Begin typing your search above and press return to search.

సంచలనం : ఇమ్రాన్ ఖాన్ కోసం ఏకమైన 21 మంది మాజీ కెప్టెన్లు..

పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విజేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం స్పందించింది.

By:  A.N.Kumar   |   24 Aug 2026 12:04 AM IST
సంచలనం : ఇమ్రాన్ ఖాన్ కోసం ఏకమైన 21 మంది మాజీ కెప్టెన్లు..
X

పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విజేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం స్పందించింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్, పాకిస్థాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21 మంది మాజీ క్రికెట్ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి ఉమ్మడిగా లేఖ రాశారు.

ఈ లేఖలో భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లతో పాటు పలువురు ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్లు సంతకాలు చేసినట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణమే సరైన, మెరుగైన వైద్య సహాయం అందించాలని వారు పాక్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

స్వతంత్ర వైద్య బృందంతో పరీక్షలు

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని సుప్రీంకోర్టు నియమించిన నిపుణులైన మెడికల్ బోర్డు లేదా స్వతంత్ర వైద్య బృందంతో సమగ్రంగా అంచనా వేయించాలని మాజీ కెప్టెన్లు ప్రతిపాదించారు. ఆయనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను పరిశీలించి, వైద్యుల సూచనల మేరకు అవసరమైన చికిత్సను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని కోరారు.

రాజకీయ, న్యాయపరమైన అంశాలతో సంబంధం లేకుండా కేవలం మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని చూడాలని వారు స్పష్టం చేశారు. తమ లేఖ ఉద్దేశం పాకిస్థాన్ అంతర్గత న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం కాదని.. ఒక తోటి క్రీడాకారుడి సంక్షేమం మాత్రమేనని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల పరామర్శకు అనుమతి

మానసిక, శారీరక దృఢత్వానికి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో కీలకమని అభిప్రాయపడిన మాజీ కెప్టెన్లు.. ఇమ్రాన్ ఖాన్‌కు వారానికి కనీసం ఒకసారైనా కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.

పాకిస్థాన్‌కు ఏకైక వన్డే ప్రపంచకప్ అందించి.. దేశ ప్రధానిగా సేవలు అందించిన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై అంతర్జాతీయ క్రీడా ప్రముఖులు స్పందించడం గమనార్హం. మాజీ కెప్టెన్ల విజ్ఞప్తిపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.