Begin typing your search above and press return to search.

ఒక్క వాట్సాప్ చాట్.. అమెరికాలో పెద్ద ఇమ్మిగ్రేషన్ దందాను పట్టించింది

అమెరికాలో గ్రీన్ కార్డు లేదా సిటిజన్‌షిప్ సంపాదించడమంటే సామాన్యుడికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పెద్ద ప్రహసనం.

By:  A.N.Kumar   |   10 Sept 2026 10:31 AM IST
ఒక్క వాట్సాప్ చాట్.. అమెరికాలో పెద్ద ఇమ్మిగ్రేషన్ దందాను పట్టించింది
X

అమెరికాలో గ్రీన్ కార్డు లేదా సిటిజన్‌షిప్ సంపాదించడమంటే సామాన్యుడికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పెద్ద ప్రహసనం. కానీ "చేతిలో డబ్బులుంటే చాలు, రూల్స్‌తో పనేంటి... ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాం" అంటూ ఒక మాజీ ఇమ్మిగ్రేషన్ అధికారి సరికొత్త బిజినెస్ నడిపాడు. యూఎస్ సిటిజన్ షిప్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్.సీఐఎస్)లో పనిచేసిన లుక్మాన్ ఒవోలాబి గనియూ.. అతనికి ఆర్థిక సహాయకుడిగా ఉన్న అడెనియి అకీమ్ సోమోయేలు కలిసి నడిపిన ఈ స్కామ్ ఇప్పుడు అమెరికా ఫెడరల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భారీ మొత్తంలో డబ్బు లావాదేవీలు ఒకెత్తయితే.. వీళ్లు రోజువారీ సంభాషణలకు వాడిన వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్సే దర్యాప్తు అధికారులకు ఈ కేసులో అసలైన 'రోడ్ మ్యాప్'గా మారడం విశేషం. బ్యాంకు లావాదేవీలను మహా తెలివిగా దాచేశామని నిందితులు సంబరపడిపోయినా.. చివరకు చాట్ హిస్టరీ డిలీట్ చేయడం మరచిపోయి దొరికిపోయారు.

ఈ ఇద్దరు మహానుభావులు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుదారుల నుంచి దాదాపు $960,000 అక్రమంగా దండుకుని.. సాధారణ నిబంధనలను గాలికి వదిలేశారనేది ప్రధాన ఆరోపణ. గనియూ తన అధికార ప్రాభవాన్ని ఉపయోగించి యూఎస్.సీఐఎస్ కంప్యూటర్ వ్యవస్థలోని డేటాను మార్చేసి దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసేవాడు. ఎంతలా అంటే... క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్స్, ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూలు, సాధారణ పరిశీలనల వంటి కీలకమైన ఘట్టాలను కూడా పూర్తిగా దాటవేసి ఆమోదాలు ఇచ్చేశాడని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. మిన్నియాపొలిస్, షార్లెట్, హ్యూస్టన్ ఆఫీసుల్లో పడి ఉన్న ఫైళ్లను కూడా తన వద్దకు బదిలీ చేయించుకుని.. స్థానిక పర్యవేక్షకులకు అనుమానం రాకుండా తానే స్వయంగా అప్రూవ్ చేసేవాడు. ఇక తన బిజినెస్ పార్ట్‌నర్ సోమోయే రుణం ఉంచుకోకుండా అతని సిటిజన్‌షిప్‌తో పాటు అతని భార్య, కుమారుడి రెసిడెన్సీ దరఖాస్తులకు కూడా ప్రత్యేక విఐపి ట్రీట్‌మెంట్ ఇచ్చి పాస్ చేసేసాడు.

లావాదేవీల విషయానికి వస్తే వీళ్లు డిజిటల్ యుగానికి తగ్గట్లే జెల్లీ, క్యాష్ యాప్ లాంటి యాప్‌ల ద్వారా సూటిగా $671,438 వసూలు చేయగా మరో $287,830 నగదు రూపంలో చేతులు మారింది. సోమోయే తన బ్యాంక్ ఖాతాల ద్వారా సుమారు $1.7 మిలియన్ల లావాదేవీలు జరిపి అందులో పెద్ద మొత్తాన్ని నొక్కేయడమే కాకుండా మరో $449,010 నగదుగా డిపాజిట్ చేసినట్లు కోర్టు పత్రాలు పేర్కొంటున్నాయి. ఎక్కువగా ఆఫ్రికన్ దేశాలకు చెందిన దరఖాస్తుదారులనే టార్గెట్ చేసుకుని 2019 డిసెంబర్ నుంచి 2026 మార్చి వరకు దాదాపు ఆరేళ్ల పాటు ఈ 'ఇమ్మిగ్రేషన్ సేల్' దిగ్విజయంగా కొనసాగింది.

2026 మార్చిలో గనియూ "వ్యక్తిగత కారణాలు" చూపి ఉద్యోగానికి రాజీనామా చేసి సైలెంట్‌గా బయటపడదామనుకున్నప్పటికీ ఫెడరల్ అధికారులు రికార్డులను, వాట్సాప్ చాట్లను తవ్వి తీసి అతడికి బేడీలు వేశారు. ఎంతటి ఘాటు స్కామ్ చేసినా చివరకు వాట్సాప్ చాట్ బ్యాకప్ వల్ల దొరికిపోయామని సదరు మాజీ అధికారి ఇప్పుడు కస్టడీలో కూర్చుని తీవ్రంగా విచారపడుతుండవచ్చు. ప్రస్తుతం ఈ ఆరోపణలన్నీ కోర్టులో రుజువు కావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే అక్రమాలను పట్టుకోవడానికి డిజిటల్ ఆధారాలు ఎంత కీలకమో ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.