Begin typing your search above and press return to search.

మన్ను అఖౌరి: తెలుసుకోవాల్సిన ఒక నిశ్శబ్ద హీరో కథ

జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము జిల్లా మేదినీనగర్‌కు చెందిన మన్ను అఖౌరి 1984 జనవరి 21న జన్మించారు.

By:  A.N.Kumar   |   23 Sept 2025 4:00 PM IST
మన్ను అఖౌరి: తెలుసుకోవాల్సిన ఒక నిశ్శబ్ద హీరో కథ
X

దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీరుల కథలు మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన సాహస గాథ భారత వైమానిక దళం (IAF) ఫ్లైట్‌ లెఫ్టినెంట్ మన్ను అఖౌరిది. 2009లో పంజాబ్‌లో జరిగిన ఒక యుద్ధ విన్యాసాల సమయంలో, సాంకేతిక సమస్యలతో మంటలు చెలరేగిన తన మిగ్-21 యుద్ధ విమానాన్ని సురక్షితంగా మళ్లించి, 1,500 మంది పాఠశాల విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఆయన త్యాగం, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. ఈ నెల 26న మిగ్-21 విమానాలను IAF పూర్తిగా ఉపసంహరిస్తున్న నేపథ్యంలో ఈ అమరుడి కథ మరోసారి స్మరించుకోవడం ఎంతో అవసరం.

బాల్యం నుంచి దేశ సేవ చేయాలన్న కల

జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము జిల్లా మేదినీనగర్‌కు చెందిన మన్ను అఖౌరి 1984 జనవరి 21న జన్మించారు. చిన్నతనం నుంచే భారత వైమానిక దళంలో చేరాలన్న బలమైన కోరిక ఆయనకు ఉండేది. పఠాన్‌కోట్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో విద్యను పూర్తి చేసి, 2006 జూన్ 17న ఫ్లయింగ్ ఆఫీసర్‌గా IAFలో చేరారు. తన ప్రతిభ, అంకితభావంతో త్వరలోనే ఫ్లైట్‌ లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగారు.

ఘటన జరిగిన రోజు:

2009 సెప్టెంబర్ 10న, పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో యుద్ధ విన్యాసాల్లో మన్ను అఖౌరి పాల్గొన్నారు. ఆయన నడుపుతున్న మిగ్-21 విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానం ముక్త్‌సర్ జిల్లాలోని భలైయాణా గ్రామం గగనతలంలో ఉంది. కింద ఉన్న ప్రజలకు, ముఖ్యంగా పాఠశాలలో ఉన్న పిల్లలకు ప్రమాదం జరగకూడదని మన్ను అఖౌరి నిశ్చయించుకున్నారు.

నిర్ణయాత్మక క్షణం:

విమానం కిందకు దూసుకెళ్తున్నప్పుడు, సమీపంలో ఉన్న పాఠశాలపై దృష్టి పడింది. అక్కడ సుమారు 1,500 మంది విద్యార్థులు ఉన్నారు. వారి ప్రాణాలను కాపాడడానికి, స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, తన ప్రాణాలను పణంగా పెట్టడానికి మన్ను అఖౌరి నిర్ణయించుకున్నారు. విమానాన్ని విద్యార్థులు లేని ప్రదేశం వైపు, అంటే ముక్త్‌సర్-భటిండా రహదారి పక్కనున్న పొలం వైపు మళ్లించారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో, ఆయనకు విమానం నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.

అమరుడిగా నిలిచిన వీరుడు

తన తనువు కాలిపోతున్నా, చివరి నిమిషం వరకు విమానాన్ని నియంత్రించి సురక్షిత ప్రాంతంలో కూల్చి, మన్ను అఖౌరి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆయన త్యాగం వల్ల ఆ పాఠశాలలో ఉన్న 1,500 మంది విద్యార్థులు, భలైయాణా గ్రామ ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ త్యాగం దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఫ్లైట్‌ లెఫ్టినెంట్ మన్ను అఖౌరి త్యాగాన్ని గౌరవిస్తూ భటిండాలోని భిసియానా గ్రామంలోని సీనియర్ సెకండరీ పాఠశాలకు ఆయన పేరు పెట్టారు. అలాగే, ఆయన స్వస్థలమైన పలాములోని సద్దీక్ మంజిల్‌ చౌక్‌ దగ్గర ఒక రహదారికి కూడా ఆయన పేరు పెట్టారు.

మిగ్-21 యుద్ధ విమానాల ఉపసంహరణతో ఈ విమానాలు అందించిన సేవలు, వాటితో ముడిపడిన వీరుల గాథలు ఎల్లప్పుడూ స్మరణీయం. మన్ను అఖౌరి వంటి వీరులు యువతకు ధైర్యం, బాధ్యత, దేశం పట్ల అపారమైన ప్రేమను నిరూపిస్తారు. ఆయన త్యాగం, భారత వైమానిక దళ చరిత్రలో ఒక బంగారు అధ్యాయంగా నిలిచిపోతుంది.