Begin typing your search above and press return to search.

దేశాన్ని మరింత నాశనం చేసుకుంటున్న పాక్.. అందుకే అమెరికాకు అంత విలువైన సంపద..

భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ తర్వాత ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు పాక్‌ను మరింత ఒంటరిగా మార్చాయి.

By:  Tupaki Political Desk   |   8 Jan 2026 2:00 PM IST
దేశాన్ని మరింత నాశనం చేసుకుంటున్న పాక్.. అందుకే అమెరికాకు అంత విలువైన సంపద..
X

ఒక దేశం తన భూభాగంలో దాగి ఉన్న ఖనిజ సంపదను ‘ఆఫర్’ చేయాల్సిన స్థితికి వస్తే.. అది కేవలం ఆర్థిక మాత్రమే కాదు.., అది ఆ దేశ రాజకీయ, భద్రతా వైఫల్యానికి ప్రతీక. తాజాగా పాకిస్థాన్‌ చేసిన ప్రతిపాదన అదే చేదు వాస్తవాన్ని బహిర్గతం చేస్తోంది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ తర్వాత ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు పాక్‌ను మరింత ఒంటరిగా మార్చాయి. ఆ ఒంటరితనమే ఇప్పుడు అమెరికా ముందు చేతులు చాచే స్థితికి తీసుకొచ్చింది. భారత్‌ చేపట్టిన ఈ ఆపరేషన్‌ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు. అది దక్షిణాసియాలో భద్రతా సమీకరణాలను తిరగరాసిన సంకేతం. ఉగ్రవాదంపై భారత వైఖరి ఎంత కఠినంగా ఉంటుందో ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసింది. ఈ పరిణామాల తర్వాత పాకిస్థాన్‌ అంతర్జాతీయంగా మరింత ఇబ్బందుల్లో పడింది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భద్రతా ఒత్తిడి, ఇంకోవైపు దౌత్యపరమైన ఒంటరితనం ఈ మూడింటి మధ్య పాక్‌ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

లిథియం, కాపర్ అమెరికాకు..

ఈ నేపథ్యంలోనే అమెరికాతో సంబంధాలను తిరిగి బలపర్చుకునేందుకు పాకిస్థాన్‌ కొత్త ఎత్తుగడకు దిగింది. తమ దేశంలో ఉన్న లిథియం, కాపర్‌ వంటి విలువైన ఖనిజాలను అమెరికాకు ఆఫర్‌ చేస్తూ, సహకారం కోరుతోంది. లిథియం అనేది ఈ రోజుల్లో ప్రపంచ వ్యూహాత్మక వనరు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీ, రక్షణ రంగం అన్నింటికీ ఇది కీలకం. అదే విధంగా కాపర్‌ కూడా ఇండస్ట్రియల్‌ ఎకానమీకి వెన్నెముక. ఈ వనరులను ఆఫర్‌ చేయడం ద్వారా అమెరికా మద్దతు పొందాలన్నదే పాక్‌ ఆశ. కానీ ఇక్కడ ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. ఇది పాక్‌ స్వచ్ఛంద భాగస్వామ్యమా? లేక దౌర్భాగ్య పరిస్థితుల్లో చేసిన డీల్‌మేకింగేనా? వాస్తవానికి ఇది రెండోది అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పాక్‌ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ సంస్థల వద్ద నమ్మకం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ వనరులను బేరానికి పెట్టడం అనివార్యంగా మారింది.

విదేశాంగ విధానంలో వచ్చే మార్పు..

మరో కోణంలో చూస్తే, ఇది పాక్‌ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పునకు సూచన. గతంలో చైనాపై ఆధారపడిన ఇస్లామాబాద్‌, ఇప్పుడు అమెరికాను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ చైనా–అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక పోటీలో పాక్‌ ఒక పావుగా మారిపోతుందా అన్న సందేహాలు ఉన్నాయి. చైనాతో ఉన్న సీపీఈసీ ప్రాజెక్టులు, అప్పుల ఉచ్చు – ఇవన్నీ పాక్‌ను ఇప్పటికే బంధించాయి. ఇప్పుడు అమెరికాతో కొత్త డీల్‌లు పాక్‌కు ఉపశమనం ఇస్తాయా? లేక మరో ఆధారపడే బంధాన్ని సృష్టిస్తాయా? అన్నది కాలమే చెప్పాలి. అమెరికా దృష్టితో చూస్తే, పాక్‌ ప్రతిపాదన పూర్తిగా తిరస్కరించదగినది కాదు. ఖనిజాల సరఫరా, భౌగోళిక ప్రాధాన్యం, దక్షిణాసియాలో వ్యూహాత్మక సమతుల్యం.. ఇవన్నీ వాషింగ్టన్‌కు ఆకర్షణీయమే. కానీ అదే సమయంలో భారత్‌తో ఉన్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అమెరికా తేలిగ్గా పక్కన పెట్టదు. ఇండో–పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌ కీలక భాగస్వామి. ఉగ్రవాదంపై పాక్‌ పాత్రపై అమెరికాలో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పాక్‌ ఆశించిన స్థాయి మద్దతు రావడం అంత సులువు కాదు.

భారత్ తో పెట్టుకుంటే ఇంకా నాశనం కాక తప్పదు..

ఇక్కడ ఆపరేషన్ సింధూర్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌ తన భద్రతా ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడదన్న సంకేతం ప్రపంచానికి చూపించింది. దాని ఫలితంగానే పాక్‌ దౌత్యపరంగా మరింత వెనక్కి నెట్టబడింది. ఇప్పుడు ఖనిజ సంపదను బేరంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక రకంగా పాక్‌ రాజకీయ–ఆర్థిక దారిద్ర్యానికి అద్దం పడుతోంది. చివరగా చెప్పాలంటే, పాక్‌ అమెరికాకు చేస్తున్న ఈ ఆఫర్‌ ఒక దేశం ఎంత లోతైన సంక్షోభంలో ఉందో చెప్పే సంకేతం. ఖనిజాలు దేశానికి సంపద కావాలి, బేరం కాదు. కానీ పరిస్థితులు బలవంతం చేస్తే.. దేశాలు తమ భవిష్యత్తును కూడా డీల్‌ టేబుల్‌పై పెట్టాల్సి వస్తుంది. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పాక్‌ పరిస్థితి అచ్చంగా అదే. ఇది దౌత్య విజయం కాదు.. దౌర్భాగ్యానికి దారితీసిన రాజకీయ కథ.