ఎగిరే శవపేటిక కాదు.. తొలిచూపులో ప్రేమలో పడ్డా.. చదవాల్సిందే
మిగ్ 21 (మికొయాన్ గురెవిచ్) సూపర్ సోనిక్ యుద్ధ విమానం అన్నంతనే తరచూ ఏదో ఒక ప్రమాదానికి గురై.. విలువైన పైలెట్ల ప్రాణాలు తీసే లోహ విహంగంగా కొందరు అభివర్ణిస్తారు.
By: Garuda Media | 26 Sept 2025 1:00 PM ISTమిగ్ 21 (మికొయాన్ గురెవిచ్) సూపర్ సోనిక్ యుద్ధ విమానం అన్నంతనే తరచూ ఏదో ఒక ప్రమాదానికి గురై.. విలువైన పైలెట్ల ప్రాణాలు తీసే లోహ విహంగంగా కొందరు అభివర్ణిస్తారు. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి వాయుసేన దీని సేవల నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. మిగ్ 27 యుద్ధ విమానానికి శాశ్వితంగా వీడ్కోలు పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. 2255 గంటల పాటు ఈ లోహ అద్భుతాన్ని నడిపిన అనుభవం ఉన్న 64 ఏళ్ల అవినాశ్ చిక్తే.. దీనికి సంబంధించిన విశేషాల్ని తాజాగా పంచుకున్నారు. విమర్శకులు పలువురు మిగ్ 21ను ఎగిరే శవపేటికగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే.. భారత వాయుసేనలో పని చేసి రిటైర్ అయిన అవినాశ్ ఆ మాట అంటే.. అస్సలు ఒప్పుకోరు.
ప్రస్తుతం ఆయన ఒక విమానయాన సంస్థలో ట్రైనింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. పలు ప్రమాదాలకు మిగ్ 21 కారణమైనప్పటికి.. దీనిపై విమర్శకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న వేళలోనూ.. అవినాశ్ మాత్రం ఆ మాటల్ని ససేమిరా అన్నట్లు ఒప్పుకోరు. తాను తొలిచూపులోనే మిగ్ 21 ప్రేమలో పడినట్లుగా పేర్కొంటారు. అనుకున్న లక్ష్యాల్ని ఒడుపుగా సాధించటంలో.. ప్రమాదకర పరిస్థితులను ఊహించి కాపాడటంలోనూ..అది అలెర్టు చేసే తీరులో దానికి మించింది లేదని చెబుతారు. అదెన్నోసార్లు తనను కాపాడిందని.. అదెంతో తెలివైన లోహ విహంగంగా ఆయన పేర్కొంటారు.
మిగ్ 21తో తనకున్న అనుబంధాన్ని భావోద్వేగంతో ఒక మీడియా సంస్థతో తాజాగా షేర్ చేసుకున్నారు. అది కాస్తా ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చదివితే.. ‘‘మిగ్ 21 సూపర్ సోనిక్ విమానాన్ని తొలిసారి చూశా. దాని రూపురేఖలు ఎంతగానో అకట్టుకున్నాయి. అప్పటికి నాకు విమానాల్ని నడిపిన అనుభవం 175 గంటలే ఉండటంతో దానిని నడిపేందుకు చాలా భయపడ్డా. చాలా అందంగా.. నాజుగ్గా.. కత్తిలా ఉన్న ఈ విమానాల్లో విహరించా. దానిలో కూర్చొని బెల్టు పెట్టుకుంటే ఆ విమానం మన శరీరానికి ఎక్సెటెన్షన్ గా మారుతుంది. ఏ ఆదేశాన్ని ఇచ్చినా క్షణాల్లో స్పందిస్తుంది’’ అని చెప్పారు.
ఒక తల్లిలా.. స్నేహితురాలిగా.. మార్గదర్శిగా ఉండటం దానికే సాధ్యమన్న ఆయన.. ప్రమాదాలు.. కల్లోలాలు ఎదురైనా ఇంటికి సేఫ్ గా చేరుస్తుందని చెప్పుకొచ్చారు. ఒకే ఇంజిన్ ఉండి.. ఒకే పైలెట్ నడిపే ఈ విమానాలు అంత సులువైనవి కాదన్న ఆయన.. ‘‘ప్యాసింజర్ విమానాలకు ఉన్నంత స్థిరత్వం.. భద్రత వీటిలో ఉండవు. వీటిని నడపటం ఒక సవాల్. కాక్ పిట్ చిన్నది. పరికరాలపై రష్యన్ భాష ఉంటుంది. రష్యాలోని అతి చల్లని వాతావరణానికి తగ్గ ఉష్ణోగ్రత దీనిలో ఉండేలా రూపొందించారు. దీంతో మన దేశాల్లో దీన్ని నడపాలంటే చెమటలు కక్కాల్సిందే. ఒకసారి దాని టర్బోజెట్ ఇంజిన్ మొదలైందంటే.. మరేమీ చూడాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు.
చిటికెలో టేకాఫ్ కావటం.. క్షణాల్లో నేల కనపడనంత ఎత్తుకు వెళ్లిపోయే సత్తా ఉన్న ఈ యుద్ధ విమానం.. అర్థం చేసుకొని.. నమ్మకం ఉంచి.. ప్రేమతో చూసుకుంటే దయతో రియాక్టు అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాల్ని షేర్ చేశారు. ‘‘ఒకసారి సముద్రం మీదుగా దీనిలో వెళుతున్నా. ఇంజిన్ లో ఒక పక్షి చిక్కుకుంది.విమాన నమూనా అద్భుతమైనది కావటంతో ఇంజిన్ ను రీస్టార్ట్ చేయగలిగా. సేఫ్ గా ల్యాండ్ అయ్యాక విమానం ముందు భాగాన్ని ముద్దాడా. మరో సందర్భంలో రాత్రివేళ పఠాన్ కోట్ నుంచి వెళ్తున్నాం. తెలియకుండానే నేను ఎగరాల్సిన ఎత్తులో కాకుండా తక్కువ ఎత్తుకు వచ్చేశా అమ్రత్ సర్ మీదుగా వెళ్తున్నప్పుడు విద్యుద్దీపాల వెలుగుల మధ్య స్వర్ణ దేవాలయం ఎక్కడుందో గుర్తించేందుకు తపించా. గంటకు 900కి.మీ. వేగంతో వెళ్తూ.. అలా బయటకు చూస్తే.. భూమికి కేవలం 60 మీటర్ల ఎత్తుకు వచ్చేశా. అదప్పుడు నన్ను అప్రమత్తం చేసింది’’ అంటూ నాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.
తనను అప్రమత్తం చేసినంతనే.. ఎత్తు పెంచినట్లుగా పేర్కొన్నారు. ఆ క్షణంలో మిగ్ 21కు.. భగవంతుడికి థ్యాంక్స్ చెప్పానన్నారు. ఒకవేళ మిగ్ 21 తనను హెచ్చరించి ఉండనిపక్షంలో భూమ్మీద మండే లగ్నిగోళంలా పడి తన జీవితం ముగిసిపోయేదన్నారు. మరోసారి ఒక పర్వతానికి అత్యంత దగ్గరగా వెళ్లానని.. ప్రాణాలు పోయినట్లేనని భావించానని.. కుదుపులతో తాను బయటపడినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి ఉదంతాలతో తనకు ఆ యుద్ధ విమానంపై ఉన్న గౌరవం మరింత ఎక్కువైందన్నారు. అత్యాధునిక ఎఫ్ 16 విమానాల్ని కూల్చిన ఘనత మిగ్ 21దేనన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
