అమ్మో ఆఫ్రికన్ నత్తలు.. పల్లెల నుంచి హైదరాబాద్ వరకు ఒకటే దడ!
కీటక జాతికి చెందిన ఈ నత్తలు ఎప్పుడో 300 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మన దేశానికి వచ్చాయి.
By: Tupaki Political Desk | 9 Nov 2025 6:00 PM IST"నత్తలు వస్తున్నాయి జాగ్రత్త" అనేది మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒక సైన్స్ ఫిక్షన్ నవల. వేరే ప్రదేశం నుంచి తీసుకువచ్చిన ఒక జీవి వల్ల కలిగే ప్రమాదాలు, విపత్తుల గురించి ఈ నవలలో వివరిస్తారు. భవిష్యత్తును ఊహించి మల్లాది రాసినట్లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నత్తలు హడలెత్తిస్తున్నాయి. ఏపీలోని మారుమూల శ్రీకాకుళం జిల్లా నుంచి అటు చిత్తూరు వరకు.. ఇటు తెలంగాణలోని హైదరాబాద్ మహనగరంలో కూడా ఎక్కడ విన్నా ఇప్పుడు నత్తల దండు కోసమే చర్చ జరుగుతోంది. వేలాదిగా నత్తల దండు దాడులతో పంట పొలాలు గుల్ల అవుతున్నాయి.
కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నత్తల బెడదపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కీటక జాతికి చెందిన ఈ నత్తలు ఎప్పుడో 300 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మన దేశానికి వచ్చాయి. ఇక ఇటీవల కాలంలో కేరళ నుంచి తీసుకువచ్చిన వక్క తోటల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చేరినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కోనత్త ఏడాదిలో వెయ్యి నుంచి రెండువేల గుడ్లు పెడతాయని చెబుతున్నారు. పగటిపూట ఎక్కడా కనిపించని నత్తలు రాత్రిపూట పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. తెల్లారి చూసేసరికి పంట అంతా సర్వనాశనం అయిపోతోంది.
పొలాల్లో తుప్పలు, ఆకుల కింద గాలి, వెలుతురు తగలని చోట ఉంటున్న నత్తలను పట్టుకునే రైతులు, రైతు కూలీలకు చర్మవ్యాధులు వస్తున్నాయి. ఒకవైపు పంటల దెబ్బతింటూ మరోవైపు మనుషుల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న నత్తలను సామూహికంగా నివారించాల్సిన అత్యావసరం ఉందని రైతులు కోరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట నత్తల దాడితో పంటలు దెబ్బతింటున్నాయని, ఈ సమస్య మరింత తీవ్రం అవ్వకముందే ప్రభుత్వాలు మేలుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
కొన్నాళ్ల క్రిత పల్లె ప్రాంతాలకే పరిమితమైన నత్తలు తాజాగా హైదరాబాదులోని ఓల్డ్ బోయినపల్లిలో కూడా కనిపించాయి. ఇవి అక్కడ చెట్లకు చెట్లనే తినేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆఫ్రికా నత్తల సంతానోత్పత్తి రేటు అధికంగా ఉండటం వల్ల సమస్య తీవ్రత మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఇది ద్విలింగ జాతికి చెందినది కావడంతో రెండేళ్ల వయస్సు లోనే సంతానోత్పత్తి ప్రారంభిస్తుందని అంటున్నారు. ఇక జూలై నుంచి ఫిబ్రవరి వరకు సంతానోత్పతికి అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం వీటి సంతానోత్పత్తికి అనుకూల సమయం కావడంతో బెడద మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
