Begin typing your search above and press return to search.

'పంక్చర్' అయిన నమ్మకం.. 2.6 లక్షల క*డోమ్‌ల రీకాల్ కథాకమామిషు..

కార్లు రిపేరుకొస్తే కంపెనీలు వెనక్కి పిలవడం చూశాం.. పాలు సరిగ్గా లేకపోతే పారబోయడం చూశాం, చివరికి ఫోన్ బ్యాటరీ పేలితే రీకాల్ చేయడం కూడా చూశాం.

By:  A.N.Kumar   |   22 Aug 2026 8:39 PM IST
పంక్చర్ అయిన నమ్మకం.. 2.6 లక్షల క*డోమ్‌ల రీకాల్ కథాకమామిషు..
X

కార్లు రిపేరుకొస్తే కంపెనీలు వెనక్కి పిలవడం చూశాం.. పాలు సరిగ్గా లేకపోతే పారబోయడం చూశాం, చివరికి ఫోన్ బ్యాటరీ పేలితే రీకాల్ చేయడం కూడా చూశాం. కానీ ఏకంగా ఫ్రాన్స్‌ దేశంలో 2.60 లక్షల క*డోమ్‌లను నాణ్యతా లోపంతో రీకాల్ చేశారంటే... అక్కడ అధికారులకు 'లీకేజీ' వ్యవహారం ఎంత తీవ్రంగా అర్థమైందో ఊహించుకోవచ్చు!

లైంగికంగా సంక్రమించే వ్యాధులను అడ్డుకోవాలన్నా.. "ఇప్పట్లో బాబులు-పాపలు వద్దు బాబోయ్" అనుకునే దంపతులకు రక్షణ కవచంలా నిలవాలన్నా ఈ రబ్బరు ముక్కే ఏకైక ఆధారమని మనందరికీ తెలుసు. మరి అలాంటి 'జీవిత రక్షణ' పరికరంలోనే నాణ్యత లోపిస్తే? "మేము రక్షణ ఇస్తామన్నాం కానీ వంద శాతం గ్యారెంటీ అనలేదే!" అని కంపెనీలు చేతులెత్తేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఫ్రాన్స్ ఆరోగ్య సంస్థలు వెంటనే అలర్ట్ అయిపోయి "అయ్యా... ఆ బ్యాచ్ ఉత్పత్తులను అస్సలు వాడకండి.. ఇప్పటికే వాడేసుంటే వెంటనే డాక్టర్‌ దగ్గరకు పరిగెత్తండి" అని ప్రేమపూర్వక హెచ్చరికలు జారీ చేశాయి.

గతంలో 'డ్యూరెక్స్' లాంటి గ్లోబల్ బ్రాండ్లు కూడా ఇలాంటి 'ప్రమాదకర లీకుల' వల్ల బ్యాచ్‌లకు బ్యాచ్‌లను వెనక్కి పిలిచిన చరిత్ర ఉంది. కానీ ఈ ఉత్పత్తుల విషయంలో చిన్న పొరపాటు జరిగినా... తొమ్మిది నెలల తర్వాత ఇంటికొచ్చే 'సర్ ప్రైజ్'ను ఎవరు ఆపగలరు? అందుకే తయారీదారులు కేవలం లాభాల పైనే కాదు.. నాణ్యతా పరీక్షలపై కూడా కొద్దిగా దృష్టి పెడితే సగటు వినియోగదారుడికి ఈ 'షాక్‌లు' తప్పవు.

వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ప్యాకింగ్ డేట్ చెక్ చేయండి. ఎక్స్‌పైరీ దాటిన వాటి జోలికి వెళ్లి రికార్డులు సృష్టించకండి. ప్యాకెట్ లీకేజ్ ఉందో చూడండి. కవరు నలిగిపోయినా, చినిగినా దాన్ని పక్కన పడేయడమే ఉత్తమం. బ్యాచ్ నంబర్ పర్యవేక్షించండి. అధికారులు రీకాల్ చేసిన బ్యాచ్ నంబర్లతో మీ వద్ద ఉన్న ప్యాకెట్ నంబర్ సరిపోలుతుందో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోండి.

ఏది ఏమైనా కంపెనీల నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం నిజంగా విచారకరం. ప్రొడక్ట్ తయారీలో నాణ్యత పాటించకపోతే చివరికి ఆ కంపెనీల పరువే కాకుండా ప్రజల ప్రశాంతత కూడా రీకాల్ అయిపోతుంది!