Begin typing your search above and press return to search.

మాజీ ‘కిరణం’ ఉదయించేనా ?!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర కీలకమైంది.

By:  Tupaki Political Desk   |   27 Aug 2026 10:28 AM IST
మాజీ ‘కిరణం’ ఉదయించేనా ?!
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర కీలకమైంది. వైఎస్ మరణం అనంతరం రోశయ్య కొన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ తరువాత అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.

2014లో పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రా ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ విభజన బిల్లు పాస్ అయినప్పుడు ఆయన తన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పదవులతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశాడు. అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లగా ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఆయన 2018లో పార్టీని రద్దు చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి 2023తో కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అలీలోరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ మాజీ మంత్రి నల్లారి అమరనాథ్ రెడ్డి కుమారుడు అయిన కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం 1952 నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి క్రికెటర్ గా రాష్ట్ర, సౌత్ జోన్ స్థాయిలో ఆడాడు. తండ్రి మరణం అనంతరం తొలిసారి ఆయన 1989లో తొలిసారి వాయల్పాడు నుండి గెలిచారు.

1994లో అదే స్థానం నుండి ఓడిపోయి తిరిగి 1999, 2004 ఎన్నికల్లో వరసగా గెలిచారు. 2009లో పీలేరు నుండి విజయం సాధించి శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా అవకాశం ఇవ్వడంతో 2010 నవంబర్ నుండి 2014 మార్చి 1 వరకు ఆ పదవిలో కొనసాగారు.

2023లో బీజేపీలో చేరిక అనంతరం ఆయన 2025 నుండి బీజేపీ రాష్ట్ర కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా కొనసాగుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసిన 76,071 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి మిధున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన 5,68,773 ఓట్లు సాధించి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.

అయితే కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం ఆయనకు గవర్నర్ గా అవకాశం కల్పించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉజ్జెకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ తిరిగి వచ్చిన అనంతరం కేంద్ర క్యాబినెట్లో మార్పులు, చేర్పులతో పాటు, కొత్తగా వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించనున్నారని, అందులో కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కబోతుందని చెబుతున్నారు. మరి ఈ ‘కిరణం’ మరోసారి ఉదయిస్తుందా ? లేదా ? వేచిచూడాలి.