Begin typing your search above and press return to search.

సంగీత సంబరాల్లో మహిళలపై ‘సూదుల’ దాడులు, కత్తిపోట్లు!

ఫ్రాన్స్‌లో ప్రతి ఏడాది అత్యంత వైభవంగా, ఉల్లాసంగా నిర్వహించే 'ఫెటే డి లా మ్యూజిక్' సంగీత ఉత్సవం ఈసారి తీవ్ర భయాందోళనల మధ్య ముగిసింది.

By:  A.N.Kumar   |   24 Jun 2026 12:33 PM IST
సంగీత సంబరాల్లో మహిళలపై ‘సూదుల’ దాడులు, కత్తిపోట్లు!
X

ఫ్రాన్స్‌లో ప్రతి ఏడాది అత్యంత వైభవంగా, ఉల్లాసంగా నిర్వహించే 'ఫెటే డి లా మ్యూజిక్' సంగీత ఉత్సవం ఈసారి తీవ్ర భయాందోళనల మధ్య ముగిసింది. సంగీతం, సంస్కృతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు.. ఈసారి మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులతో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పాల్గొన్న ఈ వేడుకల్లో మహిళలపై అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సూదులతో గుచ్చడం , కత్తిపోట్ల వంటి ఘోరాలు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఉలిక్కిపడిన ఫ్రాన్స్.. సూదులతో దాడులు, 145 ఫిర్యాదులు

జూన్ 21న దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ఈ సంగీత ఉత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే వేడుకల జోష్‌లో ఉన్న సమయంలో.. పలువురు మహిళలు, యువతులు తమను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సూదులతో గుచ్చారంటూ ఒక్కసారిగా పోలీసులను ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 145 మంది బాధితులు ఈ 'సూది పోట్ల'పై ఫిర్యాదులు నమోదు చేశారు.కేవలం రాజధాని పారిస్ నగరంలోనే 13 ఘటనలు వెలుగుచూశాయి.

వైద్య పరీక్షల్లో బాధితుల్లో కొందరికి శరీరంలో తీవ్ర అసౌకర్యం కలగడంతో వెంటనే ఆసుపత్రులకు తరలించారు. సూదుల ద్వారా ఏవైనా మత్తు పదార్థాలు లేదా హానికర రసాయనాలు శరీరంలోకి ఎక్కించారా అనే కోణంలో వైద్యులు టాక్సికాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సోషల్ మీడియా పోస్టులు.. కుట్ర కోణం

ఈ దాడులకు ముందు సోషల్ మీడియాలో కొన్ని అసాంఘిక శక్తులు "మహిళలను లక్ష్యంగా చేసుకోవాలి" అంటూ చేసిన పోస్టులు వైరల్ కావడం పరిస్థితి తీవ్రతను పెంచింది. ఈ ఆన్‌లైన్ బెదిరింపులకు, ప్రస్తుతం జరిగిన దాడులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రగా భావిస్తూ విచారణ జరుపుతున్నారు.

హింసాత్మకంగా మారిన వీధులు..కత్తిపోట్లు, అరెస్టులు

మరోవైపు ఈ ఉత్సవాల్లో భారీగా హింస కూడా చోటుచేసుకుంది. గుంపుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. ఒక 17 ఏళ్ల యువకుడు కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘర్షణల్లో మొత్తం 14 మంది సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో విధుల్లో ఉన్న 13 మంది భద్రతా సిబ్బంది సైతం గాయపడ్డారు. పరిస్థితి చేతులు దాటిపోతుండటంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ పోలీసులు రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా 240 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

భద్రతా వైఫల్యాలపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ప్రతి ఏటా వీధులు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా సంగీత కచేరీలు నిర్వహించే 'ఫెటే డి లా మ్యూజిక్' ఫ్రాన్స్ సాంస్కృతిక గర్వానికి ప్రతీక. కానీ ఈ ఏడాది జరిగిన ఘటనలు ప్రభుత్వ భద్రతా లోపాలను ఎండగడుతున్నాయి. ముఖ్యంగా భారీ ప్రజా సమూహాలు ఉన్నప్పుడు మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సోషల్ మీడియాలో హింసను ప్రేరేపించే పోస్టులు వస్తున్నా ముందస్తు నివారణ చర్యలు ఎందుకు చేపట్టలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంగీత సంబరాల వేదిక కాస్తా భయానక క్షేత్రంగా మారడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు ఇలాంటి ఉత్సవాల్లో భద్రతను మరింత కఠినతరం చేయాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.