Begin typing your search above and press return to search.

సింగిల్స్‌కు ఉచితంగా ఫిన్‌ల్యాండ్ ప‌ర్యట‌న‌కు ఛాన్స్

ఉచితంగా ఫిన్‌లాండ్ ప్రయాణించి ప్రేమను వెతుక్కునేందుకు విజిట్ ఫిన్‌లాండ్ పర్యాటక సంస్థ ఒక వినూత్న అవకాశాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది.

By:  Sivaji Kontham   |   2 Nov 2026 9:17 AM IST
సింగిల్స్‌కు ఉచితంగా ఫిన్‌ల్యాండ్ ప‌ర్యట‌న‌కు ఛాన్స్
X

ఉచితంగా ఫిన్‌లాండ్ ప్రయాణించి ప్రేమను వెతుక్కునేందుకు విజిట్ ఫిన్‌లాండ్ పర్యాటక సంస్థ ఒక వినూత్న అవకాశాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ప్రపంచంలోని అత్యంత ఆనందకరమైన దేశంగా పేరుగాంచిన ఫిన్‌లాండ్ అంతర్జాతీయంగా 16 మంది ఒంటరి వ్యక్తులకు (సింగిల్స్) పూర్తి ఉచితంగా పర్యటించే అవకాశాన్ని కల్పిస్తోంది.9 ఫిబ్రవరి నుండి 19 ఫిబ్ర‌వ‌రి, 2027 వరకు సాగే ఈ పర్యటనలో ఎంపికైన విజేతలు అక్కడ స్థానిక ఫిన్నిష్ వంటకాలను రుచి చూడటంతో పాటు.. స్థానిక సింగిల్స్‌తో కలిసి డిన్నర్ డేట్‌లో పాల్గొనవచ్చు.

`ఫిన్నిష్ డిన్నర్ డేట్` అని పిలిచే ఈ అద్భుత‌ ప్రచార కార్యక్రమం ఫిన్లాండ్‌లోని `సింకుకోరి` అనే సూపర్ మార్కెట్ సంస్కృతి ఆధారంగా రూపుదిద్దుకుంది. గులాబీ రంగు షాపింగ్ బాస్కెట్లను పట్టుకుని తిరగడం ద్వారా తాము ఒంటరిగా ఉన్నామని.. డేటింగ్ కు సిద్ధంగా ఉన్నామని చెప్పే ట్రెండ్ అక్కడ ప్రాచుర్యం పొందింది. ఈ ఆధునిక సంస్కృతిని ఆధారం చేసుకుని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒంట‌రి వ్యక్తులను ఆహ్వానిస్తూ టూరిజం బోర్డు ఈ వినూత్న కాన్సెప్ట్‌ను రూపొందించింది.

ఈ పర్యటనలో భాగంగా ఎంపికైన 16 మంది అభ్యర్థులకు విమాన టికెట్లు, వసతి, ప్రయాణ ఖర్చులు, భోజన సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. హెల్సింకి- టాంపెరే నగరాల్లో జరిగే గ్రూప్ డిన్నర్ డేట్లలో స్థానిక చెఫ్‌లు తయారు చేసిన వైల్డ్ ఫిష్, బెర్రీలు, పుట్టగొడుగుల వంటి సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. కేవలం ఒకరితో ఒకరు మాత్రమే మాట్లాడే ఇబ్బందికరమైన డేట్‌గా కాకుండా.. అందరూ కలిసి సరదాగా పాల్గొనే గ్రూప్ డిన్నర్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి 18 సంవత్సరాలు నిండిన ఏ ఒంటరి వ్యక్తి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ సోషల్ మీడియా ఖాతాలలో మీరు డిన్నర్ డేట్‌లో ఏ వంటకం వడ్డిస్తారు? ఎందుకు? అనే ప్రశ్నకు ఇంగ్లీష్‌లో సమాధానం ఇస్తూ ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆ పోస్ట్‌కు #FinnishDinnerDate హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి విజిట్ ఫిన్‌లాండ్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ పోటీకి దరఖాస్తులు చేసుకునేందుకు ఆఖరి తేదీ 10 నవంబర్ 2026 (ఫిన్లాండ్ సమయం ప్రకారం ఉదయం 11:59 గంటల వరకు). ఎంపిక చేసిన 16 మంది విజేతల పేర్లను 1 డిసెంబర్ 2026న విజిట్ ఫిన్‌లాండ్ ఇన్‌స్టాగ్రామ్ - టిక్‌టాక్ ఖాతాల ద్వారా ప్రకటిస్తారు. ఉచితంగా ప్రయాణించి కొత్త పరిచయాలు, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాధించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.