Begin typing your search above and press return to search.

దేశంలో ఫేక్ వర్శిటీలు... ఎక్కడ ఎక్కువ అంటే

దేశంలో ఫేక్ వర్శిటీలు ఎక్కడ ఎక్కువ అంటే దేశ రాజధాని ఢిల్లీలోనే అని అంటోంది యూజీసీ. మొత్తం 22 గుర్తింపు లేని వర్శిటీలు దేశంలో ఉంటే అందులో ఏకంగా తొమ్మిది దాకా ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయని లెక్క చెప్పింది.

By:  Satya P   |   27 Oct 2025 12:00 AM IST
దేశంలో ఫేక్ వర్శిటీలు... ఎక్కడ ఎక్కువ అంటే
X

ఫేక్ అన్నది జన జీవనంలో భాగమైపోతోందా అన్న సందేహాలు భయాలు నెలకొంటున్నాయి. కాదేదీ ఫేక్ కి అనర్హం అన్న తరహాలో అహారం నుంచి అంతరిక్షం వరకూ అన్నీ ఫేక్ సరుకే ముందుకు వస్తోంది. ఒరిజినల్ కంటే ముందే ఫేక్ వీర విహారం చేస్తోంది. చదువుకోవడం నుంచి పూర్తిగా మారి చదువు కొనడం దాకా సాగుతున్న పరిణామ క్రమంలో ఫేక్ విద్యాలయాలు కూడా పుట్ట గొడుగుల్లా పుట్టుకుని వస్తున్నాయి ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అన్నది ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి గా ఉంది.

ఏకంగా 22 ఫేక్ వర్శిటీలు :

దేశంలో ఒకటీ రెండూ కాదు ఏకంగా 22 ఫేక్ యూనివర్శిటీలు ఉన్నాయని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తాజాగా చేసిన హెచ్చరికతో విద్యార్ధి లోకం వారి తల్లితండ్రులు తల్లడిల్లాల్సి వస్తోంది. తస్మాత్ జాగ్రత్త ఫేక్ వర్శిటీలు ఉన్నాయి సుమా అంటూ యూజీసీ ఒక పెద్ద బాంబునే పేల్చింది. ఢిల్లీలోని కోట్లా ముబారక్ పూర్లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ విషయంలో యూజీసీ గట్టి హెచ్చరికలనే చేసింది. ఈ వర్శిటీకి ఎలాంటి అనుమతులు లేవని తేల్చేసింది. అయినా డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోంది అని పేర్కొనడం సంచలనంగా మారింది.

ఏ విలువ ఉండదు :

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సంస్థల వంటి ఫేక్ వర్శిటీలు జారీ చేసే డిగ్రీలకు ఏ విలువ ఉండవని యూజీసీ స్పష్టం చేసింది. అంతే కాదు ఈ వర్శిటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ చట్టాలను కూడా పాటించడం లేదని వాటికి లోబడి ప్రారంభించలేదని కూడా యూజీసీ క్లారిటీ ఇచ్చింది. దాంతో ఇందులో చదివే విద్యార్థులు అంతా అలెర్ట్ కావాలని సూచించింది.

ఢిలీలోనే ఎక్కువగా :

దేశంలో ఫేక్ వర్శిటీలు ఎక్కడ ఎక్కువ అంటే దేశ రాజధాని ఢిల్లీలోనే అని అంటోంది యూజీసీ. మొత్తం 22 గుర్తింపు లేని వర్శిటీలు దేశంలో ఉంటే అందులో ఏకంగా తొమ్మిది దాకా ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయని లెక్క చెప్పింది. ఇక మరో అయిదు యూపీలో ఉంటే మిగిలినవి కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఏపీ, పాండిచ్చేరీలలో నిర్వహిస్తున్నారు అని యూజీసీ తన నివేదికలలో డేటా లో స్పష్టంగా చెబుతోంది. ఇక ఢిల్లీలో ఇన్ని ఫేక్ వర్శిటీలు ఎందుకు ఏర్పాటు అయ్యాయి అంటే విద్యార్ధులను పూర్తిగా మోసం చేస్తూ ఇవి తమ పబ్బం గడుపుకుంటున్నాయని అంటున్నారు.

ఆకట్టుకునే పేర్లతో :

అసలు కంటే నకిలీ ఘనం అన్నట్లుగా ఫేక్ వర్శిటీలు తమ సంస్థలకు పెట్టే పేర్లు ఎంత అట్రాక్టివ్ గా ఉంటున్నాయని అంటున్నారు. నేషనల్, టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వంటి భారీ పదాలనే వాడుతూ అమాయక విద్యార్ధులను వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నరు అయితే ఫేక్ వర్శిటీ అని ఎలా తెలుస్తుంది అన్న దానికి యూజీసీ అధికారులు సమాధానం చెబుతున్నారు. విద్యార్ధులు ఏదైనా ఒక విద్యా సంస్థలో కానీ ప్రైవేట్ వర్శిటీలో కానీ చేరాలి అనుకుంటే సెక్షన్ 2 ఎఫ్ లేదా 3 కింద యూజీసీ గుర్తించిన జాబితాలో ఈ వర్శిటీలు ఉన్నాయ్లో లేవో ఒక్కసారి తనిఖీ చేసుకోవాలని సూచిస్తోంది.

మంచిగా ఉన్నారని :

అంతే కాకుండా ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్‌ఎంసీ వంటి కౌన్సిల్స్‌ నుంచి ఈ వర్శిటీలకు ఏ కోర్సులలో నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నాయి, వాటి వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఆ మీదటే అక్కడ చేరాలని యూజీసీ చెబుతోంది. పేరు బాగుందని, లేదా మాయ మాటలు చెప్పి మంచిగా ఉన్నారని పొరపాటునా ఫేక్ వర్శిటీలలో చేరారో విలువైన కాలం వృధాగా పోవడమే కాదు జీవితం కూడా ఇబ్బందులో పడుతుందని యూజీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో అప్రమత్తం కావాల్సింది విద్యార్ధి లోకం దానితో పాటుగా వారి తల్లిదండ్రులే అని అంటున్నారు. మోసం చేసేవారు ఎపుడూ ఉంటారు, వారి బారిన పడకుండా జాగ్రత్త పడడంలోనే వివేకం ఉంటుంది. అందునా విద్యాలయాల్లో చేరే యువతకు ఈ స్పృహ మరింత అవసరం అంటున్నారు.