Begin typing your search above and press return to search.

నోబెల్ బహుమతి వచ్చినా తెలియని వైనం.. అసలు ఏం జరిగిందంటే?

టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో పట్టణాలను మొదలుకొని మారుమూల ప్రాంతాలలో కూడా ఇంటర్నెట్ సౌలభ్యం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Madhu Reddy   |   8 Oct 2025 9:00 PM IST
నోబెల్ బహుమతి వచ్చినా తెలియని వైనం.. అసలు ఏం జరిగిందంటే?
X

టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో పట్టణాలను మొదలుకొని మారుమూల ప్రాంతాలలో కూడా ఇంటర్నెట్ సౌలభ్యం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెట్వర్క్ ఆధారంగా ప్రపంచ నలుమూలల జరిగే ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే క్షణాలలో తెలిసిపోతుంది. అయితే ఇంత టెక్నాలజీ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ.. ఒక వ్యక్తికి ఏకంగా నోబెల్ బహుమతి వచ్చినా.. ఆ విషయం తెలియకపోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. అయితే నోబెల్ బహుమతి వచ్చినా ఈ విషయం ఆయనకు ఎందుకు తెలియలేదు? అసలు ఏం జరిగింది? ఆయన ఎక్కడ ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ నోబెల్ బహుమతి కథ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

విషయంలోకి వెళ్తే.. ఇటీవల రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేసిన వారికి నోబెల్ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. వారిలో అమెరికాకు చెందిన ఫ్రెడ్ రామ్స్ డెల్ కూడా ఉన్నారు. అయితే ఆయనకు నోబెల్ వచ్చిన విషయం తెలియలేదట. కారణం మనుషులు, సామాజిక మాధ్యమాలకు దూరంగా అమెరికాలోని మౌంటెన్ లో హైకింగ్ లో ఉన్నారు. అయితే ఆయనకు నోబెల్ వరించింది అనే విషయం చెప్పడానికి నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్ల్ మాన్ రామ్స్ డెల్ కి ఫోన్ చేశారు. కానీ అప్పటికే రామ్స్ డెల్ తన భార్య లారా ఓనీల్ తో కలిసి దట్టమైన అడవిలో హైకింగ్ చేస్తున్నారు. దీంతో వీరి ఫోన్ కి సిగ్నల్స్ అందలేదట.

కొంతసేపటికి రామ్స్ డెల్ భార్య లారా ఫోన్ కలవడంతో అధికారులు ఆమెకు ఈ విషయం తెలియజేశారు. దీంతో సంతోషం పట్టలేక ఒక్కసారిగా కేకలు వేస్తూ గంతులు వేసింది లారా.. ఆ కేకలు విని రామ్స్ డెల్ భయపడ్డారట. ఎలుగుబంటిని చూసి భయపడిందని కంగారు పడ్డారట . అయితే కొంతసేపటికి ఈ విషయం ఆమె రామ్స్ డెల్ కి తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ నోబెల్ వరించడం పై హర్షం వ్యక్తం చేస్తూ పలు కామెంట్లు చేశారు. తాజాగా ఒక హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.." నేను ఈ నోబెల్ ఊహించలేదు" అంటూ తెలిపారు.

రామ్స్ డెల్ చేపట్టిన పరిశోధన విషయానికి వస్తే.. పరధీయ రోగనిరోధక శక్తి (పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్) కి సంబంధించి ఆవిష్కరణలు చేపట్టారు. అందులో భాగంగానే ఆటో ఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్లకు సరికొత్త చికిత్సలను అభివృద్ధి చేసే దిశగా బాటలు పరిచారు.. ఈ విషయం పై వీరిని నోబెల్ కమిటీ కూడా ప్రశంసించింది.

రామ్స్ డెల్ విషయానికి వస్తే.. ఈయన శాన్ ఫ్రాన్సిస్కో లోని సొనోమా బయో థెరపాటిక్స్ లో శాస్త్రీయ సలహాదారుడుగా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా నెట్వర్క్ కి దూరంగా అడవులలో హైకింగ్ లో ఉండడం వల్లే అసలు విషయం తెలియలేదని తెలుస్తోంది.