Begin typing your search above and press return to search.

కార్మిక నియమాల్లో మార్పులు.. టేక్ హోమ్ పై ఎఫెక్ట్ పడనుందా?

దేశంలో దశాబ్ధాలుగా అమలులో ఉన్న కార్మిక చట్టాల స్థానంలో తాజాగా 4 కొత్త లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

By:  Raja Ch   |   24 Nov 2025 5:00 PM IST
కార్మిక నియమాల్లో మార్పులు.. టేక్  హోమ్  పై ఎఫెక్ట్  పడనుందా?
X

దేశంలో దశాబ్ధాలుగా అమలులో ఉన్న కార్మిక చట్టాల స్థానంలో తాజాగా 4 కొత్త లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చే 29 నిబంధనలను నాలుగు కొత్త కోడ్ లుగా విలీనం చేసింది. ఇందులో.. వేతనాల కోడ్ - 2019.. సామాజిక భద్రతా కోడ్ - 2020.. పారిశ్రామిక సంబంధాల కోడ్ - 2020.. వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ - 2020 ఉన్నాయి.

అవును... దశాబ్ధాలుగా అమలులో ఉన్న కార్మిక చట్టాల స్థానంలో తాజాగా 29 నిబంధనలను నాలుగు కొత్త కోడ్ లుగా విలీనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 నవంబర్ 21 నుంచి ఈ నాలుగు లేబర్ కోడ్ లు అమలులోకి వచ్చాయి. దీంతో.. ఇప్పటి వరకూ అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను హేతుబద్ధం చేసినట్లయ్యింది. వీటితో మెరుగైన కార్మిక, ఉద్యోగ విధానాలు అమలులోకి రానున్నాయి!

ఈ సందర్భంగా ప్రతీ ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి!:

* ఉపాధి రంగం లేదా వేతన పరిమితితో సంబంధం లేకుండా.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే జాతీయ నెల వేతనంతో అన్ని ఉద్యోగాలకు కనీస వేతనాలకు చట్టబద్ధమైన హక్కు ఉంది.

* ఇదే సమయంలో.. మొదటిసారిగా గిగ్, ఫ్లాట్ ఫామ్ కార్మికులు సామాజిక భద్రత పరిధిలోకి చేర్చబడ్డారు. అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్ లో కొంత శాతాన్ని జీవిత, వైకల్య కవర్, ఆరోగ్య ప్రయోజనలు వంటి ప్రయోజనాల కోసం ప్రత్యేక నిధి అందించాలి!

* ఫిక్స్డ్ టెర్మ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ అర్హత వ్యవధిని ఐదు సంవత్సరాల కంటిన్యూస్ సర్వీస్ నుంచి కేవలం ఒక సంవత్సరానికి తగ్గించారు.

* అసంఘటిత రంగంలోని వారితో సహా అన్ని కొత్త కార్మికులకు యజమానులు ఇప్పుడు అధికారిక అపాయింట్మెంట్ లెటర్స్ ను జారీ చేయాల్సి ఉంటుంది. ఇది ఉపాధి, వేతనాలు, సామాజిక భద్రతా హక్కులకు సంబంధించిన డాక్యుమెంటరీ రుజువుగా ఉంటుంది.

* సాధారణ పని గంటలకు మించి పనిచేసే ఉద్యోగులకు (ఓవర్ టైం) వారి సాధారణ వేతన రేటుకు కనీసం రెండు రెంట్లు పరిహారం చెల్లించాలి.

* ఇదే విధంగా... వార్షిక వేతనంతో కూడిన సెలవులకు అర్హత వ్యవధిని ఏడాదిలో 240 రోజుల పని నుంచి 180 రోజులకు తగ్గించారు. దీనివల్ల ఉద్యోగులు సెలవు ప్రయోజనాలు పొందుతారు.

* తాజా నియమాల ప్రకారం ఇప్పుడు మహిళా కార్మికులు అన్ని సంస్థల్లోనూ వారి సమ్మతి, యజమాని అందించే భద్రతా చర్యలకు లోబడి, నైట్ షిప్ట్స్ లో పని చేయడానికి అనుమతించబడ్డారు.

* అదే విధంగా... పరస్పర అంగీకారం ద్వారా సేవా రంగాలలో రిమోట్ పని (వర్క్ ఫ్రమ్ హోమ్) అనుమతించబడుతుంది.

* ఇదే క్రమంలో... 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యజమానులు ఉచిత వార్షిక హెల్త్ చెక్ అప్ సేవలు అందించాలి.

* ప్రధానంగా... యజమానులు తప్పనిసరిగా నిర్ధిష్ట సమయ వ్యవధిలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఉదాహరణకు నెలవారీ వేతనాల కోసం నెక్స్ట్ మంత్ 7 రోజుల లోపు!)

* ఇంటికి, ఆఫీసుకు మధ్య ప్రయాణ సమయంలో జరిగే ప్రమాదాలు ఇకపై ఉపాధికి సంబంధించినవిగా పరిగణించబడతాయి. పరిహారం పొందడానికి అర్హత పొందుతాయి.

టేక్ హోమ్ శాలరీపై ప్రభావం ఉంటుందా?:

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన నూతన కార్మిక చట్టాలతో ఉద్యోగి టేక్ హోమ్ శాలరీపై ప్రభావం పడనుందా అనే ప్రశ్న తాజాగా లేవనెత్తబడింది. ఈ సమయంలో ఈ ప్రశ్నకు సమాధానాలు ఈ విధంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... ఆయా కంపెనీలు ఉద్యోగికి చెల్లించే మొత్తం వేతనంలో కనీసం సగభాగాన్ని మూల వేతనం (బేసిక్) గా చెల్లించాల్సి ఉంటుంది!

ఈ నిబంధనను అనుసరించి అనేక కంపెనీలు తమ సిబ్బందికి చెల్లించే జీతం విధానాలను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఉద్యోగి పొందే టేక్ హోమ్ నగదుపై ప్రభావం పడనుందని అంటున్నారు. మిగిలిన సొమ్ము పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. ఇది ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తం ఒకేసారి పొందేందుకు వెసులుబాటు ఉంటుంది.