ఆ దేశంలో ఫస్ట్ టైమ్ మూడు దోమలు కనిపించాయి తెలుసా?
ఐస్ లాండ్ రాజధాని రేక్జావిక్ కు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో పశ్చిమ ఐస్లాండ్ లోని కిడాఫెల్, క్జోస్ లో బ్జోర్న్ హ్జాల్టాసన్ ఈ దోమలను కనుగొన్నాడు.
By: Raja Ch | 22 Oct 2025 6:00 PM ISTసీజన్ తో సంబంధం లేకుండా భారతదేశంలో దోమలు విజృంభిస్తూనే ఉంటాయనే సంగతి తెలిసిందే. పట్టణాలు, పల్లెలు అనే తేడా ఏమీ లేకుండా అవి కనిపిస్తుంటాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే వాటి విజృంభన మరో లెవెల్ కి వెళ్తుంది. ఓ పక్క రక్తాన్ని పీలుస్తూ, మరోపక్క చెవుల దగ్గర గోల పెడుతూ.. అనేక తీవ్రమైన వ్యాదులు కలగడానికి కారణమవుతుంటాయి.
అయితే... ఐస్ లాండ్ లో మాత్రం దోమ అనేది కనిపించదు. ప్రపంచంలో దోమలు లేని దేశంగా దీనికి పేరుంది. అయితే.. ఇకపై ఆ పేరు ఉండకపోవచ్చని అంటున్నారు. తాజాగా ఆ దేశంలో మొదటి దోమను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐస్ లాండ్ రాజధాని రేక్జావిక్ కు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో పశ్చిమ ఐస్లాండ్ లోని కిడాఫెల్, క్జోస్ లో బ్జోర్న్ హ్జాల్టాసన్ ఈ దోమలను కనుగొన్నాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేను ఓ వింత కీటకాన్ని కనుగొన్నాను.. ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని పట్టుకున్నాను అని వెల్లడించారు. అనంతరం నేచురల్ సైన్స్ ఇనిస్టిట్యూట్ లో కీటక శాస్త్రవేత్త అయిన మాథియాస్ ఆల్ఫ్రెడ్సన్ ను సంప్రదించగా.. అతను మరుసటి రోజు హ్జల్టాసన్ ఇంటికి వెళ్లాడు. వారు మొత్తం మూడు దోమలను పట్టుకున్నారు.
వాటిలో రెండు ఆడవి, ఒకటి మగది. అల్ఫ్రెడ్సన్ వాటిని కులిసెటా అనూలాటా జాతికి చెందిన దోమలుగా గుర్తించాడు. ఈ సందర్భంగా స్పందించిన అల్ఫ్రెడ్సన్.. చాలా సంవత్సరాల క్రితం దేశంలోని కెఫ్లావిక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానంలో వేరే జాతికి చెందిన ఒకే దోమ కనుగొనబడిందని తెలిపారు.
వాతావరణ మార్పు వేగవంతం కావడంతో.. వేడి, తుఫానులు, వరదలు పెరుగుతున్నాయని.. దీంతో వ్యాధులను మోసే కీటకాల పరిధి పెరుగుతోందని.. పరిశోధనా సంస్థ తెలిపింది. ఇటీవల ఐస్ లాండ్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా దోమలు వేగంగా పెరగడానికి, ఎక్కువ కాలం జీవించడానికి అనుమతిస్తాయని వెల్లడించింది.
అయితే... ఐస్ లాండ్ జలాల్లో రసాయనాల స్థాయి దోమలు పెరగడానికి అనుకూలంగా ఉండదని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే చలికాలం తీవ్రంగా ఉండడం, నదులు ప్రవహించకపోవడం వల్ల దోమలు వృద్ధి చెందవని అంటున్నారు. ఐస్ లాండ్ జలాల్లోని రసాయనాలు దోమల పెంపకానికి పెద్ద సవాలుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
