Begin typing your search above and press return to search.

ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నారా? 35 ఏళ్లు దాటితే పిల్లలు కారు ఇక

నేటి ఆధునిక జీవనశైలిలో కెరీర్‌లో స్థిరపడటం, ఆర్థికంగా బలోపేతం కావడం లేదా వ్యక్తిగత లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది యువ జంటలు పిల్లలను కనే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు.

By:  A.N.Kumar   |   28 Jun 2026 7:03 PM IST
ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నారా? 35 ఏళ్లు దాటితే  పిల్లలు కారు ఇక
X

నేటి ఆధునిక జీవనశైలిలో కెరీర్‌లో స్థిరపడటం, ఆర్థికంగా బలోపేతం కావడం లేదా వ్యక్తిగత లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది యువ జంటలు పిల్లలను కనే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే ఈ ఆలస్యం భవిష్యత్తులో సంతానోత్పత్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో 35 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత గర్భం దాల్చే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని గైనకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.

వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతున్న అండాల నాణ్యత

వైద్యుల వివరాల ప్రకారం.. మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో అండాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత కూడా వేగంగా తగ్గుతుంది. దీనివల్ల సహజసిద్ధంగా గర్భం దాల్చే అవకాశాలు క్షిణించడమే కాకుండా గర్భధారణ సమయంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పెరుగుతుంది.

35 ఏళ్లు దాటిన తర్వాత ఎదురయ్యే ప్రధాన సమస్యలు

అండాల లభ్యత తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం ఆలస్యమవుతుంది. వయస్సు పైబడిన వారిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువ. పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు ఉదాహరణకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో హైబీపీ , డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.

పురుషుల్లోనూ సంతానోత్పత్తి సమస్యలు

సంతానోత్పత్తి సమస్యలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదు. పురుషుల్లో కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ వీర్యకణాల నాణ్యత, వాటి చురుకుదనం తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల భాగస్వామి గర్భం దాల్చడం ఆలస్యం కావడం లేదా పుట్టబోయే పిల్లల్లో కొన్ని రకాల ఆరోగ్య లోపాలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు ఇవే

భవిష్యత్తులో సంతానలేమి సమస్యల బారిన పడకుండా ఉండటానికి నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. 30 నుంచి 35 ఏళ్ల లోపే దంపతులు ఒకసారి ఫెర్టిలిటీ పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీనివల్ల లోపాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు.

ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి..

వ్యక్తిగత లేదా కెరీర్ కారణాల వల్ల గర్భధారణను మరింత కాలం వాయిదా వేయాలనుకునే మహిళలకు 'ఎగ్ ఫ్రీజింగ్' ఒక అద్భుతమైన ఆధునిక సాంకేతికతగా ఉపయోగపడుతుంది. చిన్న వయసులోనే అండాలను భద్రపరచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర ఫెర్టిలిటీ రేటును పెంచుతాయి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు అండాలు, వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. మితిమీరిన ఒత్తిడి, ఆందోళనలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. కాబట్టి యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి.

కెరీర్, వ్యక్తిగత లక్ష్యాలు ఎంత ముఖ్యమైనవో.. కుటుంబ విస్తరణకు సరైన సమయాన్ని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తులో అనవసర ఆందోళనలు, ఖరీదైన చికిత్సల అవసరం లేకుండా ఉండాలంటే ముందుగానే ఫెర్టిలిటీపై అవగాహన పెంచుకుని, వైద్యుల సలహాలతో స్పష్టమైన కుటుంబ ప్రణాళిక రూపొందించుకోవడం ఉత్తమ నిర్ణయం.