పైలెట్ స్మిత్ కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవం.. తమ దేశానికి రావాలని నెతన్యాహు ఆహ్వానం..
ఫ్లైదుబాయ్ విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తోంది. విమానం గాల్లో ఉండగానే స్మిత్ మచ్చర్‌పై సహ పైలట్ దాడికి పాల్పడ్డాడు.
By: A.N.Kumar | 4 Oct 2026 10:37 AM ISTఫ్లైదుబాయ్ విమానంలో ఆ కొన్ని నిమిషాలు.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెట్టిన క్షణాలు. కాక్‌పిట్‌లోనే దాడికి గురైన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్.. తీవ్ర గాయాలతోనూ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో ఆయన చెప్పిన వివరాలు ఆ ఘటన ఎంత భయానకంగా సాగిందో వెల్లడించాయి.
ప్రార్థన చేస్తాడనుకున్నా.. ఒక్కసారిగా దాడి
ఫ్లైదుబాయ్ విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తోంది. విమానం గాల్లో ఉండగానే స్మిత్ మచ్చర్‌పై సహ పైలట్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు సహ పైలట్ ప్రార్థన చేశాడని స్మిత్ తెలిపారు. ఆ తర్వాతే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెనుక నుంచి తనపై దాడి జరిగిందని.. మొదటి దెబ్బకే తన చూపు దాదాపుగా కోల్పోయానని స్మిత్ నెతన్యాహుకు వివరించారు.
విమానం కిందకు వెళ్తోంది.. కానీ తాను కూడా ప్రమాదంలోనే..
దాడితో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం కూడా కిందకు దిగుతున్నట్లు ఆయన గుర్తించారు. ఒకవైపు తన ప్రాణాలకు ముప్పు.. మరోవైపు విమానంలోని ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడటం.. అలాంటి సమయంలో స్మిత్ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ఒక్కటే కాక్‌పిట్ తలుపు తెరవాలి. అయితే తలుపు తెరవడానికి చేసిన తొలి ప్రయత్నాన్ని సహ పైలట్ అడ్డుకున్నాడు. కాక్‌పిట్ డోర్‌ను మూసివేశాడు. గాయాలతో చూపు సరిగా కనిపించని పరిస్థితిలోనూ స్మిత్ మరోసారి ప్రయత్నించారు.
చివరి శక్తినంతా ఉపయోగించి డోర్ తెరిచారు
తన దగ్గర మిగిలిన శక్తినంతా ఉపయోగించి చివరకు కాక్‌పిట్ తలుపును తెరిచినట్లు స్మిత్ వెల్లడించారు. తలుపు తెరుచుకున్న వెంటనే బయట ఉన్న ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకున్నారు. దాడి చేసిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి క్రమంగా నియంత్రణలోకి వచ్చింది. అనంతరం విమానాన్ని సురక్షితంగా దారి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అంటే.. ప్రయాణికులను కాపాడిన కీలక మలుపు కాక్‌పిట్ తలుపు తెరుచుకున్న క్షణమే.
‘మీరు ప్రపంచానికే హీరో’
స్మిత్ మచ్చర్ చెప్పిన ఈ వివరాలను విన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత్, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచానికే స్మిత్ హీరో అని కొనియాడినట్లు సమాచారం. అంతేకాదు ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో సంప్రదాయంగా ప్రత్యేక గౌరవంగా నిర్వహించే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించాలని నెతన్యాహు ఆకాంక్షించినట్లు తెలుస్తోంది.
మోదీతోనూ సంభాషణ
ఈ ఘటన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్మిత్ మచ్చర్‌తో మాట్లాడి ఆయన ధైర్యాన్ని అభినందించారు. తీవ్ర గాయాల మధ్య కూడా ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు. ఇక స్మిత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు సమాచారం.
అసలు హీరో ఎవరు?
ఈ ఘటనలో స్మిత్ మచ్చర్‌కు వస్తున్న ప్రశంసలకు కారణం కేవలం ఆయన పైలట్ కావడం కాదు. తన ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసినా.. విమానం అదుపు తప్పుతోందని గుర్తించి.. గాయాలతోనూ కాక్‌పిట్ తలుపు తెరవడానికి చివరి ప్రయత్నం చేయడమే ఆయనను హీరోగా నిలబెట్టింది. ఒక సాధారణ విమాన ప్రయాణం.. కొన్ని నిమిషాల్లో ప్రాణాంతక సంక్షోభంగా మారింది. ఆ సమయంలో స్మిత్ తీసుకున్న నిర్ణయాలు వందలాది మంది ప్రయాణికుల భవిష్యత్తును మార్చేశాయి.
అందుకే ఇప్పుడు ఆయన కథలో ప్రధానమైన ప్రశ్న ఒక్కటే “అంతటి దాడి తర్వాత కూడా.. చివరి శక్తి వరకు పోరాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?” దానికి స్మిత్ చర్యలే సమాధానంగా నిలిచాయి.
