Begin typing your search above and press return to search.

విదేశీ విద్యార్థుల టాప్ 10 జాబితాలో తెలంగాణ ఔట్

దీంతో ఏపీ దేశంలోనే టాప్ 10లో ఏడో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు తెలంగాణ టాప్ 10లో నాలుగో స్థానంలో నిలవగా.. ఈ రిపోర్టులో టాప్ టెన్ నుంచి తొలిగిపోయిన దుస్థితి.

By:  Garuda Media   |   26 Dec 2025 12:00 PM IST
విదేశీ విద్యార్థుల టాప్ 10 జాబితాలో తెలంగాణ ఔట్
X

తెలుగు రాష్ట్రాల్లో విదేశీ విద్యార్థులు అన్నంతనే హైదరాబాద్ మాట ఇట్టే గుర్తుకు వస్తుంది. తెలుగు ప్రాంతాల్లో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ కు పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థులు రావటం.. ప్రముఖ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించటం చూస్తూంటాం. అయితే.. ఈ తీరు గడిచిన పదేళ్లలో మారిన విషయాన్ని నీతి ఆయోగ్ తాజాగా వెల్లడించింది. నీతి ఆయోగ్ రిపోర్టును చూస్తే.. విస్మయానికి గురయ్యే అంశాలు కనిపిస్తాయి.

ఒకప్పుడు దేశంలో విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించే టాప 10 రాష్ట్రాల జాబితాలో ఉన్న తెలంగాణ ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా రిపోర్టులో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. 2012-13 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 2700 మంది విదేశీ విద్యార్థులు ఉండగా.. 2021-22 నాటికి ఈ సంఖ్య 1286కు చేరుకుందని పేర్కొన్నారు.పదేళ్ల వ్యవధిలో సగానికి పైగా విద్యార్థుల సంఖ్య తగ్గిన వైనాన్ని నీతి ఆయోగ్ రిపోర్టు స్పష్టం చేసింది.

విదేశీ విద్యార్థులు తెలంగాణకు వచ్చి చదువుకోవటం తగ్గిపోతే.. అనూహ్య రీతిలో మరో తెలుగు రాష్ట్రమైన ఏపీకి మాత్రం విదేశీ విద్యార్థుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ కావటం గమనార్హం. 2012-13లో కేవలం 679 మంది విదేశీ విద్యార్థులు ఏపీలోని వివిధ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తుండగా.. 2021-22 నాటికి ఈ సంఖ్య 3106కు చేరుకున్నట్లుగా నీతి ఆయోగ్ రిపోర్టు వెల్లడించింది.

దీంతో ఏపీ దేశంలోనే టాప్ 10లో ఏడో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు తెలంగాణ టాప్ 10లో నాలుగో స్థానంలో నిలవగా.. ఈ రిపోర్టులో టాప్ టెన్ నుంచి తొలిగిపోయిన దుస్థితి.

పదేళ్ల వ్యవధిలో అంతర్జాతీయ విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ లో టాప్ 10 రాష్ట్రాల్లో ఉన్న పశ్చిమ బెంగాల్ సైతం తెలంగాణ మాదిరే వెనుకబడటం గమనార్హం. విదేశీ విద్యార్థుల్ని పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్న రాష్ట్రాల జాబితాలో పంజాబ్.. ఉత్తరప్రదేశ్.. ఏపీ లాంటి రాష్ట్రాలు తమ సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుకోవటం విశేషం. అదే సమయంలో తెలంగాణ తన స్థానాన్ని కోల్పోవటం షాకింగ్ గా మారింది.