కాబోయే భార్యను ఇంప్రెస్ చేసేందుకు ఏకంగా ప్రధాని ఈవెంట్ లోకి.. చివరికి పరిస్థితి ఏమైందంటే?
కాబోయే భార్యను, ఆమె కుటుంబ సభ్యులను ఇంప్రెస్ చేసేందుకు మనుషులు ఏ స్థాయికైనా తెగిస్తారని నిరూపించే విస్తుపోయే ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగు చూసింది.
By: A.N.Kumar | 11 Sept 2026 9:50 PM ISTకాబోయే భార్యను, ఆమె కుటుంబ సభ్యులను ఇంప్రెస్ చేసేందుకు మనుషులు ఏ స్థాయికైనా తెగిస్తారని నిరూపించే విస్తుపోయే ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగు చూసింది. తనను తాను అత్యంత పవర్‌ఫుల్ ప్రభుత్వ అధికారిగా చూపించుకోవాలనే తపనతో ఓ యువకుడు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారిగా నకిలీ గుర్తింపు కార్డు సృష్టించి ప్రధాని పాల్గొన్న అధికారిక కార్యక్రమంలోకి ప్రవేశించేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు.
అసలేం జరిగింది?
ఢిల్లీకి చెందిన రోహన్ పరేఖ్ అనే యువకుడికి త్వరలోనే వివాహం నిశ్చయమైంది. అత్తవారింటి వద్ద తన స్థాయి, పలుకుబడి, అధికారాన్ని గొప్పగా ప్రదర్శించుకోవాలని భావించాడు. ఇందుకోసం అత్యంత విశ్వసనీయంగా కనిపించే ఒక నకిలీ పీఎంఓ ఐడీ కార్డును తయారు చేయించుకున్నాడు. ప్రధానమంత్రి పాల్గొనే ఒక ఉన్నత స్థాయి కార్యక్రమానికి ఆ ఫేక్ ఐడీతో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రధాని పర్యటనల వద్ద ఉండే కట్టుదిట్టమైన ఎస్పీజీ (ఎస్.పీజీ), పోలీసు భద్రతా వర్గాలు అతడి ఐడీని తనిఖీ చేసి అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు రంగు బయటపడింది.
విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
పోలీసుల ప్రాథమిక విచారణలో రోహన్ పరేఖ్ చెప్పిన విషయాలు విని అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. దేశ భద్రతకు సంబంధించి ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో మొదట విచారించినప్పటికీ కేవలం తన కాబోయే భార్య, ఆమె కుటుంబ సభ్యుల దృష్టిలో 'హీరో' అనిపించుకోవడానికే ఈ నాటకమాడినట్లు అతడు అంగీకరించాడు. ఈ కుట్రలో రోహన్‌కు సహకరించిన వారిపై పోలీసులు తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు. రోహన్‌కు సొంతంగా భద్రత ఉందనే కలరింగ్ ఇచ్చేందుకు పనిచేసిన అతడి డ్రైవర్, బాడీగార్డులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నకిలీ గుర్తింపు కార్డు తయారీలో కీలక పాత్ర పోషించిన ప్రథమేశ్ అనే మరో అనుమానితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
సీరియస్‌గా తీసుకున్న భద్రతా దళాలు
కేవలం ఆకట్టుకోవడానికే చేసినప్పటికీ ప్రధాని భద్రతా వలయాన్ని దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించడం.. ప్రభుత్వ ముద్రలతో ఫేక్ ఐడీ కార్డులు తయారు చేయడం అత్యంత తీవ్రమైన నేరంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారిగా నటిస్తూ మోసానికి పాల్పడటం.. దేశ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఒక చిన్న ప్రదర్శనా బుద్ధి చివరికి ఆ యువకుడిని జైలు పాలు చేయడమే కాకుండా అతడి పెళ్లిని కూడా అనిశ్చితిలోకి నెట్టివేసింది.
