Begin typing your search above and press return to search.

ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తే చాలు...లైఫ్ లాంగ్ ఫుల్ హ్యాపీ !

ప్రజా ప్రతినిధి కావడం అంటే చాలా కష్టపడాలి. దానికి అదృష్టం ఉండాలి. అన్నీ కలిస్తేనే చట్ట సభలో అడుగుపెడతారు.

By:  Satya P   |   29 Sept 2025 1:37 AM IST
ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తే చాలు...లైఫ్ లాంగ్ ఫుల్ హ్యాపీ !
X

ప్రజా ప్రతినిధి కావడం అంటే చాలా కష్టపడాలి. దానికి అదృష్టం ఉండాలి. అన్నీ కలిస్తేనే చట్ట సభలో అడుగుపెడతారు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ అయిదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎంతో మంది ఉత్సాహపడతారు. అందులో జగన్ మెచ్చిన వారి మెడలోనే వరమాల పడుతుంది. అలా సగటున రెండు లక్షల మంది దాకా జనాభా ఉండే ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అంటే గ్రేట్ అని చెప్పాలి. అయితే ఒకసారి గెలిస్తే చాలా మంది అక్కడితో ఆగరు, మరిన్ని సార్లు అసెంబ్లీ మెట్లు ఎక్కాలని అనుకుంటారు. అది అధికారంలో ఉండే మజా అని అనుకోవాలి. అయితే ఎన్నిసార్లు గెలిచినా పెన్షన్ మాత్రం ఒక్కసారే ఇస్తారు. అది కూడా అయిదేళ్ళ పదవీ కాలంలో మెజారిటీ కాలం అంటే కనీసంగా మూడేళ్ళకు పైగా పూర్తి చేస్తే జీవిత కాలం పెన్షన్ అందుకునేందుకు అర్హత సాధిస్తారు.

హాయిగా ఉండొచ్చు :

ఒక ప్రభుత్వ ఉద్యోగి మూడున్నర దశాబ్దాల పాటు పనిచేస్తేనే తప్ప పెన్షన్ అన్నది రాదు, అలాంటిది ఒక టెర్మ్ ఎమ్మెల్యే అయితే చాలు జీవిత కాలం అంతా పెన్షన్ లభిస్తుంది. ఇది ప్రజా ప్రతినిధికి దక్కే గౌరవంగా చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీలో మాజీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త వినిపించనుంది. ఇక వారికి అన్నీ మంచి రోజులే అంటున్నారు. హాయిగా ఇంట్లో గడిపినా పెన్షన్ భరోసా ఉంటుంది. అది కూడా వర్తమాన ఆర్థిక పరిస్థితులకు తగిన విధంగా సవవరించబోతున్నారు.

భారీ పెంపునకు రెడీ :

ఏపీలోని మాజీ ఎమ్మెల్యేలు పెన్షన్లు గణనీయంగా పెరగబోతున్నాయని అంటున్నారు. కనీసంగా యాభై వేల రూపాయలు పెన్షన్ ప్రతీ నెలా ఇవ్వాలని అలాగే వారికి కనీస వసతులు అందించాలని ఏపీ అసెంబ్లీ సదుపాయాల కమిటీ నిర్ణయం తీసుంది. ఈ కమిటీ చైర్మన్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఈ మేరకు ఒక నివేదికను కమిటీ తరఫున తయారు చేసి సిఫార్సు చేసినట్లుగా చెబుతున్నారు.

డబుల్ అవుతుందా :

ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు ముప్పయి వేల రూపాయల దాకా పెన్షన్ అందుతోంది. దీనిని యాభై వేల రూపాయల దాకా పెంచాలని కమిటీ సూచిస్తోంది. ఇక ఈ నివేదిక సమర్పించే ముందు దేశంలోని వివిధ రాష్ట్రాలలో మాజీ ఎమ్మెల్యేలకు ఏ మేరకు పెన్షన్ ఇస్తున్నారు అన్నది కూడా అధ్యయనం చేశారు అలా చూస్తే కనుక మణిపూర్ లో 70 వేలు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో యాభై వేలు, తెలంగాణాలో కూడా యాభై వేలు ఇస్తున్నారు. ఇక ఏపీలో కూడా యాభై వేల రూపాయలు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేస్తోంది.

మాజీ ఎమ్మెల్సీలకు కూడా :

అంతే కాదు అఖిల భారత సర్వీసులకు అధికారులతో సమానంగా మాజీ ఎమ్మెల్యేలకు వైద్య సదుపాయాలు కూడా అందించాలని కమిటీ సూచించింది. తాజా అసెంబ్లీ సమావేశాలలో ఈ నివేదికను రామక్రిష్ణారెడ్డి ప్రవేశపెట్టారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇక మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్సీలకు కూడా ఇదే విధమైన పెన్షన్ పెంపు ఉంటుందని అంటున్నారు. దీంతో ఒక్కసారి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయితే చాలు జీవిత కాలం హ్యాపీయే అన్న మాట వినిపిస్తోంది.