Begin typing your search above and press return to search.

ఆ 'నాలుగు'.. వైసీపీ వ‌దిలేసుకోవ‌డ‌మే.. !

రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి ప‌లు జిల్లాల్లో మెజారిటీ ద‌క్క‌డం ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది.

By:  Garuda Media   |   2 Dec 2025 3:00 PM IST
ఆ నాలుగు.. వైసీపీ వ‌దిలేసుకోవ‌డ‌మే.. !
X

రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి ప‌లు జిల్లాల్లో మెజారిటీ ద‌క్క‌డం ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది. ముఖ్యంగా కీల‌క నియో జ‌క‌వ‌ర్గాల్లో జెండామోసే నాయ‌కుడు, పార్టీ వాయిస్ వినిపించే నేత కూడా క‌రువ‌య్యారు. దీంతో అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ప‌రిస్థితి ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలుగా పేరున్న కొన్ని స్థానాల్లో వైసీపీ గెలుపు మాట ఎలా ఉన్నా.. పూర్వ ప్రాభ‌వం ద‌క్కించుకోవ‌డం కూడా క‌ష్ట‌మ‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఇలాంటి వాటిలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వీటిలో రెండు స్థానాల‌ను వైసీపీ ఇప్ప‌టికీ బోణీ కొట్ట‌లేక పోయింది.

పాల‌కొల్లు: ప‌శ్చిమ గోదావ‌రి(ఉమ్మ‌డి) జిల్లాలోని పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ జెండా క‌నిపించ‌డం లేదు. వైసీపీ మాటా వినిపించ‌డం లేదు. పైగా ఇక్క‌డ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు బోణీ కూడా కొట్లలేదు. 2014, 2019, 2024 ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా నిమ్మ‌ల రామానాయుడు విజ‌యం దక్కించుకున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా.. సామాన్యుల‌కు చేరువ‌గా ఉండ‌డం ప్ర‌ధానంగా క‌లిసి వ‌స్తోంది. దీనికితోడు వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించేవారే లేకుండా పోయారు.

టెక్క‌లి: శ్రీకాకుళం జిల్లాలోని టెక్క‌లిలోనూ వైసీపీ ఇప్ప‌టి వ‌ర‌కు బోణీ కొట్ట‌లేదు. అనేక ప్ర‌య‌త్నాలు చేసినా.. అవేవీ ఒక్క పార‌లేదు. పైగా.. ఇక్క‌డ రాజ‌కీయం వైసీపీకి మరింత త‌లనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్య‌వ‌హారా లు వైసీపీకి త‌ల‌నొప్పిగా మారి.. రాజ‌కీయంగా ఇబ్బందులు తెచ్చాయి. ఇప్ప‌టికీ అదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున వ‌రుస విజ‌యాలు అందుకున్న అచ్చెన్నాయుడు ఇప్ప‌టికి రెండు సార్లు మంత్రిగా ఉన్నారు. సామాన్యుల‌కు చేరువ‌గా ఉంటూ.. పార్టీలో ఐక్య‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న అచ్చెన్న‌కు మ‌రోసారి కూడా తిరుగులేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

మంగ‌ళ‌గిరి: ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన వైసీపీ ఇప్పుడు మంగ‌ళ‌గిరిలో అజా అయిపు లేకుండా పోయింది. ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి ఉన్న‌ప్పుడు.. మంగ‌ళ‌గిరి వైసీపీకి బాగానే హ‌వాను తీసుకువ‌చ్చింది. కానీ, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాలు.. ఆళ్ల రాజీనామా-చేరిక‌.. త‌ర్వాత జ‌రిగిన అనేక ప్ల‌స్సులు-మైన‌స్‌లు వైసీపీని తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టాయి. ఇక‌, మంత్రి నారా లోకేష్ 90 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌, గ‌త 17 మాసాలుగా జ‌రుగుతున్న అభివృద్ధి కూడా ఇక్క‌డ వైసీపీకి కేరాఫ్ లేకుండా చేసింది.

ఉండి : ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉన్న ఉండి నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీకి ఏ మాత్రం ప‌ట్టు చిక్క‌డం లేదు. 2014, 2019, 2024 ఇలా వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసిన ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పాటు పాగా వేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇక్క‌డ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఓడిపోయిన సీవీఎల్‌. న‌ర‌సింహారాజు ఇప్పుడు వ‌యోః భారంతో రాజ‌కీయాలు చేసే ప‌రిస్థితి లేదు. ఆయ‌న త‌ర్వాత బ‌ల‌మైన ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కూడా లేదు.ఏదేమైనా ఈ కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌లు వైసీపీ జెండా పట్టి ముందుండి న‌డిపించే నాథుడే లేని దుస్థితి.