Begin typing your search above and press return to search.

పార్టీలను మింగేస్తున్న కుటుంబాలు

బీజేపీ ఎపుడూ ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలు అంటుంది. అదే నిజం కూడా. ఏక వ్యక్తి పార్టీలుగా ఇవి ఉంటాయని విమర్శలు ఉన్నాయి.

By:  Satya P   |   4 Sept 2025 9:30 AM IST
పార్టీలను మింగేస్తున్న కుటుంబాలు
X

బీజేపీ ఎపుడూ ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలు అంటుంది. అదే నిజం కూడా. ఏక వ్యక్తి పార్టీలుగా ఇవి ఉంటాయని విమర్శలు ఉన్నాయి. అంతే కాదు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా వ్యవహరిస్తున్నాయని అంతా అంటూంటారు. అక్కడ పెత్తనం అంతా కుటుంబ సభ్యులదే ఉంటుంది. తండ్రి తరువాత కుమారుడు కుమార్తె వారసత్వం కోసం వస్తారు. ఒకరి తర్వాత ఎక్కువ మంది ఉంటే ఇక తంటాలే. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన నాయకులు కానీ అధినేతను నమ్ముకుని రాజకీయం చేసే కార్యకర్తలకు కానీ పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పార్టీ కోసం వారు ప్రాణం పెడుతున్నా కూడా ఈ కుమ్ములాటల వల్ల వారే పూర్తిగా నలిగిపోతుంటారు.

సంక్షోభాలకు పుట్టిల్లు :

ఇక ప్రాంతీయ పార్టీలలో సంక్షోభాలు అన్నీ కుటుంబాల నుంచే వస్తాయని చెబుతారు.తెలుగునాట చూస్తే మూడు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీలో అతి పెద్ద సంక్షోభం వచ్చింది. ఎన్టీఆర్ కుటుంబంలో వారే తిరుగుబాటు చేశారు. ఇందులో బయట వ్యక్తులకు కానీ పార్టీలో ఏళ్ళ కొలది పనిచేసిన నాయకులకు కానీ పెద్దగా సంబంధం లేదు. అయితే అధికార మార్పిడి సులువుగా జరగకపోయినా చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ముప్పయ్యేళ్ళ పాటు సక్సెస్ ఫుల్ గా పార్టీని నడిపించారు. ఆ తరహా ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా ఆయన కట్టుదిట్టమైన చర్యలే తీసుకున్నారు.

వైసీపీకి చెల్లెమ్మ షాక్ :

ఇక చూస్తే మరో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవి వైసీపీ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలకూ కుటుంబం ఎంతలా పునాదిగా ఉందో అంత లాగానే ఇబ్బందులు కూడా అక్కడ నుంచే వస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీని పటిష్టం చేయడానికి వైఎస్సార్ కుటుంబం అంతా ఒక్కలా నిలిచి పనిచేసింది. అయితే 2019లో అధికారంలోకి రాగానే వైసీపీలో సంక్షోభం ఏర్పడింది. అయితే అది పార్టీలోనే వచ్చింది. షర్మిల పార్టీ నుంచి వేరు పడి వైఎస్సార్ టీపీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత ఆమె దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ అయ్యారు. జగ ని 2024 ఎన్నికల్లో ఓటమి పాలు చేయడానికి షర్మిల పాత్ర కూడా కీలకంగా మారిందని అందరికీ తెలిసిన సంగతే.

బీఆర్ఎస్ కి బిడ్డతోనే పేచీ :

కట్ చేస్తే తెలంగాణాలో మరో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీ అధికారంలో పదేళ్ళ పాటు ఉంది. అపుడు ఏవీ పేచీ పూచీలు రాలేదు. సాధారణంగా అధికారంలో ఉన్నపుడే విభేదాలు వస్తాయి. కాబట్టి అంతా బాగానే ఉంది అనుకున్నారు కానీ ఓటమి తరువాతనే బీఆర్ ఎస్ బీటలు వారుతోంది. ఏకంగా కేసీఆర్ సొంత బిడ్డ కవిత వల్లనే గులాబీ పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి. ఆమె ఎదురు నిలిచి బీఆర్ఎస్ అధినాయకులను నిలదీస్తున్నారు ప్రత్యర్ధులకు అలా ఆయుధాలు అందిస్తున్నారు. దాంతో బీఆర్ఎస్ బిత్తర పోవాల్సి వస్తోంది.

సొంత చిక్కు ముళ్ళతోనే :

ఇక చూస్తే కనుక రేపటి రోజున బయట ప్రత్యర్థులతో కాదు సొంత వారితోనే యుద్ధం చేయాల్సి రావడం బీఆర్ఎస్ కి అయినా వైసీపీకి అయినా పెను సవాల్ అని అంటున్నారు. ఇక్కడ సెంటిమెంట్ కూడా ముడి పడి ఉంటుంది. జగన్ విషయమే తీసుకుంటే తల్లికి చెల్లికి అన్యాయం చేశారు అని ప్రత్యర్థులు ఈ రోజుకీ విమర్శిస్తున్నారు. రేపటి రోజున బీఆర్ఎస్ కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కోవచ్చు. దాని వల్ల పార్టీకి కొత్త ఇబ్బందులు నష్టాలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవమని ఒక సామెత ఉంది. కానీ ఇంట్లోనే రచ్చ చేసుకుంటే ఎలా అన్నది కుటుంబాల ఆధీనంలో ఉన్న పార్టీలకే తెలియాలని అంటున్నారు.

అధిగమించిన పార్టీలు :

ఇక పొరుగున ఉన్న తమిళనాడులో చూస్తే కనుక డీఎంకేలోనూ వారసత్వ పోరు కుటుంబ కలహాలు ఒక దశలో ఎక్కువగానే పెచ్చరిల్లాయి. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరికి స్టాలిన్ కి మధ్య పార్టీ ఆధిపత్యం మీద పోరు అయితే ఉండేది. కానీ చివరికి స్టాలిన్ చాకచక్యంగా పార్టీని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అలాగే బీహార్ లో చూస్తే లాలూ ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ వారసుడిగా ఎదిగి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.

పెద్ద కుమారుడు నిన్నటి వరకూ చురుకుగా ఉన్నా ఆయన వ్యక్తిగత వివాదాల వల్ల సస్పెండ్ చేశారు. శివసేనలో కూడా థాక్రే బ్రదర్స్ కుటుంబ కలహాల వల్ల విడిపోయారు. కానీ ఇపుడు మళ్ళీ కలుస్తున్నారు. విషయం ఏమిటి అంటే పార్టీలు ఎవరు స్థాపించినా అవి జనసామాన్యంలో వెళ్ళి రాణిస్తాయి. అలాంటపుడు కుటుం వివాదాలతో వాటిని మింగేయాలని చేస్తే ప్రయత్నంలో ఎంతో మంది క్యాడర్ ఆశలు కూడా కరిగిపోతాయని గుర్తించి మసలుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.