జీతం పెంచమంటే జాబ్ పీకేశారు.. కట్ చేస్తే.. అదిరే ట్విస్టు
ఇదేనా కార్పొరేట్ నీతి? అంటూ సూటిగా సంధించిన ఒక ప్రశ్న.. ఐటీ రంగంలోని పలువురి మధ్య హాట్ టాపిక్ గా మారింది.
By: Garuda Media | 18 Sept 2025 2:00 PM ISTఇదేనా కార్పొరేట్ నీతి? అంటూ సూటిగా సంధించిన ఒక ప్రశ్న.. ఐటీ రంగంలోని పలువురి మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఆకలైనోడు అన్నం ముద్ద పెట్టమంటే ససేమిరా అనేస్తూ.. అవసరం లేనోడికి బిర్యానీ పీకలదాకా పెట్టి కూడా ఇంకాస్త తినమనే దానికి తగ్గట్లే తాజా ఉదంతం ఉందని చెబుతున్నారు. అయితే.. న్యాయం ఒకటి ఉందని.. దాన్ని తప్పినోళ్లను ఎవరు శిక్షించినా.. శిక్షించకుండా ప్రకృతి మాత్రం వదలదన్న వాదనను వినిపించే ఈ ఉదంతం గురించి తెలుసుకోవాల్సిందే.సోషల్ మీడియా మాధ్యమం రెడిట్ లో పబ్లిష్ అయిన ఈ రియల్ ఉదంతం ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది.
అయితే.. ఈ ఉదంతానికి సంబంధించిన కంపెనీ పేరు కానీ.. ఊరు కానీ.. ఉద్యోగి పేరు కానీ బయటకు రాలేదు. అసలు విషయంలోకి వెళితే.. అతడో ఐటీ ఉద్యోగి. దాదాపు ఆరేళ్లకు పైనే పని చేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నట్లుగా పేర్కొంటూ.. ఇటీవల ముగిసిన ఇంక్రిమెంట్ల వేళ.. తన విషయాన్ని కాస్త పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంటూ ఒక పది శాతమైనా జీతాన్ని హైక్ చేయాలని కోరాడు. దీనికి సీరియస్ అయిన హెచ్ఆర్ విభాగం జీతం పెంచాలని అడుగుతావా అంటూ సీరియస్ అయ్యారు. జాబ్ నుంచి తీసేసినట్లుగా సందేశాన్ని పంపారు.
కంపెనీకి ఉద్యోగికి మధ్య రిలేషన్ అలానే ఉంటుంది మరి.. అనుకుంటూ అతనేం ఆశ్చర్యపోలేదు. ఆరేళ్లకు పైగా పని చేసిన కంపెనీ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఇలా ఉంటే.. కంపెనీ అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం అతడికి కాస్తంత ఉపశమనాన్ని కలిగించాయి. ఎందుకంటే.. అతడ్నిజాబ్ నుంచి తొలగించిన తర్వాత.. అతను చేసే బండెడు పని చేయాలంటే సిబ్బంది అవసరమని గుర్తించి..వెంటనే ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. చివరకు ఆరుగురిని సెలెక్టు చేయాల్సి వచ్చింది. అందరికి మంచి ప్యాకేజీలతో జీతాల్ని ఫిక్స్ చేశారు.
అంటే.. వీరంతా కలిసి చేసే పనిని ఇంతకాలం ఇతడొక్కడే చేశాడన్న మాట. పది శాతం పెంపునకు నో చెప్పటమే కాదు జాబ్ నుంచి తీసేసి దానికి ఫలితంగా ఆరుగురికి మంచి ప్యాకేజీలు ఇవ్వాల్సి వచ్చింది. ఉద్యోగి కోరినట్లు పది శాతం పెంచితే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కానీ.. కార్పొరేట్ ప్రపంచం అలా ఉండదు కదా? పైసా ఖర్చును మిగల్చటం కోసం వంద రూపాయిల్ని సైతం తగలబెట్టేందుకు సిద్ధంగా ఉంటారన్న దానికి ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ పోస్టు పలువురిని ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.
