Begin typing your search above and press return to search.

ఐరోపా అంటుకుంది.. ఆ రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి..

మరోవైపు స్పెయిన్‌లో గృహ నిర్మాణ, అద్దెల సంక్షోభం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

By:  A.N.Kumar   |   4 Oct 2026 1:36 PM IST
ఐరోపా అంటుకుంది.. ఆ రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి..
X

ఐరోపా ఖండంలోని రెండు ఆర్థిక వ్యవస్థలైన ఫ్రాన్స్, స్పెయిన్‌‌లు ప్రస్తుతం తీవ్ర సామాజిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ వేలాది మంది ప్రజలు, యువత రోడ్లపైకి వచ్చి చేస్తున్న ఆందోళనలు ఆయా దేశాలలో కలకలం సృష్టిస్తున్నాయి. వేర్వేరు అంశ ప్రాతిపదికన ఈ నిరసనలు ఉద్భవించినప్పటికీ.. ప్రభుత్వాల విధానాల పట్ల పౌరుల్లో పెరుగుతున్న అసంతృప్తి, నిరాశలు ఈ పోరాటాలకు ప్రధాన ఇంధనంగా మారాయి. రోజువారీ జీవితాన్ని శాసిస్తున్న ప్రాథమిక వసతుల కరవుపై పౌరులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రాన్స్‌లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. దేశ విద్యావ్యవస్థలో పేరుకుపోయిన లోపాలు, నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థి లోకం మండిపడుతోంది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడానికి అవసరమైన ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటంతో పాటు.. తరగతి గదుల కొరత విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. కనీస మౌలిక సదుపాయాలు లేని వాతావరణంలో విద్యను కొనసాగించాల్సి రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరసనకారులు వీధుల్లో నిర్వహించిన ర్యాలీలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పలు నగరాలు అట్టుడికాయి. కొద్ది ప్రాంతాల్లో ఆందోళనలు అదుపు తప్పడంతో పోలీసులు బలాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుమారు ఐదు వేల మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఫ్రాన్స్ చరిత్రలోనే నిరసనల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. విద్యా వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేసి.. మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపరచకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

మరోవైపు స్పెయిన్‌లో గృహ నిర్మాణ, అద్దెల సంక్షోభం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నియంత్రణ లేని అద్దెల పెంపు సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది. ఆదాయంలో అధిక భాగం నివాస ఖర్చులకే వెచ్చించాల్సి రావడంతో జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోతున్నాయని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల అద్దెలపై తక్షణమే పరిమితులు విధించాలని.. అద్దెకు ఉంటున్న వారిని యజమానులు అన్యాయంగా ఖాళీ చేయించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్పెయిన్‌లోని దాదాపు యాభైకి పైగా నగరాల్లో ఈ తరహా పోరాటాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

విద్య, గృహ వసతి వంటి అత్యంత ప్రాథమిక హక్కుల నిరాకరణ పట్ల పౌరుల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తి కేవలం తాత్కాలికమైనది కాదని.. ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమిక అవసరాలను తీర్చడంలో అధికార యంత్రాంగాలు విఫలమైనప్పుడు ప్రజలలో కలిగే తీవ్రమైన నిరాశే ఇటువంటి నిరసనలకు మూలకారణం. పరిస్థితి మరింత విషమించక ముందే ప్రభుత్వాలు స్పందించి.. నిరసనకారుల సమంజసమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించకపోతే.. ఈ ఉద్యమాలు మరింత తీవ్రరూపం దాల్చి దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది.