దేశవ్యాప్త ఉగ్ర దాడులకు రెండేళ్ల కుట్ర: డాక్టర్ షాహిన్ షాకింగ్ నిజాలు!
దేశ భద్రతను కుదిపేసే భారీ ఉగ్ర కుట్రకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By: A.N.Kumar | 12 Nov 2025 4:15 PM ISTదేశ భద్రతను కుదిపేసే భారీ ఉగ్ర కుట్రకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్‌లో అరెస్ట్ అయిన డాక్టర్ షాహిన్ విచారణలో అధికారుల ముందు అంగీకరించిన విషయాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ ఉగ్ర సంస్థ నేతృత్వంలో దాదాపు రెండేళ్లుగా దేశవ్యాప్తంగా బహుళ ఉగ్ర దాడులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె ఒప్పుకుంది.
* జైష్-ఎ-మహ్మద్ మాడ్యూల్‌తో బలమైన సంబంధాలు
విచారణలో డాక్టర్ షాహిన్ ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. శ్రీనగర్‌కు తరలించిన తర్వాత జరిపిన విచారణలో ఉమర్, డాక్టర్ ముజమ్మిల్, ఆదిల్ వంటి జైష్-ఎ-మహ్మద్ మాడ్యూల్ సభ్యులతో కలిసి దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు షాహిన్ అంగీకరించింది. ఈ దాడుల కోసం వారు అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు ఆమె వెల్లడించింది.
* సోదరుడు, సరఫరాదారు పాత్ర కూడా బహిర్గతం
ఈ కుట్రలో షాహిన్ సోదరుడు పర్వేజ్ సయీద్ పాత్ర కూడా ఉన్నట్లు ఆమె తెలిపింది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు లభించనప్పటికీ, అరెస్టు భయంతో వాటిని దాచిపెట్టి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. గురుగ్రామ్‌కు చెందిన అమ్మోనియం నైట్రేట్ సరఫరాదారుడి వివరాలను కూడా షాహిన్ అధికారులకు అందించింది. భద్రతా సంస్థలు ఆ వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్టు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
* జమాత్ ఉల్ మొమినాత్ - సాదియా అజార్‌తో కనెక్షన్
అధికారుల అంచనా ప్రకారం, షాహిన్ జమాత్ ఉల్ మొమినాత్ అనే సంస్థలో కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థకు జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి అయిన సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నారు. భారతదేశంలో మహిళా విభాగాలను ఏర్పాటు చేయడం.. కొత్త నియామకాలు చేపట్టడం వంటి బాధ్యతలను షాహిన్ నిర్వర్తించినట్లు సమాచారం.
* ఎర్రకోట పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలా?
ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి మరో కీలక అంశం చర్చకు వచ్చింది. పేలుడు తీవ్రతను బట్టి.. ఈ దాడిలో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు ఉపయోగించి ఉండవచ్చని అధికారులు బలమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ షాహిన్ అంగీకారాలు, వెల్లడించిన వివరాల ఆధారంగా జైష్-ఎ-మహ్మద్ సంస్థ భారత్‌లో పెద్ద ఎత్తున, సమన్వయంతో కూడిన ఉగ్ర దాడులు చేయడానికి ప్రయత్నించిందని స్పష్టమవుతోంది. ఈ ఉగ్ర కుట్ర నెట్‌వర్క్ విస్తృత స్థాయిలో ఉందని గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. ఈ కేసు దేశ భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని ముఖ్యమైన వివరాలు.. అరెస్టులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
