'గీత'లు సరిచేసుకుంటున్న మహిళా నేత!
గత 2024 ఎన్నికలకు వచ్చే సరికి.. కాపు సామాజిక వర్గం కార్డు ఉండడం, మహిళా నాయకురాలిగా ఆమెకు మంచి పేరు ఉన్న నేపథ్యంలో పార్టీ అధినేత ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
By: Garuda Media | 20 Jan 2026 7:00 AM ISTవైసీపీకి చెందిన మాజీ ఎంపీ.. సీనియర్ రాజకీయ నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్.. తన రాజకీయాల ను సరిచేసుకుంటున్నారా? వచ్చే 2029 నాటికి తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే విషయం పై ఆమె లెక్కలు వేసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసిన ఆమె విజయం దక్కించుకున్నారు. ఐదేళ్లు గడిచిపోయాయి.
గత 2024 ఎన్నికలకు వచ్చే సరికి.. కాపు సామాజిక వర్గం కార్డు ఉండడం, మహిళా నాయకురాలిగా ఆమెకు మంచి పేరు ఉన్న నేపథ్యంలో పార్టీ అధినేత ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. చివరి వరకు పోరాడారు. కానీ, ఆమె జనసేనపై బలమైన ఆరోపణలు చేయలేక పోయారు. పైగా పవన్ కల్యాణ్‌ను తమ్ముడు అని వ్యాఖ్యానించడం.. ఆమెకు కలిసిరాలేదు. అలాగని మెగా కుటుంబంతో వివాదాలకు దిగే పరిస్థితి లేదని కూడా చెప్పారు.
దీంతో వంగా గీత పిఠాపురంలో పల్టీ కొట్టారు. బలమైన కాపు సామాజిక వర్గం ఉన్నప్పటికీ.. ఆమె ఎత్తులు పారలేదు. ఇక, ఇప్పుడు ఆమె పిఠాపురాన్ని అంటిపెట్టుకుని ఉండాలన్న వ్యూహంతో లేరు. తన సేఫ్ తాను చూసుకుంటున్నారు. పిఠాపురంలో ఎవరు పోటీ చేసినా.. పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమని.. ఎంతో కొంత మెజారిటీతో అయినా.. ఆయన విజయం దక్కించుకుంటారని.. ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే నాయకులు ఒక లెక్కకు వచ్చేశారు.
దీంతో పోయి పోయి.. మరోసారి పిఠాపురంలో పోటీ చేసే ఆలోచనను గీత పక్కన పెట్టేశారు. పోనీ.. కాకినాడ నుంచి పోటీ చేద్దామా? అంటే.. అది కూడా ఆమెకు ఇష్టం లేదు. వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే.. మంత్రి పదవిరేసులో ఉన్న నేపథ్యంలో ఆమె ఇప్పుడు నియోజకవర్గాల విషయంలో జల్లెడ పడుతున్నార ని తెలిసింది. తన అనుచరులతో నెమ్మదిగా నియోజకవర్గాలపై ఆరా తీస్తున్నారు. తనకు బాగుండే నియోజకవర్గం కోసం చూసుకుంటున్నారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? దీనికి జగన్ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు..? అనేది చూడాలి.
