Begin typing your search above and press return to search.

ఆస్తి ప్రభుత్వానికి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి మాజీ ఎంపీపీగా పనిచేసిన శ్యాంసుందర్, తన సొంత కొడుకుతో ఆస్తి విషయంలో ఎదుర్కొన్న చేదు అనుభవం తర్వాత తీసుకున్న గొప్ప నిర్ణయం, నేటి తరానికి గుణపాఠంగా నిలుస్తోంది.

By:  A.N.Kumar   |   15 Oct 2025 10:09 AM IST
ఆస్తి ప్రభుత్వానికి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!
X

తల్లిదండ్రులను గౌరవించని పిల్లల ప్రవర్తనపై సమాజంలో అసహనం పెరుగుతున్న తరుణంలో.. తెలంగాణలో జరిగిన ఒక సంఘటన, మాజీ ప్రజాప్రతినిధి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి మాజీ ఎంపీపీగా పనిచేసిన శ్యాంసుందర్, తన సొంత కొడుకుతో ఆస్తి విషయంలో ఎదుర్కొన్న చేదు అనుభవం తర్వాత తీసుకున్న గొప్ప నిర్ణయం, నేటి తరానికి గుణపాఠంగా నిలుస్తోంది.

*ఆస్తి కన్నా విలువైనది 'గౌరవం'

రాజకీయాల్లో ఉన్నప్పుడు శ్యాంసుందర్‌కు ప్రజల్లో మంచి పేరు ఉంది. మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేసి ప్రజల అభిమానాన్ని పొందారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితి ఎంతో బాధాకరమైనది. భార్య మరణంతో ఒంటరిగా ఉన్న శ్యాంసుందర్‌పై, ఆయన కుమారుడు రంజిత్ రెడ్డి దాడిచేశాడు.

తండ్రిపై ఒత్తిడి తెచ్చి కొంత ఆస్తిని తన పేరుపై రాయించుకున్న రంజిత్ రెడ్డి, అంతటితో ఆగకుండా ఒకసారి ఆస్తి విషయంలో తండ్రిపై దాడి కూడా చేశాడు. ఆ దాడిలో శ్యాంసుందర్ గాయపడటం తీవ్ర విచారకరం. సొంత కొడుకు చేతిలో ఇంతటి అవమానం ఎదురైన ఆ తండ్రి, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

*₹3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం

ఎల్కతుర్తి గ్రామంలో ఉన్న దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన మూడు ఎకరాల భూమిని శ్యాంసుందర్ ఏమాత్రం ఆలోచించకుండా ప్రభుత్వానికి దానం చేశారు. ఆ భూమిలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలను నిర్మించి, దానిని తన దివంగత భార్య పేరు మీద పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

తల్లిదండ్రులు దైవంతో సమానం అని భావించే సంస్కృతి మనది. అలాంటిది, ఆస్తుల కోసం సొంత కొడుకే తండ్రిపై దాడి చేయడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు, కొడుకుకు గుణపాఠం చెప్పడంతో పాటు, సమాజానికి మేలు చేసేలా శ్యాంసుందర్ తీసుకున్న ఈ నిస్వార్థ నిర్ణయాన్ని రాష్ట్రం నలుమూలల నుంచి అభినందిస్తున్నారు.

* శ్యాంసుందర్ సందేశం

శ్యాంసుందర్ తన గొప్ప నిర్ణయం ద్వారా ఒకే ఒక్క సందేశాన్ని ఇచ్చారు. "ఆస్తులు కంటే విలువైనది మానవ సంబంధం, తల్లిదండ్రుల గౌరవం." సమాజానికి గుణపాఠం చెప్పిన శ్యాంసుందర్ నిర్ణయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లిదండ్రుల సంక్షేమంపై చేసిన పిలుపుకు సమర్థమైన ప్రతిధ్వనిగా మారింది. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించే ప్రతి ఒక్కరికీ ఈ సంఘటన ఒక కనువిప్పు కావాలని స్థానికులు కోరుకుంటున్నారు.