Begin typing your search above and press return to search.

పెరట్లో పండనున్న బంగారం, వెండి.. నమ్మకపోతే ఇది చూడండి!

భూమిలో సాగు చేస్తే ఏమి పండుతాయి?... అదేమి పిచ్చి ప్రశ్న... వరి, పప్పులు ధాన్యాలు, పళ్లు, దుమపలు, కూరగాయలు, పూలు, ఆకులు, మొదలైనవి.

By:  Raja Ch   |   9 Nov 2025 8:00 PM IST
పెరట్లో పండనున్న బంగారం,  వెండి.. నమ్మకపోతే ఇది చూడండి!
X

భూమిలో సాగు చేస్తే ఏమి పండుతాయి?... అదేమి పిచ్చి ప్రశ్న... వరి, పప్పులు ధాన్యాలు, పళ్లు, దుమపలు, కూరగాయలు, పూలు, ఆకులు, మొదలైనవి. అలా కాకుండా భూమిలో సాగు చేస్తే.. బంగారం, వెండి, నికెల్, కాడ్మియం వంటి విలువైన లోహాలు పండితే..? అలా మాట్లాడితే పిచ్చోడు అనుకుంటారు అంటారా? అయితే అది తప్పు! భూమిలో సాగు చేసి విలువైన లోహాలు పండిస్తున్నారు రైతులు. ఎక్కడ.. ఎలా అనేది ఇప్పుడు చూద్దామ్...!




అవును... భూమిలో వ్యవసాయం చేసి విలువైన లోహాలు పండిస్తున్నారు రైతులు. భూమిని తవ్వాల్సిన పనిలేకుండానే అందులోని లోహాలను పంటల నుంచీ వెలికితీస్తున్నారు. ఈ పద్దతినే 'ఫైటో మైనింగ్‌' లేదా 'అగ్రి మైనింగ్‌' అని అంటున్నారు. ఈ తరహా వ్యవహాసం మొదలైంది ఉక్రెయిన్ దేశంలో. ఆ దేశంలోని ఓ ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రం వద్ద జరిగిన ఓ ప్రమాదం వల్ల నేలా, నీరు విషంగా మారిన వేళ ఈ కొత్త విషయం ఆ ప్రాంతంలో పురుడు పోసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... అది ఏప్రిల్ 26, 1986వ సంవత్సరం. ఉక్రెయిన్ దేశంలోని చెర్నోబిల్ అనే నగరంలో ప్రపంచంలోనే అత్యంత దారుణమైన అణు విపత్తు జరిగింది. ఈ ప్రమాదం కారణంగా పెద్ద మొత్తంలో రెడియేషన్ విడుదలయ్యింది. దీంతో... ఈ ప్రాంతంలోని నేల, నీరు తీవ్రంగా కలుషితమయ్యాయి. ప్రధానంగా అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాల నుండి ఈ ప్రాంతం దాదాపు పూర్తిగా మినహాయించబడింది. ఫలితంగా... ఇది మరుభూమిగా మారిపోయింది.

బయో రెమిడియేషన్ పరిష్కారం!:

అలాంటి పరిస్థితుల్లో చెర్నోబిల్ అనే నగరానికి ఊపిరిపోసే విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ భూమిని తిరిగి వినియోగంలోకి తేవడానికి శాస్త్రవేత్తలకు బయో రెమిడియేషన్‌ అనే పరిష్కారం దొరికింది. ఈ సమయంలో... కొన్ని రకాల చెట్లకు వాతావరణంలో ఉన్న విష వాయువులు, లోహాలను పీల్చుకుని వాటిని తమలో దాచుకునే శక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

అలా చెర్నోబిల్‌ లో 1990లో వేసిన పొద్దుతిరుగుడు మొక్కలూ, ఆవపంటలే ఆ నేలని కాపాడాయి. ఆ తర్వాత నుంచే భూమిని తవ్వాల్సిన పనిలేకుండా, లోహాలను పంటల నుంచీ వెలికితీసే 'ఫైటో మైనింగ్‌' పైన శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు.

చెట్టు బెరడులో బంగారం!:

ఇలా భూమిని తవ్వే పని లేకుండానే లోపలున్న లోహాలను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా... పొగాకు, యూకలిప్టస్, సన్‌ ఫ్లవర్, ఆవ, స్ప్రూస్, ఫెర్న్, హెంప్‌ వంటి కొన్ని మొక్కలకి బంగారం, వెండీ, నికెల్, కాడ్మియం సహా ఇతర లోహాలని తమ ఆకుల్లో, వేర్లలో, బెరడులో దాచుకునే శక్తి ఉందని తెలుసుకున్నారు! ఈ క్రమంలో... ఆ మొక్కలని ఎండబెట్టి, బూడిద చేయడం ద్వారా అందులోని లోహాలను సేకరించవచ్చు.

హెక్టార్ కి 400 కేజీల నికెల్!:

ఈ క్రమంలోనే... అల్బేనియాలో 'మెటల్‌ ప్లాంట్‌' అనే స్టార్టప్‌ బీడు భూముల్లో ‘ఒడోంటారెనా’ అనే మొక్కలని సాగు చేసి హెక్టార్‌ కి 400 కేజీల నికెల్‌ ని పండిస్తోంది. ఇదే సమయంలో... ఇండోనేషియాలోని కినబాలు ప్రాంతంలో ఉన్న 'పైక్‌ నాండ్రా' అనే ఒక చెట్టు, రబ్బరు చెట్టు జిగురుని స్రవించినట్టుగా నికెల్‌ ని స్రవిస్తుంది. దీనిమొత్తం బరువులో 25శాతం నికెల్‌ ఉంటుందట.

దీంతో... అగ్రరాజ్యం అమెరికాతో పాటు చైనా, బ్రెజిల్, క్యూబా సహా అనేక దేశాలు ఈ చెట్లను పెంచడానికి ముందుకు వస్తున్నాయి. అందుకు కారణం ఎలక్ట్రానిక్స్‌ తయారీలో నికెల్‌ వాడకం పెరగడమే!

క్రిస్మస్ చెట్లలో బంగారు రేణువులు!:

ఇక బంగారం విషయానికొస్తే... ఫిన్‌ ల్యాండ్‌ లో క్రిస్మస్‌ చెట్లుగా పిలిచే స్ప్రూస్‌ వృక్షాల్లో ఇటీవల శాస్త్రవేత్తలు బంగారపు రేణువుల జాడని కనిపెట్టారు. ఒక్క స్ప్రూస్‌ చెట్లకే కాదు సన్‌ ఫ్లవర్, ఆవ, యూకలిప్టస్‌ చెట్లకూ బంగారాన్ని దాచుకునే గుణం ఉందని చెబుతున్నారు. దీంతో... మొక్కల నుంచి వెలికి తీసిన లోహాలతో 'హెచ్‌2ఈఆర్‌జీ' అనే సంస్థ నగలనూ తయారుచేస్తోంది. సో... అన్నీ అనుకూలంగా జరిగితే వీలైనంత తొందరలోనే మన పెరట్లోనూ బంగారం పండించొచ్చన్నమాట!