Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో తీవ్ర విషాదం... ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య!

అయితే... తమ కుమార్తె మరణాన్ని తల్లితండ్రులు, తన అక్క ఆత్మహత్యను చెల్లి ఏమాత్రం జీర్ణించుకోలేక పోయినట్లున్నారని తెలుస్తోంది.

By:  Raja Ch   |   23 Nov 2025 5:00 PM IST
హైదరాబాద్  లో తీవ్ర విషాదం... ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య!
X

కుటుంబంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఉన్నపలంగా దూరం అయితే, ఆ విషాదాన్ని జీర్ణించుకుని బయటకు రావడం కచ్చితంగా కష్టమైన పనే! అలా అని అసాధ్యం కాదని అంటారు! ఈ క్రమంలో.. తన కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయిందనే బెంగలో, బాధలో, ఆవేదనలో ఆ కుటుంబంలోని మిగిలిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకొన్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది!

అవును... హైదరాబాద్ లో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకొంది. ఇందులో భాగంగా... అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు (తల్లి, తండ్రి, ఇద్దరు కుమార్తెలు) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో సుమారు 5 నెలల క్రితం ఆ ఇంటి పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోగా.. రెండు రోజుల క్రితం మిగిలిన కుటుంబ సభ్యులు ముగ్గురూ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే... ఎల్ఐసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే శ్రీనివాస్ (45)కు భార్య విజయలక్ష్మి (42), ఇద్దరు కుమార్తెలు కావ్య, శ్రావ్య (15) ఉన్నారు. వీరిలో ఇటీవల, సుమారు ఐదు నెలల క్రితం పెద్దకుమార్తె కావ్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. రాంనగర్ లోని ఆ ఇంటిని ఖాళీ చేసి, సుమారు నెలన్నర క్రితం బాగ్ అంబర్ పేట, రామకృష్ణానగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది ఆ కుటుంబం. అప్పటి నుంచీ అక్కడే ఉంటున్నారు.

అయితే... తమ కుమార్తె మరణాన్ని తల్లితండ్రులు, తన అక్క ఆత్మహత్యను చెల్లి ఏమాత్రం జీర్ణించుకోలేక పోయినట్లున్నారని తెలుస్తోంది. అందుకు కారణం... వారు ఇక్కడకు షిఫ్ట్ అయినప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదంట. ఆఖరికి బంధువులకు సైతం దూరంగా ఉంటూ, ఆ బాధలోనే బ్రతుకుతున్నాట్లున్నారని అంటున్నారు. ఈ క్రమంలో.. శనివారం సాయంత్రం శ్రీనివాస్ అక్క, వారిని చూడటానికి బాగ్ అంబర్ పేటకు వచ్చారు!

ఈ సమయంలో ఇంట్లో వారిని ఎంత పిలిచినా పలకకపోవడంతో పాటు, ఇంట్లో నుంచి దుర్వాసన రావడం గమనించిన శ్రీనివాస్ సోదరి.. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో... పోలీసులు ఆ ఇంటివద్దకు చేరుకుని, తలుపులు తెరిచారు. ఈ క్రమంలో... ఇంట్లో శ్రీనివాస్, ఆయన భార్య విజయలక్ష్మితో పాటు వారి చిన్న కుమార్తె శ్రావ్య చీరలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు!

ఇందులో... ప్రధాన ద్వారం వెంటిలేటర్ కు శ్రీనివాస్.. గదిలో కిటికీ ఇనుప చువ్వలకు విజయలక్ష్మి, శ్రావ్య ఉరేసుకుని కనిపించారు. అయితే.. వీరు ఉరేసుకుని ఇప్పటికే రెండు రోజులు దాటి ఉంటుందని, అందుకే మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయని అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే... ఎవరితోనూ పెద్దగా మాట్లాడని ఆ కుటుంబ సభ్యులు... స్థానికులతో ఒక విషయం మాత్రం ఎప్పుడూ చెబుతుండేవారని అంటున్నారు. ఇందులో భాగంగా... తమను పదే పదే దేవుడు పిలుస్తున్నాడని వారు చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు! ఈ నేపథ్యంలో.. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు!