Begin typing your search above and press return to search.

ఉగ్రదాడి ప్లానింగ్ టర్కీ నుంచి.. ఎందుకు?

మన దేశంలో చోటు చేసుకునే ఉగ్రదాడి ఏదైనా.. దాని మూలాలు దాయాది పాక్ నుంచి ఉండటం ఇంతకాలంగా చూస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి మారింది.

By:  Garuda Media   |   13 Nov 2025 9:44 AM IST
ఉగ్రదాడి ప్లానింగ్ టర్కీ నుంచి.. ఎందుకు?
X

మన దేశంలో చోటు చేసుకునే ఉగ్రదాడి ఏదైనా.. దాని మూలాలు దాయాది పాక్ నుంచి ఉండటం ఇంతకాలంగా చూస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి మారింది. ఉగ్రవాదులు సైతం చావు తెలివిని ప్రదర్శిస్తూ.. భారత ప్రభుత్వానికి సవాలు విసిరేలా ప్లాన్ చేయటం కనిపిస్తోంది. ఇంతకాలం పాకిస్థాన్ లో కూర్చొని ఉగ్రదాడులకు ప్లాన్ చేసే వారు ఇప్పుడు టర్కీకి షిప్టు అయ్యారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని చోటు చేసుకున్న కారు పేలుడు.. దాని తీవ్రతకు మొత్తం12 మంది మరణిస్తే.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడి ఉగ్రదాడిగా పేర్కొంటూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్రముఠాకు.. జైషే మహ్మద్ ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే.. జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాక్ నుంచి కాకుండా టర్కీ నుంచి ఆదేశాలు ఇవ్వటం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. దేశంలో జరిగే ఉగ్రదాడిని యుద్ధంగా భావిస్తామని.. తగిన రీతిలో జవాబు ఇస్తామని మోడీ సర్కారు ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పేర్కొన్న నేపథ్యంలో పాక్ నుంచి దుకాణాన్ని టర్కీకి మార్చేశారు.

దీనికి కారణం లేకపోలేదు. టర్కీ నాటోలో భాగం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనేజేషన్ లో భాగమైన టర్కీని ఉగ్ర డెన్ గా మార్చుకోవటం ద్వారా.. భారత్ ఆ దేశం మీద నేరుగా దాడి చేసే వీల్లేదు. ఒకవేళ దాడి చేస్తే.. నాటో కూటమిలో భాగమైన అమెరికా.. బ్రిటన్.. ఫ్రాన్స్ లాంటి భాగస్వామి దేశాల మీదా దాడి చేసినట్లుగా భావిస్తారు. నాటో మీద ఎవరు దాడి చేసినా.. మిగిలిన సభ్య దేశాలు తమ మీద దాడి చేసినట్లుగా రియాక్టు అవుతారు. ఈ కారణంగానే టర్కీ నుంచి ఉగ్ర ప్లానింగ్ చేపడితే.. పాక్ లో మాదిరి తమ మీద దాడి చేయరన్న అతి తెలివిని ప్రదర్శించి.. తన డెన్ ను పాక్ నుంచి టర్కీకి మార్చేశారు.

తాజా ఉగ్రదాడికి పాల్పడిన వారు టెలిగ్రాం గ్రూపుల ద్వారా మాట్లాడుకునే వారన్న విషయాన్ని గుర్తించారు. ఈ మధ్యన జమ్ముకశ్మీర్ లో పోలీసులు అరెస్టు చేసిన డాక్టర్లు ఉగ్రవాదం వైపు మళ్లినట్లుగా గుర్తించారు. ఈ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారానే టర్కీలోని జైషే మహ్మద్ ఉగ్రవాదితో మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాలని పిలుపునిస్తూ.. మెల్లిగా భారత్ పై ఉగ్రదాడులు చేసేలా వారిని సిద్ధం చేశారు. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ కూడా ఈ గ్రూపుల్లోని సభ్యుడేనని భావిస్తున్నారు.

ఎర్రకోట వద్ద ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ముఠా దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో దాడులకు కుట్ర పన్నినట్లుగా నిఘా సంస్థలు గుర్తించాయి. 2008లో పాక్ ఉగ్రవాదులు ముంబైలో ఎలా అయితే మెరుపు దాడులకు పాల్పడ్డారో.. అదే తరహాలో దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలక ప్రదేశాలు.. రైల్వేస్టేషన్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనూ ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేశారు. నిజానికి ఈ దారుణ ప్లాన్ దీపావళి సందర్భంగా చేపట్టాలని భావించినా కుదర్లేదు. అందుకే.. డిసెంబరు 6న కానీ.. జనవరి 26న కాని దాడులకు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు.