పెళ్లికి ముందు రహస్య పరీక్షలు చేయించుకుంటున్న జంటలు.. ఎందుకంటే?
సంతానలేమి అనేది మహిళలకు సంబంధించిన సమస్యగా భావించినప్పటికీ ఇది పురుషులలో కూడా అంతే సాధారణంగా చెప్పొచ్చు.
By: A.N.Kumar | 10 Dec 2025 10:30 AM ISTకాలం మారింది.. మన తిండి మారింది.. స్కూలు కు వెళ్లే పిల్లాడికే తెల్లవెంట్రుకలు వచ్చేస్తున్నాయి. యువకులకు గుండెపోట్లు వస్తున్నాయి. కాలుష్యం, కలుషిత తిండితో మగాళ్లలో సంతాన సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. ఇప్పుడు జంటకు సంతానం కలుగడం పెద్ద టాస్క్ లా మారింది. ఈ మధ్య కాలంలో కుటుంబాలను ప్లాన్ చేసుకుంటున్న యువ జంటలు సంతానం కాక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ఐదేళ్లు అయినా పిల్లలు పుట్టని జంటలు నరకం అనుభవిస్తున్నాయి. మగాడిని మగాడిగా చూడడంలేదు. ఆడవాళ్లను గొడ్రాలు అంటూ తిట్టిపోస్తున్నారు. ఏ ఫంక్షన్ కు వెళ్లినా.. పిల్లలు లేరా? అంటూ దెప్పిపొడుపులు ఎదురవుతున్నాయి. ఈ సంతాన సమస్యలు పెరిగిపోవడంతో ఇప్పుడు యువ వధువులు తనకు కాబోయే వరుడికి పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నారు. ఈ ధోరణులు పెరుగుతున్నాయి.
సంతానలేమి అనేది మహిళలకు సంబంధించిన సమస్యగా భావించినప్పటికీ ఇది పురుషులలో కూడా అంతే సాధారణంగా చెప్పొచ్చు. దేశంలో మొత్తం సంతానలేమి కేసులను పరిశీలిస్తే 40 శాతం మగవారి కారణాల వల్ల మరో 40 శాతం ఆడవారి కారణాల వల్ల..10 శాతం ఇద్దరి కారణాల వల్ల.. మిగిలిన 10 శాతం కారణం తెలియని కేసులు ఉన్నాయని ఎయిమ్స్ ఢిల్లీలో యూరాలజీగా ఉంటూ ఈ విషయంపై గణనీయమైన పరిశోధన చేసిన డాక్టర్ గుప్తా వెల్లడించారు.
అందుకే యువ జంటలు వివాహానికి ముందే సంతాన సామర్థ్యంపై పరీక్షలు చేయించుకుంటున్నాయి. రహస్యంగానైనా ఈ పరీక్షలు చేసుకుంటున్నాయి. సమస్యను ముందుగా గుర్తించి పరిష్కరించుకుంటున్నాయి. వీర్య విశ్లేషణ పరీక్షలతో మగవారిలో తక్కువ శుక్రకణాల సంఖ్య లేదా ఇతర లోపాలను త్వరగా గుర్తించవచ్చు. సమస్యను ముందుగా గుర్తిస్తే అది శస్త్రచికిత్స లేదా జీవనశైలి మార్పుల ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.
పరీక్షల ద్వారా తమ సంతానోత్పత్తి స్థితిని తెలుసుకోవడం వల్ల జంటలు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు మానసికంగా సిద్ధంగా ఉండవచ్చు.మెరుగైన ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈ ధోరణి పెరుగుతున్న యువ జంటలు తమ ఆరోగ్యానికి ముఖ్యంగా సంతానోత్పత్తి ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాముఖ్యతను సూచిస్తుంది..
