Begin typing your search above and press return to search.

స‌నాతన‌ భార‌తీయ‌ సంస్కృతిని ఇష్ట‌ప‌డే టాప్-5 వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ రైట‌ర్స్

భారతదేశం అనేది కేవలం ఒక భౌగోళిక సరిహద్దులు కలిగిన దేశం కాదు.. అది ఒక లోతైన అనుభూతి.. సనాతన సంస్కృతుల నిలయం. యుగయుగాలుగా ఈ పుణ్యభూమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో మేధావులను, పర్యాటకులను, రచయితలను తనవైపుకు ఆకర్షిస్తూనే ఉంది.

By:  Sivaji Kontham   |   21 Jun 2026 7:00 PM IST
స‌నాతన‌ భార‌తీయ‌ సంస్కృతిని ఇష్ట‌ప‌డే టాప్-5 వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ రైట‌ర్స్
X

భారతదేశం అనేది కేవలం ఒక భౌగోళిక సరిహద్దులు కలిగిన దేశం కాదు.. అది ఒక లోతైన అనుభూతి.. సనాతన సంస్కృతుల నిలయం. యుగయుగాలుగా ఈ పుణ్యభూమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో మేధావులను, పర్యాటకులను, రచయితలను తనవైపుకు ఆకర్షిస్తూనే ఉంది. జర్మన్ రచయిత మరియా విర్త్ తాజా ప‌ర్య‌ట‌న‌లో భార‌త‌దేశంపై త‌న ప్రేమ‌ను, ఉద్వేగాన్ని ఏమాత్రం దాచుకోకుండా ప్ర‌ద‌ర్శించారు. తాను 40 దేశాల‌లో సంచ‌రిస్తే, ఇక్క‌డ ఉన్న వివేక‌వంతులు, జ్ఞానులు త‌న‌కు ఎంత‌గానో న‌చ్చార‌ని ప్ర‌శంసించారు. అంతేకాదు ఏ దేశంలోను లేనంత‌గా అపార‌మైన ప్రేమ‌ను కూడా ఇక్క‌డ పొందాన‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే ఆమె లాగే, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఎంతోమంది ప్రపంచ విఖ్యాత రచయితలు భారత్‌ను సందర్శించి.. ఇక్కడి జీవన విధానాన్ని.. ఆధ్యాత్మికతను చూసి ముగ్ధులయ్యారు. వారి కలాల నుండి జాలువారిన ప్రశంసలు నేటికీ భారతీయ సంస్కృతి సాంప్ర‌దాయాల‌ గొప్ప‌త‌నానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.

అమెరికన్ సాహిత్య పితామహుడు, ప్ర‌ఖ్యాత‌ రచయిత మార్క్ ట్వైన్ 1896లో భారతదేశంలో పర్యటించినప్పుడు ఇక్కడి వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మానవ ఇతిహాసంలో అత్యంత విలువైన, విజ్ఞానదాయకమైన అంశాలు భారతదేశంలోనే దాగి ఉన్నాయని ట్వైన్ నమ్మేవారు. ``భారతదేశం అనేది మానవజాతికి ఊయల.. చరిత్రకు తల్లి.. పురాణాలకు అమ్మమ్మ`` అంటూ ఆయన మన సంస్కృతిని కొనియాడారు. ఇక్కడి ప్రజల జీవనశైలి, శతాబ్దాల నాటి సంప్రదాయాలు కాలంతో పాటు మారకుండా అలాగే సజీవంగా ఉండటం మార్క్ ట్వైన్‌ను అమితంగా ఆకట్టుకుంది.

మరోవైపు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ చరిత్రకారుడు.. రచయిత విలియం డాల్రింపుల్ భారతదేశ చరిత్రతో ఎంతగా ప్రేమలో పడ్డారంటే.. ఆయన తన స్వదేశాన్ని వదిలి దశాబ్దాల క్రితమే ఇక్కడికి వచ్చి ఢిల్లీలో స్థిరపడిపోయారు. `సిటీ ఆఫ్ జిన్స్` వంటి అద్భుతమైన పుస్తకాల్లో ఆయన భారతీయ సంస్కృతిని ఆవిష్కరించారు. అలాగే ఫ్రెంచ్ నోబెల్ గ్రహీత రోమైన్ రోలాండ్ వంటి తాత్వికులు కూడా భారతీయ వేదాంతాన్ని.. ముఖ్యంగా స్వామి వివేకానందుడి బోధనలను అధ్యయనం చేసి.. మానవ మేధస్సు అత్యున్నత రూపం భారత్‌లోనే వ్యక్తమైందని ప్రపంచానికి చాటిచెప్పారు.

చరిత్ర పుటల్లోకి వెళ్తే... క్రీస్తుశకం 7వ శతాబ్దంలో చైనా నుండి వచ్చిన బౌద్ధ పర్యాటకుడు, రచయిత హ్యుయాన్ త్సాంగ్ నాటి భారతదేశ వైభవాన్ని తన `సి-యు-కి` గ్రంథంలో అద్భుతంగా లిఖించారు. నలంద విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన ఆయన ఇక్కడి ప్రజల నిజాయితీని, విద్యా వ్యవస్థను, ఆతిథ్య గుణాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ విధంగా పురాతన కాలం నాటి హ్యుయాన్ త్సాంగ్ నుండి ఆధునిక యుగపు మరియా విర్త్, విలియం డాల్రింపుల్ వరకు... ప్రతి ఒక్క అంతర్జాతీయ రచయిత కూడా భారతదేశంలో ఉండే గందరగోళం వెనుక ఒక అద్భుతమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక సంపద దాగి ఉన్నాయని ముక్తకంఠంతో అంగీకరించారు.