ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు
దేశంలో 2027 లో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. అక్కడ సర్ ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున ఓట్లు తగ్గిపోయాయి.
By: Satya P | 3 Nov 2026 9:41 AM ISTదేశంలో 2027 లో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. అక్కడ సర్ ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున ఓట్లు తగ్గిపోయాయి. పెద్ద రాష్ట్రం అయినా యూపీలో భారీ కోత పడితే ఉత్తరాఖండ్ గోవా, పంజాబ్, మణిపుర్ రాష్ట్రాలలో బాగా ఓట్లు తగ్గిపోయాయి. సర్ ప్రక్రియలో భాగంగా చనిపోయిన వారు, డబుల్ ఓట్లు ఉన్న వారు, వలసలు బదిలీ అయి వెళ్ళిన వారు భోగస్ ఓట్లు తొలగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే అర్హుల ఓట్లే కోత వేస్తున్నారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాలు ఈ విధంగా ఆందోళనలు ఒక వైపు చేస్తూండగానే ఈ అయిదు రాష్ట్రాలలో సర్ ఎఫెక్ట్ బాగా పడి ఓట్లు తగ్గిపోయాయి.
పెద్ద ఎత్తున తగ్గింపు :
ఈ అయిదు రాష్ట్రాలలో చూస్తే సర్ ప్రక్రియకు ముందు 18.71 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే సర్ తర్వాత 16.43 కోట్లకు ఓటర్ల సంఖ్య పడిపోయింది. ఇందులో పెద్ద దెబ్బ ఉత్తరప్రదేశ్ కే పడింది. అక్కడ 15.44 కోట్ల మంది ఓటర్లు ఉంటే సర్ ప్రక్రియ జరిగిన తరువాత 13.40 కోట్లకు ఆ సంఖ్య చేరింది. అయితే తుది జాబితా నాటికి మరో 84 లక్షల మందిని చేర్చారు అని చెబుతున్నారు. కానీ ఇంకా భారీగానే కోత పడింది అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కోత పడిన ఓట్లు అన్నీ అర్హులవే అని ఆయన మండిపడుతున్నారు.
అక్కడ సైతం అలా :
అదే విధంగా పంజాబ్ లో ఓటర్ల సంఖ్య చూస్తే 2.15 కోట్ల మంది ఉంటే అది కాస్తా సర్ ముసాయిదా జాబితా వెల్లడి అయ్యాక 1.94 కోట్లకు పడిపోయింది. అయితే ఇక్కడ కూడా ముసాయిదాలో తొలగించిన 21 లక్షల మందిలో మూడవ వంతు తుది జాబితాలో చేర్చినా 15 లక్షల ఓట్లు లేవని అంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చూస్తే 80 లక్షల ఓటర్లకు గానూ సర్ ప్రక్రియ తరువాత 71 లక్షలకు సంఖ్య పడిపోయింది. అయితే తుది జాబితాలో మరో లక్ష చేరి 72 లక్షల ఓటర్లుగా చూపించారు. అంటే ఇక్కడ ఎనిమిది లక్షల ఓట్లు తగ్గిపోయాయి అన్న మాట. మణిపూర్ లో ఓటర్ల సంఖ్య 0.209 కోట్ల నుంచి ముసాయిదాలో 0.193 కోట్లకు తగ్గి, తుది జాబితాలో 0.196కోట్లకు చేరుకుందని లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ 1.3 లక్షల మంది ఓటర్లను సర్ ప్రక్రియలో తొలగించారు అని అంటున్నారు. ఇందులో తుది జాబితాలో 17 శాతం చేర్చినా కూడా ఒక లక్షా పది వేలు తగ్గినట్లే అని అంటున్నారు. గోవాలో అయితే ఓటర్ల సంఖ్య 11.85 లక్షల నుంచి ముసాయిదా నాటికి 10.85 లక్షలకు తగ్గింది. ఇక తుది జాబితాలో ఓటర్ల సంఖ్య మరింతగా దిగజారి 10.58 లక్షలకు పడిపోవడం విశేషం.
స్పెషల్ సమ్మరీ రివిజన్ ద్వారా :
అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 17 రాష్ట్రాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ కి అవకాశం ఇచ్చింది. ఆ విధంగా ఓటర్ల జాబితాలో లేని వారు తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఈసీ కల్పించింది. దాంతో మరి కొంతమందికి చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే జనవరి 1వ తేదీ నాటికి లేదా అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు కూడా ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా ఎంతో కొంత ఓట్ల సంఖ్య పెరుగుతుంది కానీ సర్ ఎఫెక్ట్ తో భారీగానే కోత పడింది అని అంటున్నారు.
విపక్షాలు ఆందోళన :
ఒక వైపు సర్ ప్రక్రియను రద్దు చేయాలని విపక్షాలు ఆందోళన చేస్తున్నా కూడా ఓట్ల తగ్గింపు అనేది జరుగుతోంది. ఇదంతా భోగస్ ఓట్లను తొలగించేందుకే అని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్నా అర్హుల ఓట్లే చోరీ అవుతున్నాయని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మరి ఈ ఓట్ల తగ్గింపు తరువాత జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
