Begin typing your search above and press return to search.

తెలంగాణ ఉద్యమం మలిచిన ఆదర్శ నేత : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలు!

తెలంగాణను స్వప్నిస్తూ, ఉద్యమమే ఊపిరిగా బతికిన యోధుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు.

By:  Tupaki Political Desk   |   31 July 2026 3:20 PM IST
తెలంగాణ ఉద్యమం మలిచిన ఆదర్శ నేత : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలు!
X

తెలంగాణను స్వప్నిస్తూ, ఉద్యమమే ఊపిరిగా బతికిన యోధుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. పదవి కోసం కాకుండా ప్రజల కోసం బతికిన ఆయన నిష్క్రమణతో ఉమ్మడి వరంగల్ జిల్లా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్తతో ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు తమ ప్రియమైన నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. నిన్నటి వరకు ధైర్యం చెప్పిన నాయకుడిని ఈ రోజు కన్నీటి కళ్లతో సాగనంపాల్సి రావడం ఓరుగల్లును భారంగా మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలాంటి 54 ఏళ్ల ప్రస్థానమే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిది. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే వరంగల్ జిల్లాలో గుర్తుకొచ్చే పేరు పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రజల కష్టసుఖాల్లో కలిసిపోయిన నాయకుడిగా ఆయన గుర్తొస్తారు. గులాబీ జెండా గురించి మాట్లాడితే చివరి శ్వాస వరకు పార్టీని విడిచిపెట్టని కార్యకర్తగా గుర్తుకొస్తారు. అందుకే ఆయన మరణం ఆ కుటుంబానికే కాకుండా మొత్తం తెలంగాణ ఉద్యమకారులకు శోకం మిగిల్చింది.

ఉద్యమమే ఊపిరి.. తెలంగాణే జీవితం

పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారాన్ని ఆశించి రాజకీయాల్లోకి రాలేదని అంటున్నారు. తెలంగాణ కోసం పోరాడాలనే సంకల్పంతో తన జీవితాన్ని మలచుకున్నారు. దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తెలంగాణ రాష్ట్ర సాధనే చరిత్రను మార్చే లక్ష్యంగా కేసీఆర్ పిలుపునందుకుని 2001లో టీఆర్ఎస్‌లో చేరారు. ఆ నిర్ణయంతో ఆయన రాజకీయ జీవితమే మారిపోయింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో వరంగల్ జిల్లా తెలంగాణ పోరాటానికి ప్రధాన కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారని సన్నిహితులు చెబుతున్నారు.

పార్టీకి పెద్ద దిక్కు.. కేసీఆర్ ఆప్తమిత్రుడు

టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని గ్రామ గ్రామానికీ చేర్చడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. జిల్లా కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 8 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించడం ఆయనపై పార్టీ అధినేత కేసీఆర్‌కు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. పార్టీ కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కార్యకర్తలతో సంబంధాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండానే తన రాజకీయ జీవితానికి చిరునామాగా మార్చుకున్నారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి

సుదర్శన్ రెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఉద్యమ సహచరుడిని, ఆప్తమిత్రుడిని కోల్పోయాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటామని ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించేవారని పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.

ప్రజలే కుటుంబం

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భాభంతో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ నాయకుడిగా సంపాదించుకున్న విశ్వాసాన్ని ప్రజాసేవగా మలచుకోవడమే తన బాధ్యతగా భావించారు. నర్సంపేట నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. 2014-18 మధ్య నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దూరమైనా ప్రజలకు దూరం కాకుండానే పనిచేస్తూ వచ్చారని అంటున్నారు.