Begin typing your search above and press return to search.

నాలుగు రోజుల వర్క్ వీక్.. ప్రతిపాదించిన ఫిన్ ల్యాండ్ ప్రధాని.. ఉద్యోగుల్లో హర్షం..

దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా సేవల, పరిశ్రమల, కార్మిక ఆధారిత రంగాలపై ఆధారపడి ఉంది. కానీ టెక్‌ సెక్టార్‌, ఐటీ, క్రియేటివ్‌ ఇండస్ట్రీలు వంటి రంగాల్లో ఇది సాధ్యమే.

By:  Tupaki Political Desk   |   14 Oct 2025 3:30 AM IST
నాలుగు రోజుల వర్క్ వీక్.. ప్రతిపాదించిన ఫిన్ ల్యాండ్ ప్రధాని.. ఉద్యోగుల్లో హర్షం..
X

ప్రపంచం వేగంగా పరుగెడుతోంది. టెక్నాలజీ, గ్లోబలైజేషన్‌, కాంపిటిషన్‌ ఇవన్నీ మన జీవితాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేశాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది.. మనం పని కోసం జీవిస్తున్నామా..? లేక జీవించడానికి పని చేస్తున్నామా..? దీనికి ఫిన్‌లాండ్‌ మాజీ ప్రధాని వద్ద సరైన జవాబు ఉందట. అది ఆమె తీసుకురాబోతున్న సాహసోపేత ప్రతిపాదన ‘వారానికి 4 రోజుల మాత్రమే పని చేయాలి, రోజుకు 6 గంటలు చాలు’ అని.

‘ప్రతి ఒక్కరూ కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడపాలి.. పని జీవితంలో ఒక భాగం కావాలి కానీ.. అదే జీవితం కాదు.’ అన్నారు. ఆమె ఆలోచనలు ఉద్యోగ నియమాల్లో మార్పు కాదు.. అది జీవన విలువల్లో విప్లవంగా చూడాలి.

ఫోర్ డేస్ వర్క్ వీక్ తో లాభమా..? నష్టమా..?

భారత్ తో పాటు చాలా దేశాల్లో వీకెండ్ (కొన్ని ఆఫీసులకు మాత్రమే) అంటూ రెండు రోజుల సమయం కేటాయిస్తున్నారు. ప్రపంచంలో చాలా మంది నాయకులు ‘తక్కువ పని అంటే తక్కువ ఉత్పాదకత’ అని భావిస్తారు. కానీ ఫిన్‌లాండ్‌ ప్రతిపాదన దానికి విరుద్ధం. తక్కువ పని రోజులు ఉన్న దేశాల్లో ఉద్యోగులు ఎక్కువ ఉత్సాహంగా, సృజనాత్మకంగా పనిచేస్తారని తేలింది.

ఉదాహరణకు, స్వీడన్‌లో ఒక కంపెనీ 6 గంటల వర్క్‌డే ప్రయోగం చేసింది. ఫలితం? ఉద్యోగుల ఉత్సాహం 20 శాతం పెరిగింది, సిక్ లీవులు తగ్గాయి, పని నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. ఫిన్‌లాండ్‌ ప్రధాని ఆ భావనను సామాజిక స్థాయికి తీసుకువెళ్లారు ‘ప్రజలు సంతోషంగా ఉంటే, దేశం సమృద్ధిగా ఉంటుంది.’ అని ఆమె అన్నారు.

వర్క్ అండ్ లైఫ్ సమతుల్యత

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు ‘వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌’ కోసం పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఇండియాలో ఇది ఎక్కువ. కరోనా మహమ్మారి తర్వాత రిమోట్ వర్క్, ఫ్లెక్సిబుల్ హవర్స్ వంటి పద్ధతులు కొత్త సాధనంగా మారాయి. కానీ ఇంకా చాలా సంస్థల్లో ఉద్యోగులు సమయానికి మించి పని చేయడం, ఒత్తిడి, మానసిక అలసటతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల వర్క్ వీక్‌ ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. ఇది కేవలం ఆర్థిక లాభం కాదు.. అది మానసిక ఆరోగ్యం, కుటుంబ బంధాలు, వ్యక్తి గత సంతోషంను కాపాడే మార్గం.

భారత్ కు సాధ్యమా?

భారత్‌ వంటి దేశంలో ఈ విధానం తక్షణం అమలు చేయడం కష్టమైనదే.

దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా సేవల, పరిశ్రమల, కార్మిక ఆధారిత రంగాలపై ఆధారపడి ఉంది. కానీ టెక్‌ సెక్టార్‌, ఐటీ, క్రియేటివ్‌ ఇండస్ట్రీలు వంటి రంగాల్లో ఇది సాధ్యమే. ఉదాహరణకు, కొన్ని భారత కంపెనీలు ఇప్పటికే 4 రోజుల వర్క్ వీక్‌ ప్రయోగాలు ప్రారంభించాయి. ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి.

ఫిన్‌లాండ్‌ వరుసగా ఐదేళ్లుగా ‘ప్రపంచంలోని అత్యంత సంతోష దేశం’గా నిలుస్తోంది. దీనికి కారణం కేవలం ఆర్థికాభివృద్ధి కాదు.. అక్కడి ప్రజల జీవన నాణ్యత, మానసిక ఆరోగ్యం, సమానత్వంపై దృష్టి పెడతాయి.ఫిన్‌లాండ్‌ ప్రధాని ప్రతిపాదన అదే దిశలో ఒక కొత్త అడుగు. ఆమె చెప్పిన ‘సంతోషం కూడా ఒక ప్రొడక్షనే’ అన్న మాట ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శనం అవుతోంది.

సంతోషానికి సమయం అవసరం

ఫిన్‌లాండ్‌ లాంటి దేశాలు భారత్ వంటి దేశానికి ఒక పాఠం చెబుతున్నాయి. ‘జీవితం విజయాలతో కాకుండా, సంతోషంతో ఉండాలి.’

రోజుకి 6 గంటల పని అంటే ఆలస్యం కాదు.. అది సమర్థతకు కొత్త నిర్వచనం. ఉద్యోగులు కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచితే.. వారు మరింత కట్టుబాటు, సృజనాత్మకతతో తిరిగి పనిలోకి వస్తారు. భారతదేశం లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కూడా ఇలాంటి ప్రయోగాలను పరిగణించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఆర్థిక వృద్ధి కంటే మానవ సంతోషాన్నే సమాజం అసలైన అభివృద్ధి సూచిక అవుతుంది.

ఫిన్‌లాండ్‌ ప్రధాని ప్రతిపాదించిన “4 రోజుల వర్క్ వీక్” ప్రపంచానికి ఒక సందేశం.. ‘మనం పనిచేయడానికి పుట్టలేదు; జీవించడానికి పుట్టాం.’ఆమె చూపిన మార్గం మానవతా విలువలకు తిరిగి తీసుకువస్తుంది.ఎందుకంటే, చివరికి మన జీవితంలో మిగిలేది జీతం కాదు, జ్ఞాపకాలు.పని మన జీవితంలో భాగమే కావాలి, జీవితమే పనిగా మారద్దు..