Begin typing your search above and press return to search.

ఒక్క ర్యాంప్ వాక్‌తో మారిన లేడీ మాజీ మావోల జీవితం

అంబరమంత అడవి.. నిరంతరం మారణహోమం.. రక్తం.. భయం.. శత్రువుల కళ్లల్లో పడకుండా అజ్ఞాతంలో గడిపిన కాలం అది.. ఒకప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తుపాకీ పట్టిన ఆ చేతులు.. నేడు అందమైన చేనేత వస్త్రాలను ధరించి వేదికపై ధీమాగా అడుగులు వేశాయి.

By:  A.N.Kumar   |   3 Oct 2026 12:20 PM IST
ఒక్క ర్యాంప్ వాక్‌తో మారిన లేడీ మాజీ మావోల జీవితం
X

అంబరమంత అడవి.. నిరంతరం మారణహోమం.. రక్తం.. భయం.. శత్రువుల కళ్లల్లో పడకుండా అజ్ఞాతంలో గడిపిన కాలం అది.. ఒకప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తుపాకీ పట్టిన ఆ చేతులు.. నేడు అందమైన చేనేత వస్త్రాలను ధరించి వేదికపై ధీమాగా అడుగులు వేశాయి. నిన్నటి వరకు సమాజానికి దూరంగా గడిపిన ఆ మాజీ మహిళా మావోయిస్టుల జీవితాల్లో ఒకే ఒక్క ర్యాంప్ వాక్ ఊహించని వెలుగులను నింపింది. అడవి తల్లి ఒడి నుంచి మొదలైన వారి ప్రయాణం.. ఇప్పుడు ముంబై బాలీవుడ్ వెండితెర దారి వైపు సరికొత్త మలుపు తిరిగింది.

సాహసానికి ప్రతీకగా ఆ నాటి అడుగులు

ఛత్తీస్‌‌గఢ్‌లో ఆగస్టు నెలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఆ మహిళల జీవితాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హింసను వీడి.. ఆయుధాలను విడిచిపెట్టి సాధారణ జీవనస్రవంతిలోకి వచ్చిన మాజీ మహిళా మావోయిస్టుల కోసం ప్రత్యేకంగా ఓ ర్యాంప్ వాక్ నిర్వహించారు. చేనేత వస్త్రాల శోభతో గుండె నిండా ఆత్మవిశ్వాసంతో వారు వేసిన ఒక్కో అడుగు నేడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడవుల్లో కష్టాలను జయించిన ఆ కళ్లల్లో కనిపిస్తున్న నయా వెలుగులు బాలీవుడ్ ప్రముఖులను సైతం మంత్రముగ్ధులను చేశాయి.

అడవి కథతో బాలీవుడ్ చిత్రం.. నిజ జీవిత కథానాయికలుగా వాళ్లే

ఆ ర్యాంప్ వాక్ వీడియోలను చూసిన కొందరు ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు వారిలోని ఆత్మవిశ్వాసానికి జోహార్లు అర్పించారు. కేవలం మోడలింగ్‌కే పరిమితం చేయకుండా వారి జీవిత కథల ఆధారంగానే ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రక్తపాతం నుంచి పునరావాసం వరకు వారు సాగించిన కన్నీటి పోరాట ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు పూనుకున్నారు. అందులో నటించే అవకాశాన్ని ఆ మాజీ మావోయిస్టులకే ఇవ్వడం విశేషం.

అయితే వెంటనే కెమెరా ముందుకు తీసుకెళ్లకుండా నటనలో శిక్షణ ఇవ్వనున్నారు. హావభావాలు, డైలాగ్ డెలివరీ, కెమెరా ఫేసింగ్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తమ సొంత అనుభవాలే పాత్రలు కావడం వల్ల ఆ సినిమాలో నటన అత్యంత సహజంగా భావోద్వేగభరితంగా రూపుదిద్దుకుంటుందని చిత్ర బృందం నమ్ముతోంది.

సామాజిక పునరేకీకరణకు సజీవ సాక్ష్యం

ఒకప్పుడు సమాజానికి దూరమై అడవి బాట పట్టిన మహిళలు నేడు ప్రగతి పథంలో ముందుకు సాగడం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న పునరావాస చర్యలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ మార్పుపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. హింసను వీడి వచ్చిన వారికి సమాజం అండగా నిలవాలనడానికి ఈ సంఘటనే నిదర్శనమని పేర్కొన్నారు.

అది కేవలం ఒక ఫ్యాషన్ షో కాదు.. నల్లటి చీకట్లను దాటుకుని వెలుగులోకి వచ్చిన ఓ సమర విజయం.. చేతుల్లో తుపాకులకు బదులుగా కలలను పట్టుకుని అడవుల నుంచి వెండితెర వైపు సాగుతున్న వారి ప్రయాణం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. వెండితెరపై తమ నిజ జీవిత పోరాటాన్ని వారు ఎలా పండిస్తారో చూడాలని ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది..