Begin typing your search above and press return to search.

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ... సంచలన ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీ స్థాపనపై అధికారిక ప్రకటన చేసి సంచలనం సృష్టించారు.

By:  A.N.Kumar   |   27 March 2026 3:49 PM IST
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ... సంచలన ప్రకటన
X

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీ స్థాపనపై అధికారిక ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. శ్రీరామనవమి సందర్భంగా చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపింది. వచ్చే ఏప్రిల్ 25న తన కొత్త పార్టీని ఆవిష్కరించనున్నట్లు ఆమె వెల్లడించారు. అదే రోజున పార్టీ పేరు, జెండాను కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు.

మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెన్షన్‌లో పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించనున్నట్లు కవిత చెప్పారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు కోరుకునే అభ్యుదయ వాదులు అందరూ తనతో కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత ఈ కీలక ప్రకటన చేశారు. “నేను నిజామాబాద్ కోడలిని, తెలంగాణ బిడ్డను. నిజామాబాద్ మట్టి గొప్పది. ఇక్కడి నుంచి తీసుకునే నిర్ణయాలు దేశాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే నా కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం ఇక్కడినుంచే చుట్టాలని నిర్ణయించుకున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు దాటినా ఇంకా “నీళ్లు, నిధులు, నియామకాలు” పూర్తిస్థాయిలో సాధించలేకపోయామని కవిత విమర్శించారు. ప్రస్తుత పరిపాలనపై ప్రజలు ఆలోచించాలని సూచిస్తూ రాష్ట్రానికి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. “సర్వోదయ తెలంగాణ సాధన కోసమే ఈ కొత్త పార్టీ పుట్టుకొస్తోంది” అని స్పష్టం చేశారు.

పార్టీ అజెండా, విధానాలు ఏంటనేది ఏప్రిల్ 25న ప్రకటిస్తానని ఆమె తెలిపారు. కొత్త తరం నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. యువత, మహిళలు, సామాజిక వర్గాలన్నిటినీ కలుపుకొని ముందుకు సాగే రాజకీయ వేదికగా ఈ పార్టీ నిలుస్తుందని కవిత హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఈ కొత్త పార్టీ ప్రభావంపై విశ్లేషణలు జరుగుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్, సాంస్కృతిక విలువలను ఆధారంగా చేసుకుని కవిత ప్రజల్లోకి ఎలా వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా చూస్తే కల్వకుంట్ల కవిత రాజకీయ రంగప్రవేశం కొత్త పార్టీ రూపంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 25న జరిగే ఆవిర్భావ సభపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.