Begin typing your search above and press return to search.

వైరల్: ఆ కేసులో జడ్జి నోట 29 అక్షరాల ఇంగ్లిషు మాట!

ఇంతకూ ఈ పదాన్ని ఏ సందర్భంగా న్యాయమూర్తి వాడారు? ఇంతకూ ఆ భారీ పదానికి అర్థం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తొలుత ఈ కేసు వివరాల్లోకి వెళితే..

By:  Garuda Media   |   2 April 2026 6:00 PM IST
వైరల్: ఆ కేసులో జడ్జి నోట 29 అక్షరాల ఇంగ్లిషు మాట!
X

ఇద్దరు ప్రముఖులకు చెందిన పరువు నష్టం కేసు విచారణలో న్యాయమూర్తి వాడిన 29 అక్షరాల ఇంగ్లిషు మాట ఇప్పుడు వైరల్ గా మారింది. అసలే హైప్రొఫైల్ కేసు.. అందునా సున్నితమైన పరువు నష్టం కేసు తీర్పు వేళ.. న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన ఒక భారీ పదం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. దీనికి కారణం.. విన్నంతనే మెదడుకు ఎక్కని.. పలికినంతనే ఆ పదాన్ని రిపీట్ చేయటం సాధ్యం కాని ఈ పదంపై ఆసక్తికర చర్చ జరగుతోంది. ఇంతకూ ఈ పదాన్ని ఏ సందర్భంగా న్యాయమూర్తి వాడారు? ఇంతకూ ఆ భారీ పదానికి అర్థం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తొలుత ఈ కేసు వివరాల్లోకి వెళితే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై పరువు నష్టం కేసు ఒకటి 2024 ఎన్నికల వేళ నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి సతీమణి లిపిక మిశ్రా గతంలో పరువు నష్టం దాఖలు చేశారు. అప్పటి ఎన్నికల సమయంలో మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది లిపికా మిశ్రా ఆరోపణ. తన పరువుకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ నిర్మలమ్మ మీద పరువు నష్టం దావా వేశారు.

దీనికి సంబంధించిన విచారణ తాజాగా జరిగింది. తమ వైవాహిక విభేదాలను ప్రస్తావిస్తూ.. తన పరువుకు.. మర్యాదను దెబ్బ తీసేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పగా.. అందుకు సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీ కోర్టు తాజాగా కొట్టేసింది. తీర్పు ఇచ్చే సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఒక ఇంగ్లిషు పదాన్ని ఉపయోగించారు. 29 అక్షరాలు ఉన్న ఈ భారీ పదాన్ని ప్రయోగించారు. దీంతో ఈ పదంపై ఆసక్తికర చర్చ మొదలైంది.

ఇంతకూ ఆ పదం ఏమిటన్నది చూస్తే.. ‘Floccinaucinihilipilification’. సరే, దీన్ని ఎలా పలకాలన్న సందేహం రావటం ఖాయం. అందుకు ఆ విషయాన్ని చూస్తే.. ‘ఫ్లాక్సినాసినిహిలిపిలిఫికేషన్’ ఇంగ్లిషులో 29 అక్షరాల ఉన్నప్పటికి.. దాని అర్థం చాలామందికి తెలీదని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ఇంత భారీగా ఉన్న పదాన్ని సింఫుల్ గా పలకటం కూడా సాధ్యమయ్యేదికాదు. అందుకే దీన్ని కాస్త విడివిడిగా పలికి.. ఆ తర్వాత ఒకటిగా పలికితే తేలిక అవుతుంది. ఇంగ్లిషులో 29 అక్షరాలున్న ఈ పదం తెలుగులో మాత్రం సగం కంటే తక్కువ అక్షరాలు మాత్రమే ఉండటం విశేషం.

ఇంతకూ ఈ క్లిష్టమైన పదం అర్థమేమిటన్నది చూస్తే. ‘విలువ లేదు’ అన్న అర్థమస్తుంది పొడుగ్గా.. పలికేందుకు కష్టంగా ఉన్న ఈ పదం అర్థం విలువ లేదనే చిన్న పదమే. అదే సమయంలో ఈ పదానికి పనికిరానిది.. నిష్ర్పయోజనమైనదిగా కూడా వాడొచ్చు. ఇదే పదాన్ని కొంతకాలం క్రితం కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. తాజాగా కోర్టు సైతం ఈ పదాన్ని వినియోగించటంతో సోషల్ మీడియాలో ఈ పదంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇంతకూ ఈ పదం ఎలా పుట్టింది? ఈ పదం చరిత్రలోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. పద్దెనిమిదో శతాబ్దంలో ఇంగ్లండ్ లోని ప్రసిద్ధ ఈటన్ కాలేజీ విద్యార్థులు 1700ల ప్రారంభంలో ఈ పదాన్ని క్రియేట్ చేశారు. అప్పట్లో లాటిన్ వ్యాకరణం నేర్చుకునే విద్యార్థులు విలువలేనిది అనే అర్థం వచ్చేలా నాలుగు లాటిన్ పదాల్ని కలిపి సరదాగా ఈ సుదీర్ఘ పదాన్ని క్రియేట్ చేశారు.

అయితే.. ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 1741లో విలియం షెన్ స్టోన్ అనే కవి రాసిన లేఖలో కనిపించటంతో ఈ పదానికి ప్రాముఖ్యత వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఈ పదాన్ని వాడటంతో పెద్ద ఎత్తున చర్చ జరిగి.. మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదంతా సరే.. పనిలో పని ఒకసారి మీరు కూడా ఈ పదాన్ని (ఫ్లాక్సినాసినిహిలిపిలిఫికేషన్) పలికే ప్రయత్నం చేస్తారా?