Begin typing your search above and press return to search.

సంతానంతో కూడిన సంసారమే లక్ష్యం... ఆ సర్కార్ సరికొత్త ఆలోచన!

అవును... ఇటీవల కాలంలో చాలా దేశాలు జననాల రేటు తగుదలతో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

By:  Raja Ch   |   12 Feb 2026 8:00 PM IST
సంతానంతో కూడిన సంసారమే  లక్ష్యం... ఆ సర్కార్  సరికొత్త ఆలోచన!
X

ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో జననాల రేటు తగ్గుదల తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతకాలం పోతే తమ దేశంలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని.. యువ జనాభా సంఖ్య తగ్గిపోతుందని.. ఇది దేశాభివృద్ధిలో గణనీయమైన సమస్యలను తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... 29 ఏళ్లు నిండినవారికి ఫోన్ / ఈ-మెయిల్ నుంచి లేఖలు పంపాలనుకుంటుంది.

అవును... ఇటీవల కాలంలో చాలా దేశాలు జననాల రేటు తగుదలతో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో.. చాలా ఆలస్యం కాకముందే పిల్లలను కనమని ప్రోత్సహిస్తూ దేశంలోని 29 ఏళ్ల వారందరికీ ఓ లేఖ పంపాలని ఫ్రాన్స్ ప్రభుత్వం యోచిస్తోంది. లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యంపై శాస్త్రీయ ఆధారిత సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది. దీంతో త్వరలో లక్షలాది మంది ఫ్రాన్స్ యువకులు ఈ లేఖలను అందుకోనున్నారు.

‘అయ్యో.. నాకు ముందే తెలిసి ఉంటేనా’... అని ఎవరూ జీవితంలో రిగ్రీట్స్ ఫీలవ్వకుండా ఉండటనే ఈ నిర్ణయమని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది! వాస్తవానికి తగ్గుతున్న జననాల రేటును పరిష్కరించడానికి ఫ్రాన్స్ 16 పాయింట్ల ప్రణాళికను రచించింది. అందులో భాగమైన ఈ తాజా చర్య ఎలాంటి ప్రభావం చూపనుందనేది ఆసక్తిగా మారింది. సర్కార్ మాట విని యువకులు.. సంతానంతో కూడిన సంసారంపై శ్రద్ధపెడతారా అనేది వేచి చూడాలి!

ఈ సందర్భంగా స్పందించిన ఆరోగ్య మంత్రి స్టెఫానీ రిస్ట్... ఈ లేఖ పురుషులు, మహిళలు.. ఇద్దరికీ జీవ గడియారాలను సూచిస్తుందని తెలిపారు. ఇదే సమయంలో... ఫ్రాన్స్ లో వంధ్యత్వం ఫ్రాన్స్ లోని ప్రతీ ఎనిమిది జంటలలో ఒక జంటను ప్రభావితం చేస్తుందని అన్నారు. 2022లోని ఓ ప్రభుత్వ నివేదిక ప్రకారం 3.3 మిలియన్ల ఫ్రెంచ్ ప్రజలను ఈ సమస్య ప్రభావితం చేస్తుందని ఆమె గుర్తు చేశారు. ఈ సంఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

ఇదే సమయంలో... పిల్లలను కనాలా వద్దా అనేది జంటల ఇష్టమని.. ఈ విషయాన్ని నిర్దేశించడం రాజకీయ నాయకుల పాత్ర కాదు కానీ.. మహిళలకు సంతానోత్పత్తిపై మరింత అవగాహన కల్పించడం, ఎగ్స్ ను స్తంభింపచేసే ఎంపికను గుర్తు చేయడం తమ బాధ్యత అని ఆమె నొక్కి చెప్పారు. మరోవైపు. ప్రసూతి సెలవులను 16 వారాల నుంచి 26 వారాలకు పెంచడం అనేది జననాల రేటుపై ప్రభావం చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

కాగా... ఫ్రాన్స్ జాతీయ గణాంకాల సంస్థ ప్రకారం... 2010లో ఫ్రాన్స్ లో 8.28 లక్షల మంది పిల్లలు జన్మిస్తే... 2024లో ఆ సంఖ్య 6.63 లక్షలకు తగ్గింది. ఇక 2025కి వచ్చేసరికి ఫ్రాన్స్ లో జననాల సంఖ్య 6.45 లక్షలు మాత్రమే. మరోవైపు అదే ఏడాది మరణాల సంఖ్య 6.51 లక్షలు కావడం గమనార్హం. ఇదే సమయంలో.. ఫ్రాన్స్ లో 2024లో స్త్రీకి 1.61 మంది పిల్లలు ఉండగా.. 2025లో ఆ సంఖ్య 1.56కి పడిపోయింది. ఈ విషయంలోనే ఫ్రెంచ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.