Begin typing your search above and press return to search.

లోకేష్ ఆలోచనకు ఫ్రాన్స్ నుంచి మద్దతు.. లైన్ లో మరికొన్ని దేశాలు!

అవును... పిల్లలపై సోషల్ మీడియా అలవాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. వారిలో సృజనాత్మకతకు అది అడ్డుపడుతుందనే చర్చ ఇటీవల విపరీతంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   27 Jan 2026 4:00 PM IST
లోకేష్ ఆలోచనకు ఫ్రాన్స్ నుంచి మద్దతు.. లైన్ లో మరికొన్ని దేశాలు!
X

టీనేజర్ల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విషయంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తొలి అడుగు వేయడంతో.. ఈ అంశంపై చర్చ మరింత ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల దావోస్ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు చెబుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఈ విషయంపై భారత్ లోనూ మరోసారి చర్చ మొదలైంది. ఈ సమయంలో ఆస్ట్రేలియాను మరోదేశం ఫాలో అవుతుంది!

అవును... పిల్లలపై సోషల్ మీడియా అలవాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. వారిలో సృజనాత్మకతకు అది అడ్డుపడుతుందనే చర్చ ఇటీవల విపరీతంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఫ్రాన్స్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఓ చట్టం తీసుకురానుంది. ఈ విషయాన్ని దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రకటించారు. దీంతో.. ఆస్ట్రేలియా తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న మరో దేశంగా ఫ్రాన్స్ నిలిచింది!

ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభలోని శాసనసభ్యులు మద్దతివ్వగా.. సెనెట్‌ లో దీనిపై చర్చలు జరిపి, బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రెసిడెంట్ మేక్రాన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే... పిల్లలు గంటలకొద్దీ సమయాన్ని స్క్రీన్‌ కు కేటాయించడం వల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ బిల్లును సెనెట్ ఆమోదించే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా... సోమవారం దిగువ సభలోని శాసనసభ్యులు బిల్లులోని కీలక అంశాలను అంగీకరించారు.. తరువాత 116-23 ఓట్లతో దానికి అనుకూలంగా ఓటు వేశారు.. అనంతరం.. ఈ బిల్లు ఆమోదం కోసం ఎగువ సభ అయిన సెనేట్‌ కు వెళ్తుంది. ఇది అక్కడా ఆమోదం పొందితే.. యువ టీనేజర్లు స్నాప్‌ చాట్, ఇన్‌ స్టాగ్రామ్, టిక్‌ టాక్ వంటి నెట్‌ వర్క్‌ లను ఉపయోగించలేరు.

ఈ సందర్భంగా స్పందించిన ఫ్రాన్స్ అధికారులు... 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియాపై నిబంధనలు సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వస్తాయని.. 15 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను తొలగించడానికి సామాజిక మాధ్యమాల సంస్థలకు డిసెంబర్ 31 వరకు సమయం ఇస్తున్నామని తెలిపారు. ఈ బిల్లులో పాఠశాలల్లో పిల్లల మొబైల్‌ ఫోన్‌ వాడకం పైనా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో యూరప్‌ లో.. డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్, ఐర్లాండ్ కూడా ఈ సోషల్ మీడియా నిషేధం విషయంలో ఆస్ట్రేలియా అనుసరించాలని ఆలోచిస్తున్నాయని అంటున్నారు. ఈ నెల ప్రారంభంలో.. యూకే ప్రభుత్వం కూడా 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించడంపై సంప్రదింపులు ప్రారంభించిందని కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని దేశాలు ఈ విధంగా అడుగులు వేసే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా... వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడానికి దావోస్ వెళ్లిన లోకేష్.. బ్లూమ్ బెర్గ్ న్యూస్ తో మాట్లాడుతూ.. ఒక రాష్ట్రంగా తాము ఆస్ట్రేలియా అండర్-16 చట్టాన్ని అధ్యయనం చేస్తున్నామని.. ఈ విషయంలో బలమైన చట్టపరమైన చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు. ఒక నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులు సోషల్ మీడియాలో ఉండకూడదని తాను గట్టిగా భావిస్తున్నానని.. ఎందుకంటే, వారు ఏమి చూస్తున్నారో వారికి అర్థం కావడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే!