Begin typing your search above and press return to search.

బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్! ఒపీనియన్ పోల్స్ సంచలన ఫలితాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పలుసంస్థలు నిర్వహించిన సర్వేలు కాక రేపుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హవాకు ఈ ఎన్నికల్లో బ్రేక్ పడుతుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి.

By:  Tupaki Political Desk   |   24 March 2026 6:00 PM IST
బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్! ఒపీనియన్ పోల్స్ సంచలన ఫలితాలు
X

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఒపీనియన్ పోల్స్ ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జైత్ర యాత్రకు ఈ మినీ సమరంలో ఫుల్ స్టాప్ పడనుందనే సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. బీజేపీ అగ్ర నాయకత్వానికి కంట్లో నలుసులా చికాకు పెడుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మళ్లీ గెలవనున్నారని ఒపినియన్ పోల్స్ అంచనాలు అగ్గి రాజేస్తున్నాయి. అంతేకాకుండా మొత్తం ఐదు రాష్ట్రాలకు కేవలం అసోంలో మాత్రమే బీజేపీ అధికారం నిలబెట్టుకునే చాన్స్ ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పలుసంస్థలు నిర్వహించిన సర్వేలు కాక రేపుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హవాకు ఈ ఎన్నికల్లో బ్రేక్ పడుతుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీ పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో కూడా గెలవాలని కంకణం కట్టుకుని పనిచేస్తోంది. బెంగాల్ పై పదేళ్ల క్రితమే ఫోకస్ చేసిన బీజేపీ.. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. కానీ 77 సీట్లకే పరిమితమై ప్రతిపక్షంగా మిగిలిపోయింది. తాజా ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి అధికార పక్షంగా మారాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం లేదని వోట్ వైబ్ అన్న సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

పశ్చిమ బెంగాల్ తోపాటు తమిళనాడు, కేరళను గెలుచుకోవాలని బీజేపీ చాలా కాలంగా వ్యూహాలు రచిస్తోంది. కానీ ఈ మూడుచోట్ల బీజేపీకి చాన్స్ లేదని ఒపీనియన్ పోల్స్ లో తేలిపోయింది. వోట్ వైబ్ సర్వేలో పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీకి 184-194 సీట్లు వస్తాయని వెల్లడైంది. ఇక్కడ అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, కానీ 98 నుంచి108 స్థానాలకే పరిమితమవుతుందని వోట్ వైబ్ స్పష్టం చేసింది.

అదేవిధంగా తమిళనాడులో అగ్ని న్యూస్ సర్వీస్ అనే సంస్థ సర్వే చేయగా, అధికార డీఎంకే 180 సీట్లతో అధికారం నిలబెట్టుకుంటుందని వెల్లడించింది. ఈ రాష్ట్రంలో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి కేవలం 50-60 స్థానాలకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక మూడో ప్రత్యామ్నాయం అంటూ బరిలోకి దిగుతున్న సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే కేవలం 10 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సివస్తోందని అగ్ని న్యూస్ సర్వీస్ స్పష్టం చేసింది. మరోవైపు దక్షిణాదిలో మరో కీలక రాష్ట్రమైన కేరళలోనూ బీజేపీకి ఆశాజనకంగా లేదని మ్యాట్రిజ్-ఐఏఎన్ఎస్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటముల మధ్యే మరోసారి పోరు కొనసాగుతోందని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, వాపపక్ష ఎల్డీఎఫ్ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయని 140 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ కి 61-71, యూడీఎఫ్ కి 58-69 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బీజేపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అవుతోందని సర్వే వెల్లడించింది. అయితే బీజేపీకి అసోంలో మాత్రం ఊరట కలుగుతోందని వోట్ వైబ్ వెల్లడించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అసోంలో ఘన విజయం సాధిస్తుందని సర్వేలో స్పష్టమైంది.