ఫ్లైదుబాయ్ ఘటన : వెలుగులోకి ఒమన్ కో-పైలట్ దారుణ హిస్టరీ
మిడిల్ ఈస్ట్ మిస్టరీ కథనాలకు కేంద్రబిందువైన దుబాయ్ నగరంలో ఆ రోజు వాతావరణం ప్రశాంతంగానే ఉంది.
By: A.N.Kumar | 3 Oct 2026 9:39 AM ISTమిడిల్ ఈస్ట్ మిస్టరీ కథనాలకు కేంద్రబిందువైన దుబాయ్ నగరంలో ఆ రోజు వాతావరణం ప్రశాంతంగానే ఉంది. ఫ్లైదుబాయ్ విమానం టేకాఫ్ అయి ప్రశాంతంగా మేఘాలపై తేలుతోంది. దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్లాల్సిన ఆ విమానంలో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా సాధారణంగా సాగిపోతుందనుకున్న ఆ క్షణంలో ఊహించని మలుపు తిరిగిన ఒక మహా ముప్పు కాక్‌పిట్ తలుపుల వెనుక వేచి ఉందనే విషయం ఎవరికీ తెలియదు.
అకస్మాత్తుగా కాక్‌పిట్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒమన్‌కు చెందిన 29 ఏళ్ల కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి, విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఊహించని ఈ ఘటనతో కంట్రోల్ తప్పిన విమానం ఆకాశంలో భయంకరంగా ఊగిసలాడింది. సీటు బెల్టులు ధరించిన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అదృష్టవశాత్తూ క్షణాల్లో అప్రమత్తమైన ప్రయాణికులు, విమాన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి హమామ్‌ను అడ్డుకున్నారు. వెంటనే విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కాక్‌పిట్ బాధ్యతలను స్వీకరించి అత్యవసర పరిస్థితిలో సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. కానీ సన్నివేశం అక్కడితో ముగియలేదు.. అసలు సిసలైన క్రైమ్ థ్రిల్లర్ ఇక్కడే మొదలైంది!
విస్తుపోయే గతం.. చీకటి కోణాలు
అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు హమామ్ గతాన్ని తవ్వడం ప్రారంభించగానే విస్తుపోయే తీవ్రవాద లింకులు వెలుగులోకి వచ్చాయి. 2024లోనే హమామ్ వద్ద తీవ్రవాద భావజాలానికి సంబంధించిన రహస్య మెటీరియల్‌ను అధికారులు కనుగొన్నారు. ఆ సమయంలోనే ఒమన్ ఎయిర్ యాజమాన్యం అతడిని విమానాలు నడపకుండా నిలిపివేసింది. అయితే అతడిని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించకుండా కేవలం పరిపాలనా విధులకే పరిమితం చేశారు.
'సిరియా కనెక్షన్' పైనా దృష్టి
హమామ్ ఒమన్ దాటి సిరియాలో గడిపిన కాలం, అక్కడ అతనికి ఉన్న అనుబంధాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అతడి తల్లి సిరియా వాసి అనే కోణంతో పాటు కుటుంబ నేపథ్యంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. దానికి తోడు అతడి సోషల్ మీడియా ఖాతాలలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే కంటెంట్ ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది.
అంతర్జాతీయ విమానయాన వ్యవస్థకు ప్రశ్నార్థకం
ఒక దేశంలో భద్రతాపరమైన తీవ్ర ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి, మరో దేశానికి చెందిన ఫ్లైదుబాయ్ సంస్థలో కో-పైలట్‌గా ఎలా చేరగలిగాడు? నియామక సమయంలో అతడి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు ఘోరంగా విఫలమైంది? దేశాల మధ్య భద్రతా సమాచారాన్ని పంచుకునే వ్యవస్థల్లో ఉన్న లోపాలేమిటి? అనే ప్రశ్నలు అంతర్జాతీయ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
హమామ్ ఒంటరిగానే ఈ కల్లోలానికి ప్లాన్ చేశాడా లేక దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ ఉగ్రవాద కుట్ర ఉందా అనే దానిపై దర్యాప్తు సంస్థలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఆకాశంలో చోటుచేసుకున్న ఈ సంచలన ఘటన మానసిక-భద్రతా పరిశీలనల ప్రాముఖ్యతను ప్రపంచానికి మరోసారి నొక్కి చెప్పింది.
