ్రెస్ మీద ఫ్రీ బస్ విషయంలో ఘాటు విమర్శలు చేశారు. అవి ఏపీకీ వర్తిస్తున్నాయని అంటున్నారు. ఏకంగా రెండు వేల కోట్లు ఖజానాకు చిల్లు పెట్టుకుని ఉచిత బస్సు అని ఊదరగొట్టినా దాని వల్ల ఒరిగేది ఏముంటుంది అన్నది కూడా నిర్వేదం నుంచి వస్తోంది.

కొత్త పధకం అయితే మోజు :

ఇక దాదాపుగా రెండున్నర ఏళ్ళ నాటి పాత పధకం ఇది. దీనిని అమలు చేయడం ఆ రాష్ట్రాల విషయంలో కొత్త ఏమో కానీ ఏపీ దాకా వచ్చేసరికి పాతబడిపోయింది, ఆ మోజు కూడా తీరింది అని అంటున్నారు. పైగా పేటెంట్ హక్కులు అయితే పూర్తిగా కాంగ్రెస్ వి. దాంతో టీడీపీ పొలిటికల్ గా పెద్దగా క్లెయిం చేసుకునే వీలు ఉండదని అంటున్న వారూ ఉన్నారు. ఇలా వేల కోట్ల రూపాయలు ఈ ఉచిత పధకానికి వెచ్చించే బదులు కొత్త బస్సులు కొని విరివిగా అవసరం ఉన్న ప్రాంతాలలో నడిపితే గమ్యానికి వేగంగా సేఫ్ గా ఆర్టీసీ బస్సులలో తాము చేరుతున్నామన్న ఆనందం మొత్తం స్త్రీ పురుషులు అన్న తేడా లేకుండా అందరిలో ఉంటుంది కదా అని అంటున్నారు. మొత్తం మీద ఫ్రీ బస్ అయితే పెద్దగా పొలిటికల్ మైలేజ్ ఇచ్చేది లేదు అన్నది రూఢీ అయిన విషయం అంటున్నారు.