Begin typing your search above and press return to search.

విశాఖ బీచ్ లో సూపర్ స్టార్ విగ్రహం

అయితే దీని మీద జనసేనకు చెందిన ఒక కార్పోరేటర్ సూపర్ స్టార్ క్రిష్ణ విగ్రహం విశాఖలోని ఆర్ కే బీచ్ లో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని జీవీఎంసీ మేయర్ ని కోరారు.

By:  Satya P   |   8 Nov 2025 8:56 AM IST
విశాఖ బీచ్ లో సూపర్ స్టార్ విగ్రహం
X

విశాఖలో సూపర్ స్టార్ క్రిష్ణ విగ్రహ స్థాపన ఇటీవల ఎంత రచ్చ రేపిందో అందరికీ తెలిసిందే. విశాఖలోని ప్రధాన జంక్షన్ అయిన జగదాంబ వద్ద దివంగత మహా నటుడు క్రిష్ణ విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి అనుమతులు లేవని విగ్రహాన్ని క్రేన్ తెచ్చి మరీ తీసి పక్కన పెట్టారు. దాంతో సూపర్ స్టార్ అభిమానులు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు రాజకీయాలు తెలియవని ఆయన మంచి నటుడు అంతకు మించి మంచి మనిషి అని వారు అంటున్నారు దీని మీద సోషల్ మీడియా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రిష్ణ అభిమానులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీచ్ రోడ్డులో :

అయితే దీని మీద జనసేనకు చెందిన ఒక కార్పోరేటర్ సూపర్ స్టార్ క్రిష్ణ విగ్రహం విశాఖలోని ఆర్ కే బీచ్ లో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని జీవీఎంసీ మేయర్ ని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందించారు. క్రిష్ణ తో పాటుగా విశాఖ నగర పాలక సంస్థ ను పాలించిన దివంగత మేయర్లు డీవీ సుబ్బారావు, సబ్బం హరి విగ్రహాలను కూడా విశాఖ బీచ్ లో ప్రతిష్టించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

అందరి సహకారంతో :

జీవీఎంసీ కనుక అనుమతిస్తే అందరి సహకారంతో ఆ ప్రముఖుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని సదరు కార్పొరేటర్ పేర్కొన్నారు. క్రిష్ణ అందరి వాడు అని ఆయనకు విశాఖ మహా నగరంలో ఎంతో మంది అభిమానులు ఉన్నారని గుర్తు చేశారు. ఆయన గౌరవం నిలిపేలా బీచ్ రోడ్డులో మంచి విగ్రహం నెలకొల్పుతామని తెలిపారు.

వైసీపీ కూడా :

అయితే సూపర్ స్టార్ క్రిష్ణ విగ్రహాన్ని తొలగించి అవమానించారని వైసీపీ ఆరోపించింది. ఒక దివంగత నటుడిని ఈ విధంగా చేస్తారా అని కూడా విమర్శించింది. విశాఖ దక్షిణ నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ దీని మీద మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ బీచ్ లో ఘనంగా క్రిష్ణ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కూటమి చొరవతో :

అయితే క్రిష్ణ అభిమానుల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వమే సూపర్ స్టార్ విగ్రహాన్ని బీచ్ లో తొందరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతుందని అంటున్నారు.జీవీఎంసీలో కూటమి పాలన ఉంది. దాంతో బీచ్ రోడ్డులో సరైన స్థలంలో క్రిష్ణ విగ్రహానికి ఏర్పాటుకు అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖుడు అల్లు రామలింగయ్య వంటి వారి విగ్రహాలు అక్కడ ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే విశాఖ బీచ్ లో సూపర్ స్టార్ అందమైన విగ్రహం తొందరలో ఆవిష్కృతం అవుతుంది.