Begin typing your search above and press return to search.

అద్భుత కథ... కూతురి కల కోసం తండ్రి తలచుకుంటే ఇలా ఉంటుంది!

తన కుమార్తెకు తానే హీరో అవ్వాలని.. జన్మంతా ఆమె ప్రేమను పొందాలని.. ఊపిరి ఉన్నంతవరకూ ఆమె కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలని తండ్రి భావిస్తుంటాడు

By:  Raja Ch   |   24 Oct 2025 1:00 AM IST
అద్భుత కథ... కూతురి కల కోసం తండ్రి తలచుకుంటే ఇలా ఉంటుంది!
X

తండ్రీకూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. తన కుమార్తెకు తానే హీరో అవ్వాలని.. జన్మంతా ఆమె ప్రేమను పొందాలని.. ఊపిరి ఉన్నంతవరకూ ఆమె కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలని తండ్రి భావిస్తుంటాడు. ఈ క్రమంలో తన కూతురి కల కోసం ఓ తండ్రి కమిట్మెంట్ ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చిందో చెప్పే విషయం ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ఒక కూతురి కల, దానిని నెరవేర్చాలనే తండ్రి సంకల్పం, నాణేలతో నిండిన బ్యాగ్ - ఈ అద్భుత కథకు ఛత్తీస్‌ గఢ్‌ లోని జాష్‌ పూర్ జిల్లాలోని ఒక ద్విచక్ర వాహన షోరూమ్ వేదికైంది. ఆశ, ప్రేమ యొక్క హృదయపూర్వక కథను ప్రపంచానికి చూపించింది.

వివరాళ్లోకి వెళ్తే... బజరంగ్ రామ్ కుమార్తె చంపా భగత్ సుమారు లక్ష రూపాయల స్కూటర్ కావాలని కోరుకుంది. అయితే... బజరంగ్ రామ్ అనే సామాన్య రైతుకు ఇది హిమాలయ పర్వతం అంత ఎత్తైన పని అని చెప్పొచ్చు. కానీ ప్రేమ ముందు పర్వతాలు సైతం తలవంచుతాయని ఆ తండ్రి నిరూపించాడు. ఈ సందర్భంగా సుమారు ఆరు నెలలుగా అతడి ప్రయాణం అద్భుతమనే చెప్పాలి.

కుమార్తె కోరిక, తండ్రి సంకల్పం!:

బజరంగ్ రామ్ ను ఆయన కుమార్తె కోరింది చిన్న కోరికైతే కాదు. ఎందుకంటే.. రోజంతా కష్టపడితే కానీ డొక్కలు నిండని పరిస్థితి ఆ కుటుంబానిది! అయితే.. అడక్క అడక్క తన కుమార్తె స్కూటర్ అడిగే సరికి.. తండ్రి గుండే కాదనలేకపోయింది. తన కుమార్తె ఇష్టాన్ని తీర్చాలని నిశ్చయించుకుంది. అప్పటి నుంచి అదే ప్రధానంగా తన లక్ష్యం అయ్యింది.

ఈ సమయంలో తండ్రి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... సంపాదించిన దాంట్లో రోజూ కొన్ని నాణేలను ఒక బ్యాగ్‌ లో వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో సుమారు ఆరు నెలల పాటు ఒక్కరోజు కూడా మిస్సవ్వకుండా అదే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా దాచిన సొమ్మును తీసుకొని ధన్‌ తేరస్ రోజున షోరూమ్‌ కు వెళ్లారు.

ఆశ్చర్యానికీ ఆనందానికీ మధ్య షోరూమ్ సిబ్బంది!:

అలా ఆరు నెలల పాటు సంచిలో దాచిన నాణేలను తీసుకుని కుటుంబ సభ్యులతో పాటు షోరూమ్ కి వెళ్లిన బజరంగ్ రామ్... తన బ్యాగ్‌ లోని నాణేలను సిబ్బంది ముందు పోసి, తాను స్కూటర్ కొనాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో.. ఆ నాణేల మూటను చూసిన సిబ్బంది విషయం తెలియక ముందు ఆశ్చర్యపోగా.. తెలిశాక ఆనందపడ్డారు!

ఈ సందర్భంగా స్పందించిన షోరూం డైరెక్టర్ ఆనంద్ గుప్తా.. ఆయన వాటిని ఎందుకు తెచ్చాడు..? అని ఆరా తీశాడు. ఈ క్రమంలోనే ఈ తండ్రీకుమార్తె కథ తెలిసింది. దీంతో... వెంటనే ఆ నాణేలను లెక్కించాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఆ కుటుంబ సభ్యులను హృదయపూర్వకంగా ఆహ్వానించి వారికి టీ ఇచ్చారు.

ఈ సమయంలో సిబ్బంది చేతుల్లో నాణేలు కదులుతున్నాయి.. వాటిలో ప్రతి ఒక్కటి ఆశ యొక్క రోజును.. తండ్రి ప్రేమను, త్యాగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆ నాణేలు అన్నీ కలిపితే రూ. 40,000 అయింది. మిగిలిన మొత్తానికి తాను లోన్ తీసుకుంటానని భగత్ రామ్ చెప్పాడు. పేపర్ వర్క్ పూర్తయింది.. బ్రాండ్ న్యూ హోండా యాక్టివా కీ కుమార్తె కు అందింది.

ఆనందంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యింది.. ఆమె కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. ఆమెకు అది కేవలం స్కూటర్ కాదు.. ఆమె తండ్రి విశ్వాసం, అంతులేని ప్రయత్నం, అమితమైన ప్రేమ అసాధ్యాన్ని సుసాధ్య చేసేలా ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని కనుగొంటుందని చెప్పే నిశ్శబ్ద సందేశం. ఈ సందర్భంగా స్పందించిన చంపా. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని చెప్పింది.

స్క్రాచ్ & విన్ లో ఓ బహుమతి!:

ఆ రోజును మరింత చిరస్మరణీయంగా మార్చడానికి అన్నట్లుగా.. ఆ కుటుంబం షోరూమ్ పెట్టిన 'స్క్రాచ్ & విన్' ఆఫర్ కింద మిక్సర్ గ్రైండర్‌ ను గెలుచుకుంది. అనంతరం... కుటుంబం షోరూమ్ నుండి బయటకు వెళ్ళగానే.. అక్కడున్న జనాలు, సిబ్బంది వారి కొనుగోలు వెనకున్న కథకు చప్పట్లు కొట్టారు.