Begin typing your search above and press return to search.

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం హఠాన్మరణం.. విషాదంలో టీడీపీ నేతలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని గుండెపోటుతో మరణించారు.

By:  Tupaki Political Desk   |   15 Sept 2026 4:03 PM IST
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం హఠాన్మరణం.. విషాదంలో టీడీపీ నేతలు
X

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని గుండెపోటుతో మరణించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 2025లో టీడీపీలో చేరారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన నాని ప్రస్తుతం విశాఖలో నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం గుండెపోటు రాగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1969 డిసెంబరు 30 జన్మించిన ఆళ్ల నాని 57 ఏళ్ల వయసులో మరణించడం తీవ్ర విషాదానికి గురిచేసిందని సన్నిహితులు, అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరు నియోజకవర్గానికి చెందిన ఆళ్ల నాని రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1994, 1999 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాని ఓటమి చెందారు. మూడో ప్రయత్నంలో 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వరుసగా రెండోసారి గెలిచిన ఆయన 2011లో వైసీపీ ఆవిర్బావానికి ముందు ఆ పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మద్దతుగా రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసినప్పటికీ ఆళ్ల నాని గెలవలేకపోయారు. కానీ, 2019 ఎన్నికల్లో మంచి మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో కాపు సామాజికవర్గం కోటాలో ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2020లో కోవిడ్ విజృంభించిన సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్ల నాని తనదైన ముద్ర వేశారు. మంత్రిగా మూడేళ్ల పనిచేసిన అనంతరం ఆయనను పదవి నుంచి తప్పించారు. ఇక 2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చడం, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేసినప్పటికీ మాజీ మంత్రి ఆళ్ల నానికి మాత్రం ఏలూరు నియోజకవర్గం టికెట్ నే కేటాయించారు. అయితే మంత్రి పదవి నుంచి తప్పించిన అసంతృప్తితో పార్టీపై వ్యతిరేకత పెంచుకున్న ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం హైకమాండ్ కు దూరమయ్యారు. 2025లో వైసీపీకి రాజీనామా చేసి అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు.

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తారని భావిస్తున్న తరుణంలో ఆళ్ల నాని హఠాన్మరణం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర విషాదానికి గురిచేసిందని అంటున్నారు. ఇక నాని తల్లిదండ్రులకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఆయన మాత్రం చక్కగా రాణించి అందరి అభిమానాన్ని చూరగొన్నారని చెబుతున్నారు. నానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.