అమెరికాను ఎదిరించి.. బతికి బట్టకట్టిన ఒకే ఒక్క దేశాధినేత!
ఇరాక్ సద్దాం హుస్సేన్.. లిబియా కల్నల్ గడాఫీ.. చిలీ అలెండో..! వీరంతా ఒక దశలో అమెరికాకు ఒళ్లు మంట పుట్టించారు.
By: Tupaki Political Desk | 7 Jan 2026 1:07 PM ISTఇరాక్ సద్దాం హుస్సేన్.. లిబియా కల్నల్ గడాఫీ.. చిలీ అలెండో..! వీరంతా ఒక దశలో అమెరికాకు ఒళ్లు మంట పుట్టించారు. వారి పేరు చెబితేనే అగ్రరాజ్యం ఊగిపోయేది..! అదే పంతంతో వీరిని పదవుల నుంచి దించేసింది. సద్దాం, గడాఫీల ప్రాణాలను బలితీసుకుంది. అలెండో ఆత్మహత్యకూ కారణమైంది.
--ఇదంతా ఒకప్పుడు
ఇక తమకు నచ్చలేదని పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ ను దించేసింది.. బంగ్లా పాలకురాలు షేక్ హసీనాకు పారిపోవాల్సిన గతి పట్టించింది.. సిరియా నియంత అసద్ బషర్ ను సాగనంపింది..!
--ఇదీ ఇటీవలి కాలంలో..
ఇలా చరిత్రలో చెప్పుకొంటూ పోతే వివిధ దేశాల విషయంలో అమెరికా చేసిన ఆగడాలు ఎన్నో..! కానీ, అగ్రరాజ్యం కుట్రలను తిప్పికొడుతూ ఒకే ఒక్కడు బతికి బట్టకట్టాడు. అది కూడా ఒక్కసారి కాదు 634సార్లు ప్రాణాలు కాపాడుకుని దేశాధ్యక్ష పదవిలో నిలిచాడు. ఇంకా చెప్పాలంటే.. ఆయన పాలించిన దేశం అమెరికా కేవలం 145 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినా, అతడిని అగ్రరాజ్యం ఏమీ చేయలేకపోయింది. భూమ్మీద నూకలు ఉండడమే కాదు అశేష ప్రజల మద్దతు ఉండడమూ దీనికి కారణమే.
అమెరికా పంటి కింద రాయి క్యూబా
క్యూబా.. ప్రపంచ పటంలో చిన్న ద్వీప దేశం. అమెరికాకు పక్కనే ఉంటుంది. కానీ, ఆ దేశానికి పంటి కింద రాయి. అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరు? అంటే క్యూబా అధినేత ఫిడేల్ క్యాస్ట్రో. ఒక ఏడాది రెండు సంవత్సరాలో కాదు.. క్యాస్ట్రో దశాబ్దాల పాటు అమెరికాకు కంట్లో నలుసుగా ఉన్నారు. ఒక దశలో వెన్నులో వణుకు పుట్టించారు. క్యాస్ట్రో తన విధానాలతో ప్రజల మనసులు చూరగొనడమే కాదు.. క్యూబాను సంక్షేమంలో ఆదర్శంగా నిలిపారు. అణ్వా యుధాలు లేకున్నా.. అన్నపానీయాలకు లోటు లేకుండా చేశారు. భారీ క్షిపణులు లేకున్నా.. ప్రజలకు వైద్యం అందేలా చూశారు. అందుకనే చెక్కుచెదరని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
విషపు చుట్టలతో..
క్యాస్ట్రోను హతమార్చేందుకు అమెరికా చేయని ప్రయత్నాలు లేవు. ఆ దేశ అధ్యక్షులు మారారు కాని.. క్యాస్ట్రోను మాత్రం ఇంచు కూడా కదిలించలేకపోయారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, ఏదీ సఫలం కాలేదు. వాస్తవానికి క్యూబా కంటే వెనెజులా చాలా పెద్ద దేశం. ఆర్థికంగానూ బలమైనదే. అయితే, ఆ దేశ అధ్యక్షుడు నికొలస్ మదురోను ఎత్తుకొచ్చినా.. క్యాస్ట్రో విషయంలో ఆ పని చేయలేకపోయింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ.. క్యాస్ట్రోపై 634 హత్యా ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ఆయన తాగే చుట్టల్లో విషం పెట్టింది. పెన్నుల్లో పేలుడు పదార్థాలు ఉంచింది. విషపు మిల్క్ షేక్ లు, మాఫియా ఒప్పందాలతో క్యాస్ట్రోను మట్టుబెట్టాలనుకుంది. ఏదీ సాధ్యం కాలేదు. చివరకు ఫిడేల్.. 90 ఏళ్ల వయసులో 2016లో తనువు చాలించారు. అమెరికాకు ఎదురొడ్డి అజేయంగా నిలిచారు.
